Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనస్ 0.4 శాతానికి పతనం
- యూబీఎస్ రిపోర్టు
న్యూఢిల్లీ : గత నలబై ఏండ్లలో ఎప్పుడూ లేని స్థాయికి భారత వృద్ధి రేటు పడిపోనుందని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఓ రిపోర్టులో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ ఏకంగా మైనస్ 0.4 శాతానికి క్షీణించనుందని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ సంస్థ 2.5 శాతం వృద్ధి అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో వృద్ధి అంచనాలను సవరించింది. మే మధ్య నాటికి దేశంలో రవాణ రంగంపై ఆంక్షలు కొనసాగొచ్చని తెలిపింది. జూన్ చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి రావొచ్చని పేర్కొంది. దీర్ఘ కాలంలో ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనున్నదని యూబీఎస్ ఎకనామిస్టు తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు పోవచ్చనీ, ఆదాయాలు తగ్గుతాయనీ, కార్పొరేట్ల మొండి బాకీలు పెరగొచ్చనీ, రేటింగ్స్ పడిపోవచ్చని విశ్లేషించింది. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్బీఐ కీలక వడ్డీ రేటులో మరో 75 బేసిస్ పాయింట్లు తగ్గించొచ్చని యూబీఎస్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి 0.2 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇంతక్రితం రోజు అంచనాలు వెల్లడించింది. మార్చిలో 2.5 శాతం వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. ప్రపంచ వద్ధి అంచనాలపై తాజాగా రూపొందించిన నివేదికలో మూడీస్ పేర్కొంది. జి-20 దేశాల వద్ధి రేటు -5.8 శాతంగా నమోదుకావచ్చని పేర్కొంది.