Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సరం మార్చి 8 ఎప్పటిలాగా రాలేదు. స్త్రీల హక్కులు, సమానత్వం, న్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమాల అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చింది. 118 ఏండ్ల నాడు ప్రారంభంలో వచ్చినట్లుగా, అంత స్థాయిలో కాకున్నా అంతటి తపనతో జరుగుతున్న ఉద్యమాల కొనసాగింపుగానే వచ్చింది. ఉపాధి, వేతనం, విద్య, వైద్యం... వివక్షలు లేకుండా పొందడం మా హక్కని నినదిస్తూ వస్తున్నది ఈ మార్చి ఎనిమిది.
కనుక ''ఐక్యరాజ్య సమితి మహిళ'' (యు.ఎన్..ఉమెన్) ఈ సంవత్సరం 'ఇదే సమయం' (టైమ్ ఈజ్ నౌ) అనే నినాదంతో మార్చి ఎనిమిది ఉత్సవాన్ని జరుపుకోవాలని తలపెట్టింది.''గ్రామీణ పట్టణ కార్యకర్తలు స్త్రీల జీవితాలను మారుస్తున్నారు'' అనే ఒక ఆశాభావాన్ని ''ఐక్యరాజ్య సమితి మహిళ'' ఒక నినాదంగా వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ శక్తులకు, సంపద కేంద్రీకరణకు వ్యతిరేకంగా ఒక ప్రస్థానం ప్రారంభమయింది. అసమానతలు, అక్రమాలపై సాగే ఉద్యమాలు 'స్థానిక' స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ వీటిని విశ్వవ్యాప్తంగా అనుసంధానించుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. సాంకేతిక విస్ఫోటనం వలన ఈ సంధానం సులభ సాధ్యమయింది. కాబట్టి బిలియన్ మార్చ్ దగ్గరి నుంచి ''వింటూ'' దాకా లైంగిక వేధింపులు అత్యాచారాలపై ప్రారంభమైన ఉద్యమాలు ప్రపంచం అంతా ప్రతిధ్వనించాయి. యువతరం కూడా గతంలో లేనంతగా ప్రతిస్పందిస్తున్నది.
ఈ 2018 మార్చి 8 పెరుగుతున్న ఈ అవగాహనను, స్పందనను కార్యాచరణలోనికి తీసుకునిరావాలి. అట్లా కాకపోతే వర్చువల్ రియాల్టీగా ఉన్న స్పందనలు వాస్తవంలో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. చాలామంది ఇటీవలి కాలంలో ప్రపంచం అంతా మారిపోయిందని, ఏది జరిగినా వివిధ మాధ్యమాల్లోనే జరుగుతున్నదనే పెద్ద అపోహలో ఉన్నారు. పని ప్రదేశాలలోని లైంగిక వేధింపులు, అత్యాచారాల పట్ల మీడియా యాక్టివిజం పెరిగింది. అది మంచి విషయం. అది అవగాహన పెంచుతున్నది. చర్చను ఆహ్వానిస్తున్నది. భావాల్లో మార్పును ప్రోత్సహిస్తున్నది.
