Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో అమెరికన్ కంపెనీకి వాటా
- విదేశీ చేతికి దేశ సాంకేతిక రంగం..!
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో అమెరికన్ కంపెనీ 'విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్' పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు విస్టా ఒప్పందం చేసుకుందని రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ప్రయివేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్‌లు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. తాజాగా విస్టా ఒప్పందంతో మూడు వారాల్లోనే వరుసగా మూడు అమెరికన్ కంపెనీలు జియోలో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కోసం రూ.43,574 కోట్లు, సిల్వర్ లేక్ 1.5 శాతం వాటా కోసం రూ.5,656 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాయి. ఈ ఒప్పందాలతో జియో తన 13.3 శాతం వాటాను విక్రయించడం ద్వారా మూడువారాల వ్యవధిలోనే రూ.60,596.37 కోట్ల మొత్తాన్ని సేకరించినట్టయింది. ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల్లో ఒకటైన విస్టా తమ వ్యాపార భాగస్వామి కానుందని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మెన్ ముఖేష్ అంబానీ తెలిపారు. దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ డిజిటల్ రంగంలో అభివద్ధిని, పెరుగుదలను సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రుణరహిత కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ వాటాల విక్రయం జరుగుతోంది. అయితే ఈ లావాదేవీలకు కొన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. జియోకు దాదాపుగా 39 కోట్ల మంది ఖాతాదారులున్నారు.
జియోలో జరుగుతున్న పరిణామాల వల్ల భారత సాంకేతిక రంగం విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్రం ప్రభుత్వం ఇటీవలే తీవ్ర ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ఫేస్‌బుక్‌కు డైరెక్టుగా పెట్టుబడులకు అనుమతివ్వడం గమనార్హం. కరోనా దెబ్బకు భారత కంపెనీలు బలహీనమైవుతున్న వేళ అన్ని దేశాల ఎఫ్‌డిఐలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. లేనిచో ప్రస్తుత బలహీన ఆర్థిక వ్యవస్థలో భారత కంపెనీలను బహుళజాతి సంస్థలు ఎగిరేసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జియోతో ఒప్పందంతో ఫేస్‌బుక్ భారత ఇ-కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి మార్గం సులువైంది.