Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారాంతంలో సూచీలు మార్కెట్లు
ముంబయి: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికే పరిమితం కావొచ్చంటూ భారతీయ రిజర్వు బ్యాంక్ వెల్లడించిన అంచనాలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. దీంతో స్టాక్ మార్కెట్లు వారాంతంలో తీవ్ర నష్టాలను నమోదు చేసింది. ఇప్పటికే పలు ఎజెన్సీలు, విత్త సంస్థలు దేశ జీడీపీ అంచనాలకు అమాంతం కోత పెట్టడంతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 40,445 స్థాయికి పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా 104 పాయింట్లు పతనమైన 12వేల దిగువన 11,914 వద్ద స్థిరపడింది. 2019-20 అక్టోబర్ నుంచి మార్చి కాలం ద్వితీయార్థంలో వృద్ధి 4.9- 5.5 శాతం ఉండొచ్చని ఆర్బీఐ తన ఎంపీసీ సమావేశంలో విశ్లేషించిన విషయం తెలిసిందే.. దీంతో ఈ ఏడాదిలో మూడో సారి జీడీపీ అంచనాలను సవరించినట్టయింది. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నష్టాలను చవి చూశాయి. ఆటో సూచీ 1.07 శాతం, ఫార్మా 1.17 శాతం, బ్యాకింగ్ 1.17 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.84 శాతం, ఐటీ 0.51 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. సెన్సెక్స్‌లో ఆరు స్టాక్స్ మాత్రమే లాభపడగా.. మిగితా 24 షేర్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. కోటక్ బ్యాంకు, టాటా స్టీల్, రిలయన్స్, ఆసియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు మాత్రమే 1.67 శాతం వరకు లాభపడ్డాయి. కాగా యెస్ బ్యాంకు 10.63 శాతం, ఎస్‌బీఐఎన్ 5.40 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంకు 3.50 శాతం, టాటా మోటార్స్ 3.07 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.