Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాల లభ్యతపై ట్విన్ బ్యాలెన్స్‌షిట్ ప్రభావం..!
- ఎన్‌బీఎఫ్‌సీ రుణాలతో బ్యాంకులకు చిక్కులు
- వ్యవస్థలో కొత్త రుణాలు గగనంగా మారాయి..
- దీంతో ఆర్థిక వ్యవస్థ రుగ్మత మరింత పెరిగింది : మాజీ సీఈఏ అరవింద్ సుబ్రహ్మణియన్ విశ్లేషణ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుందని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వంద్వ బ్యాలెన్స్‌షీట్ విధానపు రెండో దశ ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనుభవిస్తోందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం వెలువరిస్తున్న గణాంకాలను విశ్లేషించి చూస్తే దేశంలో సాధారణ మందగమన పరిస్థితులు కాకుండా 'మహా మందగమనం' పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి సుస్పష్టమవుతోందని ఆయన అన్నారు. తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ 'అంపశయ్య' పైకి సాగుతోందని ఆయన అభివర్ణించారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో ఆయన సమర్పించి ఒక ముసాయిదా పరిశోధన పత్రంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఆందోళనకర పరిస్థితులను ఆయన స్పృశించారు. 2014 డిసెంబరుకు ముందు దేశంలోని ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయని ఇది ట్విన్‌బ్యాలెన్స్‌షీట్ సమస్యగా (టీబీఎస్‌గా) ఆయన అభివర్ణించారు. 2004-11 మధ్య కాలంలో పెట్టుబడుల బూమ్ ఉన్నప్పుడు బ్యాంక్‌లు ఉక్కు, విద్యుత్తు, మౌలిక రంగంలోని సంస్థలకు ఇచ్చిన రుణాలు క్రమంగా ప్రస్తుతం మొండి బాకీలుగా మారుతున్నాయని ఆయన అన్నారు. దీనిని ఆయన టీబీఎస్ తొలి దశగా (టీబీఎస్-1) వర్ణించారు. కేంద్రంలోని మోడీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు తరువాత కాలంలో బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), స్థిరాస్తి సంస్థల రుణాలు భారీగా మొండి బాకీలుగా మారుతున్నాయని ఆయన వివరించారు. దీనిని టీబీఎస్ రెండో దశగా (టీబీఎస్-2) ఆయన అభివర్ణించారు. నోట్ల రద్దు తరువాత అత్యధికంగా ప్రజలు తమ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని ఆయన అన్నారు. ఇలా వచ్చిన సొమ్ములో అత్యధిక మొత్తాన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలుగా అందించాయని ఆయన అన్నారు. ఆయా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ సొమ్ములో అత్యధిక మొత్తాన్ని స్థిరాస్తి రంగానికి రుణాలు అందించినట్టుగా ఆయన తెలిపారు. ఇప్పుడు స్థిరాస్తి రంగం డిమాండ్ లేక అనేక ప్రాజెక్టులు ఆగిపోయి కునారిల్లుతోందని అరవింద్ వివరించారు. 2017-18 నాటికి పరిస్థితిని విశ్లేషించి చూస్తే స్థిరాస్తి రంగంలో నిలిచిపోయిన మొత్తం రూ.5,00,000 మొండి బాకీలలో సగం ఎన్‌బీఎఫ్‌సీలు సంబంధించినవే ఉన్నట్టుగా ఆయన వివరించారు.
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ పతనంతో ప్రమాదం మొదలు..
గత ఏడాది సెప్టెంబరు నెలలో దేశంలోని ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక భారీ కుదుపు అని ఆయన అన్నారు. ఈ సంస్థలో దాదాపు రూ.90,000 కోట్ల మేర మౌలిక రంగ రుణాలు సమస్యల్లో చిక్కుకున్నాయని ఆయన వివరించారు. దీంతో ఈ సంస్థతో పాటు ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థకు నిధులను సమకూర్చిన రుణ దాత సంస్థలు కూడా ప్రమాదంలో పడిపోయినట్టుగా మాజీ సీఈఏ తెలిపారు. ఈ కుదుపుతో దేశంలోని ఎన్‌బీఎఫ్‌సీ రంగం పరిస్థితిపై ఆందోళనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. మార్కెట్లు ఎన్‌బీఎఫ్‌సీల దిద్దుబాటు చర్యలకు దిగాయని తెలిపారు.
స్థిరాస్తి రంగం కారణంగానే అస్థిరత..
ఇటీవలి కాలంలో ఎన్‌ఎబీఎఫ్‌సీ సంస్థలు అత్యధికంగా తమ రుణాలను అర్థికంగా రాణించలేకపోతున్న స్థిరాస్తి రంగానికి జారీ చేశాయని.. ఇప్పుడు ఇదే సమస్యలకు అసలు కారణంగా మారాయని ఆయన తన విశ్లేషణ పత్రంలో తెలిపారు. ఈ ఏడాది జూన్ ముగింపు నాటికి స్థిరాస్తి రంగం పరిస్థితిని విశ్లేషించి చూస్తే అమ్మకాలు బాగా దెబ్బతిన్న సంగతి తెలుస్తోందని అన్నారు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో దాదాపు 10 లక్షల ఇండ్లు, వివిధ రకాల గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయని ఆయన అన్నారు. వీటి విలువ దాదాపు రూ.8 లక్షల కోట్ల వరుకు ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఈ మొత్తం పరిశ్రమ నాలుగేండ్ల అమ్మకాలకు సమానమని ఆయన వివరించారు. దీంతో బ్యాంకులు, ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలను జారీ చేయడం మానేశాయని.. ఇది 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం పరిస్థితులకు కారణమైన లేమెన్ సంక్షోభానికి సరిసమానమైన పరిస్థితి అనివ్యాఖ్యానించారు.
