Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వాహనాన్ని ఆవిష్కరించిన మహీంద్రా
ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారి బీఎస్-6 ప్రమాణాల ఇంజిన్‌తో కూడిన వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. సబ్ కాంప్టాక్ట్ ఎస్‌యూవీ ''ఎక్స్‌యూవీ 300''లో బీఎస్-6 మోడల్‌ను సంస్థ బుధవారం అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. మహీంద్రా ఎక్స్‌యూవీ బీఎస్-6 ధర రూ.8.30 లక్షల నుంచి మొదలై రూ.11.84 లక్షల మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది. బీఎస్-4 వెర్షన్‌తో పోలిస్తే దీని ధర రూ.20,000 వరకు పెరిగినట్టయింది. కొత్త వాహనం విడుదలపై మహీంద్రా ఆటోమోటీవ్ అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ.. ''బీఎస్-6 ప్రయాణంలో కొత్త వాహనం ఆవిష్కరణ ఒక కీలక మైలురాయి. కఠినమైన నిబంధనలను సంతృప్తిపరిచేందుకు తక్కువ సమయం, ఒత్తిడి ఉన్నా.. మేం మా పంపిణీదారులతో కలిసి పనిచేసి విజయవంతమయ్యాం. మా వాహనాలు మొత్తాన్ని కొత్త సాంకేతికతతో అప్ గ్రేడ్ చేస్తాం'' అని అన్నారు. ఇప్పటివరకు మహీంద్రా డీజిల్ పోర్టుఫోలియో మాత్రం బీఎస్-6 డీజిల్ నిబంధనలకు అనుగుణంగా మార్చలేదు. కాకపోతే నిబంధనలు అమల్లోకి రావడానికంటే ముందే తాము బీఎస్6 ఇంజిన్ల వాహనాలను సిద్ధం చేస్తామని మహీంద్రా వెల్లడించింది. ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టుగా సంస్థ తెలిపింది. రానున్న రోజుల్లో బీఎస్-6ను ఇతర వాహనాలకు కూడా విస్తరించనున్నట్టుగా సంస్థ వెల్లడించింది.