Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం సాయం అందించకుంటే మరోదారిలేదు: కుమార మంగళం బిర్లా
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజుల (ఏజీఆర్) బకాయిల విషయంలో తమకు ప్రభుత్వం నుంచి తగిన ఊరట లభించకుంటే వొడాఫోన్-ఐడియా సంస్థ మూతపడడం ఖాయమని బిర్లా గ్రూప్ చైౖర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏలాంటి సాయం రాకుంటే వొడాఫోన్-ఐడియా కథ కంచికి చేరినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే సంస్థ నెత్తిన భారీగా రుణభారం ఉందని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కంపెనీకి అశనిపాతంగా మారిందన్నారు. తక్షణ సాయం లభించకుంటే వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్టేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ చెల్లించాల్సిన రూ 53,058 కోట్ల బకాయిలపై ప్రభుత్వం తమకు భరోసా ఇవ్వకుంటే సంస్థ మనుగడ కష్టమేనని పేర్కొన్నారు. ఇదే ఇప్పటికే సంస్థ నెత్తిన భారీగా రుణభారం ఉంది. ఈ రంగం కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే కంపెనీ మూత ఖాయమని బిర్లా అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం టెల్కోల స్పెక్ట్రం బకాయిల చెల్లింపు కాలపరిమితి పెంచింది. కానీ అసలు సమస్య ఏజీఆర్ బకాయిలని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 4.5 శాతానికి దిగజారిన క్రమంలో పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు కలసి టెలికాం లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు కలుపుకుని గత 14 ఏళ్లకు గాను ప్రభుత్వానికి రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని టెలికాంలు కోరుతున్నాయి.