Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధి రేటు మరింతగా పడిపోనుంది.
- ధరల పెరుగుదల ఆందోళనకరమే: ఎంపీసీ
న్యూఢిల్లీ: దేశంలో ఎగిసిపడుతోన్న ఆహారోత్పత్తుల ధరలు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సెగ పెట్టాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆందోళనలో వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యపడలేదని గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదికి చెందిన ఆరో ద్వైమాసిక కీలకమైన పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. ఈ సమీక్షలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15 శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్ రెపోరేటు 4.90శాతం వద్ద కొనసాగించాలని కూడీ ఎంపీసీ నిర్ణయించింది. ఇటీవలి కాలంలో కిలో ఉల్లి ధర రూ.100 పైనా పలకడంతో పాటు ఇతర ఆహారోత్పత్తుల ధరలు కూడా చుక్కలనంటుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రధానంగా వడ్డీరేట్ల తగ్గింపునకు అడ్డంకిగా నిలిచాయని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్వయంగా అంగీకరించారు. ఆహార ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని, దీంతో రేట్ల తగ్గింపు యోచన విరమించామని తెలిపారు.రాబోయే త్రైమాసికంలోఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవలి గణాంకాలు సూచించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా రేట్లు యథావిథిóగా కొనసాగించేందుకు అంగీకరించారన్నారు. ప్రస్తుత పరపతి విధాన సమీక్ష కమిటీలో డాక్టర్ చేతన్ ఘటె, డాక్టర్ పమి దువా, డాక్టర్ రవీంద్ర హెచ్ ఢొలాకియా, డాక్టర్ మైఖెల్ దేబబ్రత పాత్ర, భిభు ప్రసాద్ కానుంగో, శక్తికాంత దాస్ ఉన్నారు. ఇది వరకు వరుసగా ఐదు సార్లు వడ్డీ రేట్లు తగ్గించగా.. ఆరోసారి యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ఈ నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో నష్టాల పాలయ్యాయి.
టెలికాం బాదుడు ఇబ్బందే..!
ఆహార పదార్ధాల ధరలు పెరగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని దాస్ పేర్కొన్నారు. టెలికాం టారిఫ్‌ల పెంపుదల కూడా పరోక్షంగా ద్రవ్యోల్బణంపై పడుతుందని పేర్కొన్నారు. ఆర్బీఐ ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ధరలు దిగివస్తే తప్పా.. వడ్డీ రేట్లను ఇక తగ్గించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రేట్ల కోతకు విరామం ఇచ్చామన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఎలా మారుతుందో చూడాలని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రయివేటు టెల్కోలు చార్జీల పెంపునపై దృష్టి పెట్టాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాపోన్ ఐడియాలు మొబైల్ టారీఫ్‌లను 40-50 శాతం వరకు పెంచడానికి కసరత్తు చేస్తోన్న విషయం విధితమే.
ఎంపీసీలో ప్రధానాంశాలు..
- రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15 శాతం వద్దే కొనసాగనుంది.
- 2019-20 జీడీపీ అంచనాలు 5 శాతానికి కోత.
- అక్టోబర్- మార్చి కాలంలో వృద్ధి 4.9-5.5 శాతంగా అంచనా.
- ద్రవ్యోల్బణం స్వల్ప కాలానికి పెరగొచ్చని ఆందోళన.
- వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 5.1 శాతంగా ఉండొచ్చు.
- అంతర్జాతీయంగా మందగమనం కనిపిస్తోంది.
- భవిష్యత్తులో ధరలు తగ్గితేనే వడ్డీ రేట్ల కోత ఉంటుంది.
- వ్యక్తిగత పర్సన్ టు పర్సన్ (పి2పి) రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు.
వృద్ధి 5 శాతానికే పరిమితం..
భారత వృద్ధి రేటు అంచనాలకు ఆర్బీఐ మరింత కోత పెట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ 5 శాతానికే పరిమితం కావొచ్చన్న అంచనాకు వచ్చింది. ఇంతక్రితం ఈ అంచనా 6.1 శాతంగా ఉంది. 2019-20 అక్టోబర్ నుంచి మార్చి కాలం ద్వితీయార్థంలో వృద్ధి 4.9- 5.5 శాతం ఉండొచ్చని విశ్లేషించింది. 2020-21 అంచనాలకు కోత పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వద్ధి 5.9- 6.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో మందగమనం కనిపిస్తోందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. అయిదే దేశ ఆర్ధిక వ్యవస్థలో మాత్రం కొంతమేర రికవరీ సంకేతాలు కనపడుతోన్నాయన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో మాంద్యం నెలకొనడంతో ఈ దఫా వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని చాలా ఎజెన్సీలు, ఆర్ధిక నిపుణులు ముందు అంచనా వేశారు. ప్రధానంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, 2019 జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి, సెప్టెంబర్‌లో 4.5 శాతానికి దిగజారడంతో వడ్డీ రేట్ల తగ్గింపునపై అంచనాలు మరింత పెరిగాయి. కాని ద్రవ్యోల్బణ భయాలతో ఆర్బీఐ వరుసగా ఆరో సారి వడ్డీ రేట్ల తగ్గింపునకు వెళ్లకుండా ఆపాయని యస్ సెక్యూరిటీస్ ప్రతినిధి అమర్ ఆంబానీ చెప్పారు. భవిష్యత్తులోనూ రేట్ల తగ్గింపునకు ద్రవ్యోల్బణమే కీలకమన్నారు. మందగమన భయాలున్నందున రేట్లు తగ్గిస్తారన్న ఎక్కువమంది అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ రేట్లను యథాతధంగా కొనసాగించిందని కోటక్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధి సుధాకర్ షాన్‌బాగ్ పేర్కొన్నారు.