కనుకనే స్వచ్ఛంద సంస్థలు ఈ ఏడాది మార్చి 8వ తేదీని ''ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్'' (ప్రగతి కోసం మాధ్యమాలు) అనే పిలుపునిచ్చాయి. గత ఏడాది అన్ని మాధ్యమాల ప్రసారాలు, ప్రచురణల్లో స్త్రీలపై జరిగే హింసకు సముచిత ప్రాముఖ్యం లభించిందనే అభిప్రాయం వలన ఈ పిలుపునిచ్చాయి. అయితే పై రెండు విషయాల్లో ప్రస్తావించని అంశాలు కొన్ని ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి పిలుపులో కార్యకర్తలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళల జీవితాలను మారుస్తున్నారనేది ఏ అంశాలకు పరిమితం అవుతున్నదో ముందుగా తెలుసుకోవాలి. కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఎంచుకున్న సమస్యలపై అవగాహనతో వాటిపైనే పని చేస్తారు. అంటే ఉదాహరణకు స్వయం సహాయక బృందాలు ఉపాధిపై మాత్రమే పనిచేయడం. వివిధ రంగాల్లో పనిచేసే మహిళా కార్యకర్తలు లేదా మహిళల సమస్యలపె ౖపనిచేసే కార్యకర్తలు నిరంతరం అదేపనిలో ఉండి పనిచేసినా వీరు మార్పుకు దోహదపడే ఉత్ప్రేరకాలే తప్ప మార్పు తెచ్చేవారు కాదు. ఒక రకం కార్యకర్తలు వివిధ పథకాల అమలుకు, ఆ పథకాల ప్రయోజనాలు స్త్రీలకు చక్కగా అందడానికి పనిచేస్తారు. మరొక రకంవారు వారి దృష్టికి వచ్చిన లేదా వారు అవసరం అని భావించిన సమస్యలపై కొంత నిధులు (ప్రభుత్వం, ప్రయివేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, విదేశీ సంస్థల నుంచి) పొంది వాటిపై కేంద్రీకరిస్తారు. ఏ నిధులూ, జీతాలు లేకుండా ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో తమ సైద్ధాంతిక నిబద్ధతతో రాజకీయ కార్యకర్తలుగా పనిచేసేవారూ ఉంటారు. వీరు ప్రధానంగా హక్కుల సంఘాలుగా పోరాట ప్రధానంగా సాగుతారు.
పైన చెప్పిన కార్యకర్తలంతా భిన్న కోణాల్లో మహిళా సమస్యలపై సమాజంలో అవగాహనకు, వారికి తోడ్పాటును ఇవ్వడానికి, మార్పు తేవడానికి కృషిచేస్తారు. అయితే సామాన్య ప్రజలు తమ అనుభవాల ద్వారా తమకు తమ సామాజిక శక్తి పట్ల ఏర్పడిన విశ్వాసపు స్థాయిని బట్టి ఉమ్మడిగా ఉద్యమిస్తారు. ఆ ఉద్యమం ఉపాధి, వనరులు, హింస ఏదైనా కావచ్చు. కాబట్టి కార్యకర్తలు మార్పుకి దోహద పడేందుకు పనిచేస్తారు. కాని మార్పు తెచ్చేది, తీసుకురావలసింది మాత్రం సామాన్య మహిళలే అనే విషయంలో మాత్రం గందరగోళానికి గురికాకూడదు.
మీ టూ కాంపెయిన్ ఫలితాలేమిటి?
ప్రసార, ప్రచార మాధ్యమాలు భాష సంఘర్షణకు వేదికలుగా ఉంటూ ప్రచారం చేస్తాయి. పరోక్షంగా ఘనీభవించిన అభిప్రాయాలు కరగడానికి కారణం అవుతాయి కాని వాటంతటవే మార్పుని తీసుకురాలేవు. ఉదాహరణకు ''మీ టూ'' కాంపెయిన్ చూద్దాం. హాలీవుడ్ తారలపై జరిగిన, జరుగుతున్న లైంగిక హింసను తమ తమ వ్యక్తిగత అనుభవాల ద్వారా వెళ్లగక్కారు. సినీరంగంలో లైంగిక దాడిని వెల్లడించినా కేసులు పెట్టినా వారి సినీజీవితం అంతం అయినట్లే. అంతటి శక్తి ఈ దోపిడీ చేసేవారికి ఉంటుంది. అటువంటి వాతావరణంలో కొందరు ధైర్యం చేసిముందుకు రావడంతో వరదకట్ట తెగింది. హాలీవుడ్డే కాకుండా అనేకానేక దేశాల నుండి వెల్లువగా లైంగిక వేధింపుల నేరస్థులు కలుగుల్లోంచి బయటకు లాగబడ్డారు. ఇటువంటి వ్యవహారం తమ వ్యాపారానికి హానికరం కాబట్టి ఆయా నిర్మాణ సంస్థలు వారిని బయటకు పంపాయి. ఇక్కడ ఎవరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షలు వేయలేదు.
మనదేశంలో ఈ కాంపెయిన్ ప్రభావంతో మాట్లాడినవారున్నారు. కానీ ఫలితం ఏమీ లేదు. ఎందుకంటే ఈ మాట్లాడినవారికి మద్ధతుగా తమ అనుభవాలను జోడించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధం కాలేదు. మన సినిమా రంగం సామాజిక రంగానికి కొనసాగింపుగా ఫ్యూడల్ భావజాలంతోనే కొనసాగుతున్నది. కాబట్టి ఎవరైనా లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డారంటే ''మరి వాడు మగాడు గదా'' అని పట్టించుకోని ధోరణి ఉంది. లైంగిక దాడి చేసినవారిని సాంఘికంగా సామూహికంగా వెలివేయడం మన ''సంస్కృతి'' కాదు. పైగా ఆ ఆరోపణలకు గురైనవారు కేసుపెట్టి నిరూపించమని సవాలు చేస్తారు. కాబట్టి మీడియా కాంపెయిన్ ఇక్కడ ఏ ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా దాడులు చేసినవారు దొరక్కుండా హెచ్చరిక ఇచ్చినట్లయింది.
అంటే మీడియాలో వెల్లడి అయినంత మాత్రాన ఏదైనా జరుగుతుందని అనుకోరాదు. ఆయా దేశాల 'సామాజిక మర్యాద', ఆయా దేశాల చట్ట వ్యవస్థలు 'మీడియా' నివేదికల్ని ఏమేరకు వాస్తవిక విచారణల్లో భాగంగా స్వీకరిస్తాయి అనేదాన్ని బట్టి మాధ్యమాల యాక్టివిజం ఫలితాలు ఉంటాయి.
అట్లాగే మాధ్యమాలను చూసేది, వాటిల్లో మాట్లాడేది ఎక్కువగా మధ్యతరగతి వారే. వారే మీడియా యాక్టివిజంతో ఏదో జరుగుతుందని భ్రమపడతారు. ఉద్యమాల్లోకి రాకుండా 'తేలిగ్గా'సమస్యలు ఇట్టే పరిష్కారం కావాలని కోరుకుంటారు. వాస్తవానికి చాలా తక్కువ సందర్భాల్లోనే ఇది నిజమవుతుంది.
మాధ్యమాల ప్రేక్షకులను బట్టి కొన్ని ఆసక్తిదాయకమైన అంశాల్ని అవి ప్రసారం చేస్తాయి. మూలాల్లోకి, లోతుల్లోకి పోవాలనుకోవు. కనుకనే ఎప్పుడూ కూడా వనరులపై హక్కుల గురించి గాని, 73 శాతం సంపద 1 శాతం ధనికుల చేతిలో ఉంటే స్త్రీల జీవితాలు ఎట్లా ప్రభావితం అవుతాయనేది గాని 'ప్రధాన చర్చ'గా ఉండదు.
అట్లాగే సామాజిక కార్యకర్తల వారి వారి ఎంచుకున్న అంశాల్లో కీలక అనుభవాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పాలన బాగుపడితే ప్రజలు మారిపోతే చాలు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ధోరణిలో ఉంటారు. మంచి ఆఫీసర్లు, మంచి రాజకీయనాయకులు, నాయకత్వంలోని మహిళలు రావడం వంటివాటితో పరిష్కారాలు చెబుతారు. ఇవన్నీ తాత్కాలిక స్వాంతనను చేకూర్చేవే గాని శాశ్వత పరిష్కారాలు కావు.
