Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారికంగా వెల్లడించిన డీఐసీజీసీ
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ఖాతాదారులు కేవలం రూ.లక్ష వరకే బీమా కవరేజీ లభిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుబంధ సంస్థ ''డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్'' (డీఐసీజీసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కిందఅడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా డీఐసీజీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. 'డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు.., లేదా నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ రూ.లక్ష వరకు బీమా మాత్రమే కవరేజీ అందిస్తుంది. పొదుపు, ఫిక్స్‌డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లన్నింటికీ ఇదే తరహా బీమా రక్షణ వర్తిస్తుంది' అని డీఐసీజీసీ తన సమాధానంలో పేర్కొంది. అయితే ఈ బీమా కవరేజీ పెంపుపై ప్రతిపాదనేమైనా ఉందా అని అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. దానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచేందుకు ప్రభుత్వం చట్టాలను తీసుకురానుందని ఇటీవల వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐ స.హ.చట్టం ద్వారా డీఐసీజీసీకి దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ కార్పొరేషన్ చెప్పిన సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది. పీఎంసీ బ్యాంక్ వ్యవహారం నేపథ్యంలో ఈ బీమా కవరేజీ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఖాతాదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే.. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డీఐసీజీసీ డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ట మొత్తం వరకూ బీమా భద్రత కల్పిస్తోంది. దీంతో బ్యాంక్ ఖాతాదారుల్లో మళ్లీ కలవరం మొదలైంది. రోజుకో బ్యాంక్ మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంచడం ఎంత వరకు సురక్షితమనే భావన మళ్లీ ఖాతాదారుల్లో మొదలైంది.