బ్యాంకులపై తీవ్ర ప్రభావం..
ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ఆర్థిక వైఫల్యం బ్యాంకులపై భారీ ప్రభావాన్ని చూపుతు న్నాయి. చాలా బ్యాంకులు తమ రుణాల జారీలో దాదాపు 10-14 శాతం అప్పులను ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు జారీ చేశాయి. ఇప్పుడు ఈ సొమ్ము మొండి బాకీల రూపంలో వ్యవస్థలో ఇరుక్కుపోవడంతో ఇప్పుడు బ్యాంకింగ్ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలను అందించడం మానేశాయి. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల కొరత ఎర్పడింది. ఫలి తంగా స్థిరాస్తి కాకుండా ఇతర రంగాలకు చిన్న వ్యాపారాల వారికి నిధులు లభిం చడం కష్టంగా మారిపోయింది. మరోవైపు కన్జూమర్ డ్యూరెబుల్ వస్తువుల కొను గోళ్లకు కూడా ఎన్‌బీఎఫ్‌సీ అప్పులు అభించడం గగనంగా మారిందని వీరు తమ పత్రంలో విశ్లేషించారు. ఈ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల కమర్శియల్ క్రెడిట్ గత ఏడాది రూ.20 లక్షల కోట్ల గరిష్ట స్థాయి నుంచి ఈ ఏడాది తొలి అర్థ భాగంలో దాదాపు సున్నాకు చేరుకుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.
గణాంకాలు ఆందోళనకరం..
కేంద్రంలోని మోడీ సర్కారు టీబీఎస్-1 వల్ల వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా సరైన సమయంలో దృష్టి సారించకపోవడం, దీనికి తోడు టీబీఎస్-2 సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర గడ్డు కాలం ప్రారంభమైందని మాజీ సీఈఏ తన పత్రంలో పేర్కొన్నారు. డిమాండ్ లేకపోవడంతో కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి దాదాపు అథమ స్థితికి చేరుకుందని, మరోవైపు పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి పడిపోతోందని, ఎగుమతి-దిగుమతులు, ప్రభుత్వ ఆదాయం దాదాపు ప్రతికూల జోన్‌లోకి పడిపోయాయని సుబ్రహ్మణియన్ విశ్లేషించారు. ఈ గణాంకాలను బట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బు మరింత తీవ్రతరమైందని చెప్పొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇది దాదాపు అంపశయ్యపైకి చేరుకున్న పరిస్థితితో సమానమని సీఈఏ విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితులు దేశంలో 1991న ఏర్పడిన ఆర్థిక చెల్లింపుల సంక్షోభపు పరిస్థితులను గుర్తుకు తెస్తున్నట్టుగా ఆయన వివరించారు.
మొండి బాకీలు మరింతగా పైపైకి.. : మూడీస్
బ్యాంకింగేతర విత్త సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) వల్ల బ్యాంకుల మొండి బాకీలు మరింత పెరుగొచ్చని మూడీస్ హెచ్చరిం చింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలకొన్న నగదు సమస్య కొనసాగడం వల్ల వాటికి రుణాలందించిన బ్యాంకులకు తిరిగి సకాలంలో చెల్లింపులు జరగకపోవచ్చని విశ్లేషించింది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలపై ఆధారపడిన కంపెనీల్లో కూడా నిధుల కొరత ఏర్పడి బ్యాంకులకు గడ్డు కాలంగానే ఉంటుందని పేర్కొంది. వీటి రుణ వసూళ్ల రికవరీ చాలా నెమ్మదిగా ఉందని తెలిపింది. సూక్ష్మంగా విశ్లేషిస్తే ఎన్‌బీ ఎఫ్‌సీల నుంచి కంపెనీలకు, కంపెనీల నుంచి బ్యాంకులకు ఒత్తిడి బదిలీ అవు తుందన్నారు. ఫలితంగా బ్యాంకుల ఆస్తుల నాణ్యత, లాభదాయకత, మూల ధనం అన్నీ దెబ్బతిని వాటి రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని తెలిపింది. 2018లో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంక్షోభం ఏర్పడిన నాటి నుంచి ఈ విత్త సంస్థలు నగదు లభ్యత సమస్యను తీవ్రంగా ఎదుర్కొం టున్న విషయం తెలిసిందే. మూడీస్ విశ్లేషణ ప్రకారం.. ఎన్‌బీఎఫ్‌సీ రంగం అత్యధికంగా రియల్ ఎస్టేట్‌కు ఇచ్చిన రుణాలు ఒత్తిడిలో ఉండటంతో ఆ ప్రభావం బ్యాంకులపై పడింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులపై రిస్కు పెరగడంతో నిధుల సమీకరణ సవాల్‌గా మారింది. ఇది బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలు ఎన్‌బీఎఫ్‌సీపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమని పేర్కొన్నారు. దీంతో బ్యాంకుల్లో మొండి బాకీల పెరుగుదలకు కారణం కానున్నాయన్నారు. ముఖ్యంగా భారీగా అప్పులు పొందిన రియల్ ఎస్టేట్ రంగం ఎన్‌బీఎఫ్‌సీలపై ఒత్తిడిని పెంచుతుందని మూడీస్ పేర్కొంది.