మార్కెట్ చేతుల్లో మహిళా దినోత్సవం
మార్చి 8 ఒక పోరాట వారసత్వ దినోత్సవంగా ఉండటం నుండి ''మహిళల దినం'గా మారడంతో చీరల ప్రదర్శన, హోటల్స్‌లో స్త్రీలకు ప్రత్యేకం, నగలు, వస్తువుల కొనుగోలులో కొన్ని పన్ను రాయితీలు, శుభాకాంక్షలు చెప్పుకోవడంగా ఈ రోజును తయారుచేయడంలో కార్పొరేటు, మార్కెట్ ప్రయోజనాలు ఉన్నాయి. దేన్నయినా అమ్మగల శక్తి మార్కెట్‌కి ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ఒక అందమైన స్త్రీత్వపు ఊహ (ఫెమినిటీ)ని సృష్టించడం అంటే మెత్తటి శరీరం, నున్నటి చర్మం, వత్తయిన ఎగిరే జుట్టు, మెరిసే కండ్లు వంటివాటిని కొనుక్కోవడం. అందాన్ని కొనుక్కుని 'ఆధిపత్యం' పొందడం.. శరీరం ద్వారా ఒక సామాజిక విలువను ఏర్పరచుకోవడం, సైంటిస్టులు, డాక్టర్లు వివిధ వృత్తుల్లో దూసుకుపోతున్న స్త్రీలకు తమ తమ రంగాల్లో సాధించిన, సాధిస్తున్న విజయాలకంటే 'స్త్రీత్వం' ఎక్కువయింది. వారిని సైతం ఈ స్త్రీత్వం కోసం అర్రులు సాచేలా చేసింది. ఈ స్త్రీత్వాన్ని నిరూపించుకోవలసిన అగత్యం దేశాధినేతలు, కార్పొరేట్ సంస్థల అధినేతలైన మహిళలకూ ఏర్పడింది. కనుకనే 'అందాల పరిశ్రమ' స్త్రీత్వాన్ని అమ్మి విపరీతమైన లాభాలను గడిస్తున్నది. మార్చి 8 దానికి ప్రదర్శనా వేదికయింది.
ఈ ఆధునిక అందమయిన స్త్రీత్వం శ్రమించే స్త్రీలను అంటరానివారిగా చేసింది. లేదా వారిపట్ల జాలితో, దయతో మాట్లాడిస్తున్నది. నిజానికి అందమైన స్త్రీల జీవితాలకు హక్కుల నిచ్చిందీ, వాటిని నిలబెడుతున్నది కూడా ఈ శ్రామిక స్త్రీలే. తమ శ్రమ ద్వారా వుత్పత్తి చేస్తూ తమ సంతానోత్పత్తి శక్తితో ప్రపంచానికి కావలసిన శ్రామిక శక్తిని ఇస్తున్న 90 శాతం స్త్రీలు... కార్పొరేటు సంస్థలు, బండబారిన ప్రభుత్వాలకు స్త్రీత్వం లేనివారుగా కనిపిస్తున్నారు. అంటే అందాల పరిశ్రమ రెండు రకాల విభజన చేసింది. ఒకటి అమలులో ఉన్న జెండర్ వివక్షలను తిరిగి రుద్దింది. రెండోది అందాన్ని శ్రమ నుంచి మరింత వేరుచేసింది. కనుకనే విపరీత ప్రచారంలో ఉన్న 'అందం' నిర్వచనాన్నే పునర్నిర్మించాల్సి వస్తున్నది.
అయితే 'ఐక్యరాజ్యసమితి మహిళ' మాధ్యమాలు, కార్యకర్తల కృషి ద్వారా లభించే స్పందనను క్రియాత్మకం చేయాలని భావించడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ భావనను అమలులోకి తేవడానికి ఐక్యరాజ్యసమితి ఆయా కార్యక్రమాల్లోని మహిళాకార్యకర్తల అనుభవాలను సేకరించేందుకు రెండు వారాల పాటు మార్చినెలలో సదస్సు నిర్వహిస్తుంది. మహిళల స్థితిగతులపై సాగే ఈ సదస్సు శ్రామిక స్త్రీల సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నది.
