Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనాతో బహుళ సవాళ్లు
- పొంచి ఉన్న మూలధనం ఒత్తిడి
న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న బ్యాంక్‌ల పరిస్థితి కరోనా వైరస్ మరింత అగాథంలోకి నెట్టవచ్చని రేటింగ్ ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కార్పొరేట్ల రుణ పరపతికి కోత పెడుతూ రేటింగ్ ఎజెన్సీలు తీసుకుంటున్న నిర్ణయాలతో బ్యాంక్‌ల ఆస్తుల నాణ్యత తగ్గడంతో పాటుగా మూలధన సవాళ్లను ఎదుర్కోనున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. మూడు నెలల పాటు రుణాలకు మారటోరియం కల్పిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికిప్పుడు పెద్ద ప్రభావం చూపనప్పటికీ.. భవిష్యత్తులో వీటి ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అనేక రుణాలను పునరుద్దరించాల్సిన పరిస్థితులు నెలకొంటాయని అంచనాలు వెలుపడుతున్నాయి. రేటింగ్ ఎజెన్సీలు కార్పొరేట్ల రుణాలకు డౌన్‌గ్రేడ్‌ను ప్రకటించడం బ్యాంక్‌లకు ఆందోళన కలిగించే అంశం. కార్పొరేట్ల రుణ పరపతిని తగ్గిస్తే మూలధన నిల్వల్లో ఇబ్బందులు పెరుగ్చొని రేటింగ్ ఎజెన్సీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రిసిల్ ఇటీవల వెల్లడించిన అధ్యయనం ప్రకారం.. 2019-20 ద్వితీయార్థంలో పరపతి పెంపు కంటే డౌన్‌గ్రేడ్‌కు గురైన కంపెనీల సంఖ్యనే ఎక్కువ. గడిచిన 12 నెలలుగా ఆర్ధిక వ్యవస్థ ఒత్తిడిలో ఉండటంతో పరపతి తగ్గింపు అంశం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని తెలిపింది. ఇదే సమయంలో కార్పొరేట్ రంగంలో అత్యధికంగా డౌన్‌గ్రేడ్‌కు గురైయ్యాయని మరో రేటింగ్ ఎజెన్సీ ఇక్రా పేర్కొంది. దీనికి కరోనా వైరస్ మరింత ఆజ్యం పోసిందని విశ్లేషించింది. రేటింగ్ స్థాయిని బట్టి బ్యాంక్‌లు రుణాలు అందిస్తాయనే విషయం తెలిసిందే. తక్కువ రేటింగ్ కలిగిన సంస్థలు ఇచ్చే రుణాలు ఎక్కువ రిస్కులో ఉంటాయి.
ఎంత నష్టం..?
అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య యుద్దం, ప్రపంచ మాంద్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ఆర్బీఐ ఒక అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ల మూలధనం సామర్థ్యం 12.7 శాతానికి పడిపోవచ్చు. ప్రస్తుతం ఇది 15 శాతం పైగా ఉంది. ప్రస్తుతం 9.4 శాతంగా ఉన్న బ్యాంక్‌ల స్థూల మొండి బాకీలు.. 15.6 శాతానికి పెరుగొచ్చని ఆందోళన వ్యక్తం అయ్యింది. కరోనా వైరస్ విజృంభనకు ముందు గతేడాది డిసెంబర్‌లో చేసిన అధ్యయనం. కరోనా వల్ల ఎంత నష్టం నష్టజరగనుందో, దీర్ఘకాలంలో ఎలాంటి సంక్షోభం రానుందో అంచనా వేయలేని పరిస్థితి చోటు చేసుకుంది. ఇలాంటి క్లిష్ల పరిస్థితుల్లోనూ బ్యాంక్‌ల మూలధన నిల్వలు 12.7 శాతంతో చాలా మెరుగ్గానే ఉన్నాయి. 9 శాతం పైగా ఈ నిల్వలు ఉంటే బ్యాంక్‌లు బాగానే పని చేస్తున్నట్లు. అయితే ఒక్క సారి మూలధనం తగ్గిపోతే రుణ వ్యాపారం క్లిష్ట పరిస్థితుల్లోకి జారిపోనుందని రేటింగ్ ఎజెన్సీలు పేర్కొంటున్నాయి. కరోనా వైరస్ ప్రభావం వల్ల బ్యాంక్‌లు ఎంత నష్టాన్ని చవి చూడనున్నాయో ఇప్పుడే అంచనా వేయలేమని పలు ఎజెన్సీలు, బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తీవ్ర ఒత్తిడి మాత్రం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి.