Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే 33 పీఎస్‌యూలతో జాబితా సిద్ధం..
- వాటావిక్రయం విఫలంతో సర్కారు కొత్త ప్లాన్
- వ్యాపారవేత్తగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
- భారీగా నష్టపోనున్న పీఎస్‌యూల ఉద్యోగులు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు తన గురుతర బాధ్యతలను విస్మరించి పాలన సాగిస్తోంది. ఒకప్పుడు జాతికి తరగని సంపదగా నిలిచి.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పలు ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) మూసివేసేందుకు మోడీ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవ్వడం, నిర్మాణాత్మక చర్యలు లోపించడంతో గత కొన్ని రోజులుగా నష్టాల్లోకి జారుకున్న వివిధ ప్రభుత్వ సంస్థలను మూసివేయాలని మోడీ గవర్నమెంట్ భావిస్తున్నట్టుగా సర్కారు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ నష్టాలలో నడుస్తున్న దాదాపు 33 ప్రభుత్వ రంగ సంస్థలను సర్కారు గత ఐదేండ్ల నుంచి గుర్తిస్తూ వచ్చింది. ఈ సంస్థలు వరుసగా నష్టాలను నమోదు చేస్తుండడంతో ఆయా సంస్థలలో వాటా విక్రయం జరపాలని ప్రభుత్వం తొలత నిర్ణయించింది. ఇందుకు గాను తగిన అనుకూల వాతావరణం కనిపించకపోవడంతో సర్కారు ఈ సంస్థలను ఇక అమ్మివేయడమే మేలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయా సంస్థలను నిలబెట్టేందుకు గాను మరింత ప్రజా ధనాన్ని వ్యచ్చించడం, నష్టాలు మరింతగా పెరిగేంత వరకు వేచి చూడడం సబబు కాదన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది
ప్రమాదంలో కీలక సంస్థలు..
నష్టాలలో నడుస్తున్న కారణంగా తొలత వాటా విక్రయానికి ప్రతిపాదించిన వివిధ సంస్థలకు బిడ్డర్ల నుంచి తగిన స్పందన లభించకపోవడ అమ్మకానికి ప్రతిపాదిస్తున్న పీఎస్‌యూల జాబితాలో పలు కీలక సంస్థలు ఉన్నాయి. ప్రమాద పుటంచున నిలిచిన సంస్థ జాబితాలో హెలికాప్టర్ సేవల సంస్థ వపన్ హన్స్, భారత్ పంప్ అండ్ కంప్రెసర్స్, హిందుస్థాన్ యాంటీ బయాటిక్స్, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్, హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్కూటర్స్ ఇండియా తదితర సంస్థలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కూడా ఈ సంస్థలలో వాటా విక్రయానికి పెద్దగా స్పందన లభించే అవకాశాలు కనిపించకపోవడంతో.. దశలవారీగా వీటిని మూసివేయడమే మేలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
నిలబెట్టే ప్రయత్నాలు అంతంతే..
నష్టాల్లో ఉన్న సంస్థలకు తగిన ఆర్థిక, సాంకేతిక తోడ్పాడుటును అందించి వాటిని ప్రయివేటు సంస్థలకు దీటుగా అంతర్జాతీయ పోటీని తట్టుకొనేలా తయా రు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుపోవడంపై సర్వత్రా విమర్శ లు వినవస్తున్నాయి. సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న ప్రభుత్వం.. నష్టాలలో ఉన్న సంస్థల విషయంలో ఒక కార్పొరేట్‌గా వ్యవహరిస్తుండడం సరికాదన్న వాదన లూ వినవస్తున్నాయి. ఆయా సంస్థలకు అదనంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు.. ఆ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందకు, ప్రయివేటుకు దీటుగా పోటీప రరడేందుకు అవసరమైన సాయం అందిస్తే.. ప్రభుత్వం అమ్మకానికి ఎంపిక చేసిన చాలా సంస్థలు తిరిగి నిలదొక్కుకొనే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులకు తీరని నష్టం..
పూర్తి వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని మోడీ సర్కారు నష్టాలలోని సంస్థల మూసివేత కారణంగా ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఉన్నఫలంగా మూసివేస్తే ఆయా సంస్థలో పని చేస్తున్న దాదాపు 10 నుంచి 15 వేల మంది ప్రత్యక్ష ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ మూసివేత గురించి వేగంగా ప్రతిపాదనలు చేస్తున్న అధికార వర్గాలు.. ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేలా ఎలాంటి పరిహారం చెల్లించాలన్న విషయంపై కనీస దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. సర్కారు వ్యవహార శైలిని పరిశీలిస్తే ఉద్యోగులను పట్టించుకోకుండా.. ఆయా సంస్థలను రాత్రికిరాత్రి మూసివేస్తున్నట్టుగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని పెట్టుబడులు రావడం లేదని గగ్గోలు పెడుతూ ప్రోత్సాహకాల పేరుతో లక్షల కోట్ల ప్రజాసొమ్మును వృథా చేస్తున్న ప్రభుత్వం అందులో కొంతైనా నష్టాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను నిలబెట్టుందుకు ఖర్చు చేస్తే ఆయా సంస్థలు తిరిగి లాభాలలోకి మరలే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేంద్రలోని మోడీ సర్కారు వాస్తవాలను గమనిస్తూ ఇప్పటికైనా సామాజిక దృక్పథంతో దేశ విశాలమైన ప్రయాజనాలను దృష్టి ఉంచుకొని పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.