వ్యవసాయంలో స్త్రీదే ప్రధాన పాత్ర
ప్రపంచంలో 43 శాతం మంది స్త్రీలు వ్యవసారంగంలో ఉన్నారు. మనదేశంలో ఈ సంఖ్య పెరుగుతూ వచ్చి 68 శాతానికి చేరింది. కరువులు, వలసలు, భూమికబ్జాలు, భూసేకరణ ఉపాధి వంటి అనేకం దీనికి కారణాలు. అంటే స్త్రీలు భూమి దున్నడం, దుక్కి చేయడం, గింజలు నాటడం, నాటువేయడం, కలుపు తీయడం, కోత కోయడం, నూర్పిడి వంటి వ్యవసాయంలోని అన్ని రకాల పనుల్లోను ఉంటున్నారు. దేశానికి తిండి పెట్టడంలోనే కాదు వాతావరణం కాపాడ్డంలోనూ వారే ముందున్నారు. అయినా పాతుకుపోయిన వివక్షలు, అసమానతల వల్ల గ్రామీణ స్త్రీలు అందరికంటే ఎక్కువ బాధలు పడవలసి వస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల పేరిట ఉన్న భూమి 20 శాతం కన్నా తక్కువే! ఉత్తర భారతంలో 8 శాతం కన్నా తక్కువ ఉంటే, దక్షిణ భారత దేశంలో 10-15 శాతాల మధ్యన ఉంది. మొత్తం మీద వేతన వ్యత్యాసాలు 23 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 40 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. వెనుకబడిన లోతట్టు ప్రాంతాల్లో అది 70 శాతం దాకా ఉన్నది.
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు నోట్ల రద్దుతో ఉపాధి రద్దయింది. 20 ఏండ్ల క్రితం46 శాతం దాకా ఉన్న మహిళా ఉపాధి ఇప్పుడు 19 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అధికంగా వ్యవసాయాధారిత వృత్తుల్లో, గృహపరిశ్రమల్లో, కుటీర పరిశ్రమల్లో ఉపాధి పొందుతారు. ఇవన్నీ ధ్వంసం అవుతున్నాయి. కానీ కొత్త ఉపాధులు మాత్రం ఏర్పడటంలేదు. దీంతో నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. నూరు రోజుల పని పథకం కొంత ఉపశమనంగా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఉపాధికి భద్రత నివ్వకపోవడంతో ఏ 'పని'కయినా అతితక్కువ వేతనానికి సిద్ధపడుతున్నారు.
జియస్‌టి దెబ్బకి గతంలో లేని పన్ను 18 శాతం వ్యవసాయ పరికరాలపై వేయటంతో ఈ ఏడాది వ్యవసాయం కుదేలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. వాతావరణం ఎట్లా ఉంటుందో చెప్పలేం కాబట్టి గ్రామీణ స్త్రీలు ఒకరకంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనే బతుకుతున్నారని చెప్పాలి.
మనదేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో 'మద్యం ఆదాయం' అభివృద్ధి, సంక్షేమ పథకాలకు జీవనాడిగా మారిందట. నాలుగు వేల రూపాయలు లోపు ఆదాయం పొందే కుటుంబాల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు కుటుంబాదాయం స్త్రీల శ్రమ నుండే లభిస్తున్నది. మగవారి ఆదాయం మద్యానికి, ఇతర వ్యసనాలకు ఖర్చవుతున్నది. పదివేల రూపాయల ఆదాయం గల కుటుంబాల్లో 25 శాతం నుంచి 60 శాతం వరకు స్త్రీల సంపాదనే. దీనికి తోడు స్త్రీలు ఇంటి బయట ఉపాధి ద్వారా లభించే ఆదాయమే కాకుండా, వారు ఇంట్లో చేసే చాకిరిని కూడా ఆదాయంగానే పరిగణించక తప్పదు. ఇటువంటి గొడ్డు చాకిరి చేసి ఇంట్లో అందరికన్నా చివరిగా అన్న తినడం, చాలీ చాలని తిండికి తోడు ఇంట్లో శారీరక హింస తోడవ్వడంతో స్త్రీల జీవితాలు దుర్భరంగా మారాయి. ఆహారభద్రతా చట్టం ఏమయిందో అంతుబట్టకపోవడంతో ఈ ఏడాది స్త్రీల ఆకలి సంవత్సరంగా మారడానికి సిద్ధమయింది.
