Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత పరిశ్రమలో కరోనా కలవరం
- చైనా నుంచి పరికరాల సరఫరా సమస్యలు
- అమ్మకాలు 15% తగ్గొచ్చు
న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావంతో చైనా పరిశ్రమలు మూతపడటంతో ఆ ప్రభావం భారత మొబైల్స్ పరిశ్రమపై తీవ్రంగానే పడుతుంది. ఈ వైరస్ ప్రభావం మరిన్ని రోజులు కొనసాగితే స్మార్ట్ పరికరాల దిగుమతులు లేక భారత్‌లో పరిశ్రమలు మూతపడొచ్చని ఆ రంగం కలవర పడుతొంది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ విడిభాగాలను వివిధ దేశాలు ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. కాగా అమ్మకాలు, వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. విడిభాగాల సరఫరా నిలిచిపోవడంతో వచ్చే వారం నుంచి స్మార్ట్‌ఫోన్ తయారీ పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఐఫోన్ 11, 11ప్రోలు స్టాక్ లేదని రిటైలర్‌లు చెబుతున్నారని ఇటి ఓ కథనంలో వెల్లడించింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
నిండుకుంటున్న ఉపకరణాలు.
ఫిబ్రవరి మాసానికి కావాల్సిన ముడి ఉపకరణాలను సాధారణంగా డిసెంబర్‌లోనే కంపెనీలు సమకూర్చుకుంటాయి. కాగా మార్చికి సంబంధించిన ఉపకరణాలను జనవరిలో తెచ్చుకుంటాయి. ముఖ్యంగా మార్చి రెండో వారం తర్వాత తయారయ్యే ఫోన్లు కొరతను ఎదుర్కోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పరిశ్రమల్లో ఉత్పత్తులు అయిపోవడం ప్రారంభమైందని, మరో వారంరోజులు ఇదే కొనసాగితే ఫోన్ల తయారీకి అంతరాయం ఏర్పడనుందని ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసిఇఎ) చైర్మన్ పంకజ్ మొహిండ్రూ పేర్కొన్నారు. అయితే స్మార్ట్ ఫోన్లలో వాడే బ్యాటరీ, కెమెరా మాడ్యూల్స్ వియత్నాంలో తయారవుతాయి. డిస్‌ప్లే, కనెక్టర్స్ అధిక భాగం చైనాలోనే తయారవుతాయి. చిప్‌లు తైవాన్‌లో తయారవుతున్నప్పటికీ ఫైనల్‌గా చిప్ మార్కెట్‌లోకి రావాలంటే మాత్రం చివరి దశలో చైనాలో రూపొందాల్సిందే. ఫీచర్ల ఫోన్ల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పిసిబి) విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, త్వరలోనే ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
కొత్త ఆవిష్కరణలు లేనట్లే..!
ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికంలో ఫోన్ల విక్రయాలు 10-15 శాతం మేర పడిపోనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏప్రిల్-జూన్ మాసాలలో విడుదల కావాల్సిన కొత్త ఫోన్లపై పడి అవి 4నుంచి 5 వారాలు ఆలస్యంగా విడుదల అవుతాయిని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్ ఐఫోన్ అమెరికా కేంద్రంగా పని చేస్తున్నప్పటికీ దాని విడిభాగాలన్నీ చైనాలోనే తయారవుతాయి.
ఈ ఫోన్లను ఏదేశంలోనైనా విక్రయించాలంటే చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఆయా దేశాల్లో అసెంబ్లింగ్ చేసి అమ్ముతారు. తాజా కరోనా ప్రభావంతో వీటి సరఫరా ఆగిపోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయాయని రిటైలర్‌లు చెబుతున్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం పరిశ్రమల సెలవులను పొడిగించిందని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో సరఫరా చెయిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందదన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.