Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మూడు బీమా సంస్థలకు ఆర్థిక దన్నును అందించాలని కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయి ఇబ్బందుల్లో ఉన్న మూడు బీమా సంస్థలకు వెంటనే రూ.2500 కోట్ల మూలధన సాయాన్ని అందించేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. క్యాబినెట్ నిర్ణయంతో త్వరలోనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్కారు నుంచి మూలధన సాయం అందనుంది. బీమా నియంత్రణ సంస్థల నిబంధనల మేరకు ఈ సంస్థలు మూలధన నిధులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో ప్రభుత్వ రంగంలోని ఈ మూడు సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు వీలుపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్‌లో బీమా సంస్థల విలీనాన్ని ప్రకటించిన సర్కారు.. తాజాగా ఆయా సంస్థలకు మూలధన సాయాన్ని అందించాలని నిర్ణయించడం బీమా రంగానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.