ఆరోగ్య భద్రత కల్పిస్తామనే హామీలు కార్పొరేటు ఆరోగ్య వ్యవస్థ ప్రోత్సాహకాల్లో కల్సిపోయాయి. స్త్రీల ఆరోగ్యం కుటుంబంలోను, ప్రభుత్వంలోను చివరి ప్రాధాన్యత కలిగి ఉంది. స్త్రీలకు కనీస ఆరోగ్య సేవలు లభించాలంటే తప్పనిసరిగా ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఆ ఊసే లేని ప్రభుత్వం కనీస పరిశుభ్రతనిస్తూ సౌకర్యంగా ఉండే శానిటరీ నేప్‌కిన్స్‌పై 12 శాతం జియస్‌టీ విధించింది. అదే ప్రభుత్వం 'బేటీ పడావో బేటీ బచావో' అని గర్జిస్తున్నది. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండవు. ఉన్నా పనిచేయవు.
చట్టాలు మూలన పడ్డాయి
పని ప్రదేశాల లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం అసంఘటిత రంగ స్త్రీల కోసం ఏర్పరచిన స్థానిక ఫిర్యాదుల కమిటీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఇవి ఎట్లా, ఎందుకు ఏర్పాటు చేయాలో, ఎట్లా నడిపించాలో అధికారులకు ఎవరూ చెప్పరు. కార్పొరేటు రంగంలో ఫిర్యాదుల కమిటీల గురించి అడిగే సాహసం ప్రభుత్వాలకు లేదు. ఈకమిటీలు ఏర్పాటుచేయడమంటే వారి మనోభావాలు గాయపడతాయని పాలించే పెద్దల భావన.
పట్టణాలు గ్యాస్ బాయిలర్లుగా, పల్లెలు కాలుష్య నిలయాలుగా అభివృద్ధి చెందాయి. అయినా పట్టణీకరణతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. పట్టణ స్త్రీల ఉపాధి అతి తక్కువ స్థాయి (13.7 శాతం)కి కుప్పకూలింది. పట్టణ ప్రాంతాల్లో స్త్రీల మద్యం సేవనం 14 శాతానికి పెరిగింది.
మంత్రగత్తెలుగా ముద్రవేసి చంపడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. హైదరాబాదులో బాల్య వివాహాలు (18 ఏండ్ల లోపు పిల్లల పెండ్లిళ్లు) 46 శాతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో విద్యాలయాల్లో డ్రాపవుట్స్ చాలా తక్కువ అని రికార్డులు చెబుతాయి కాని ఇంటర్మీడియట్లో చేరే ఆడపిల్లల సంఖ్య మాత్రం 30 శాతానికి దాటడంలేదు. విద్యా చట్టం అయినా, బాలకార్మిక నిరోధక చట్టం అయినా 14ఏండ్ల లోపు పిల్లల వరకే వర్తిస్తుందట. 14-18 ఏండ్ల మధ్య ఉన్న బాలికల బాధ్యత ఏ చట్టానిదీ కాదు కాబోలు. అందుకే భారీగా సెక్స్ ట్రాఫికింగ్ పెరిగింది. సెక్స్‌వర్కర్స్‌గా జీవిస్తున్నవారిలో 15 ఏండ్ల లోపు వయసువారిలో మన తెలుగు అమ్మాయిలే 25 శాతం ఉన్నారు.
కుటుంబ హింస నివారణ చట్టం అమలుకు ఇప్పుడు కొత్తగా ఒన్ స్టాప్ క్రైసిస్ నెంబర్లు దేశంలో 150 జిల్లాల్లో పెడుతున్నారట. అందుకని 498ఎ ని కోల్డు స్టోరేజిలో వేశారు. హింసను భరించలేమనే స్త్రీల బారి నుండి 'పవిత్ర కుటుంబ వ్యవస'్థను కాపాడ్డానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. వివాహంలో స్త్రీలపై జరిగే లైంగిక అత్యాచారాలు మన సంస్కృతిలో భాగం కాబట్టి అది నేరం కాదని పార్లమెంటులోనే ప్రకటించారు. వరకట్నమనే సదాచారానికి బలవుతున్న నవవధువుల మరణాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడేండ్లలో 27 శాతం పెరిగాయి. కాని శిక్షలు పడుతున్నవి మాత్రం 9 శాతం మాత్రమే.
ఇక అత్యాచారాలు, లైంగిక దాడులు అనేకానేక ఆధునిక రూపాలు సంతరించుకుంటున్నాయి. వాటిని నిరూపించడం సాధ్యంకాకపోవడంతో 13 శాతం నేరస్థులు మాత్రమే శిక్షింపబడుతున్నారు. ఒక అత్యాచారం కేసులో శిక్ష వేయడానికి సగటున మూడున్నర ఏండ్లు పడుతున్నది. అదే గృహ హింస కేసులోనైతే నాలుగు నుండి ఏడు సంవత్సరాల కాలం పడుతున్నది. పది ఏండ్ల లోపు బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు 51 శాతం పెరిగితే 60 ఏండ్లు దాటిన మహిళలపై 76 శాతం పెరిగాయి. విద్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసులు 52 శాతం పెరిగాయి. ఈ దేశంలో స్త్రీలకు భద్రత కల్పిస్తామని, ఇప్పటికే భద్రత ఉందని కూడా ప్రభుత్వాలు ప్రకటించుకుంటున్నాయి.
ఈ విరోధ భావాల మధ్యన ప్రతికూల దృక్పథంతో కాకుండా సానుకూలతతో సాధించిన విజయాలు చూడమంటున్నారు. మహిళా దినోత్సవ వేడుకల్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్న గుత్తేదార్లు.
ఈ మార్చి 8 అత్యంత సానుకూలాంశం ప్రతిఘటనా స్వరాల ప్రతిధ్వనులు ఎల్లెడలా హోరెత్తిపోవడం. ప్రచార, ప్రసార మాధ్యమాల తటస్థ పాత్రను కొంతయినా తగ్గించగలగడం... స్త్రీల కోణం నుండి సమస్యను చూపించవలసిన తప్పనిసరితనాన్ని సృష్టించడం... గ్రామీణ పట్టణ శ్రామిక స్త్రీలు 'వారికోసం' మాట్లాడేవారికోసం ఎదురుచూడటం తగ్గించి వారంతట వారే మాట్లాడేందుకు సిద్ధం కావడం...
మేం కూడా మనుషులమే అనే మూలుగు మేం మనుషులుగా రూపాంతరం చెందిన పదంగా ఆవిర్భవించే క్రమం మొదలుకావడం ...హక్కులు ఎవరో ఇచ్చే దయా భిక్ష కాదు... అని చైతన్య కార్యాచరనల ప్రతిఫలనం అనే భావన ప్రాచుర్యం పెరగడం...
కార్యకర్తలు విముక్తి ప్రదాతలు కాదు. ఉత్ప్రేరకంగా ఉండటం ద్వారా లబ్దిదారులం కావడమనే ఆత్మచైతన్యంలోకి మారినవాళ్లు. వినమ్రతతో లోకాన్ని నడిపించే చెమట చుక్కల పట్ల విధేయతతో మసలాలని అర్థం చేసుకోవటం...
సాహచర్యంతో సాగి పరస్పరం ఎదగటం, హక్కుల ఉద్యమంగా జ్ఞానం పొందడానికి ప్రయత్నించడం...
సామాజిక మాధ్యమాల భావ సంఘర్షణలు వాస్తవ జీవితంలో ఆచరణలుగా మారనంతకాలం ఆత్మ సంతృప్తే తప్ప అసలు ఫలితాలు రావని అర్థం చేసుకోవడానికి ప్రసార మాధ్యమాల వినియోగపు బాల్య చాపల్యం ఇంకా ఆటంకంగానే ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంలోని సానుకూల అంశం శతాబ్దాలుగా ప్రత్యేకించి గత 200 ఏండ్లుగా శ్రామిక స్త్రీలు తమ శ్రమతో హక్కులు సాధించే చైతన్యాన్ని రగిల్చిన అనేకమంది ఉద్యమ నేతలను స్మరించి వారి బాటకు నిబద్ధత ప్రకటించడం ద్వారా నివాళులర్పించడం... ఓ రోజా లక్సెంబర్గ్, ఓ లక్ష్మీ సెహగల్, మరో విమలా రణదివే,... ఓ ఐలమ్మ... ఎందరి స్మృతిలోనో ఈ మహిళా పోరాట వారసత్వం స్వీకరించడం... అత్యంత సానుకూల అంశం.
రచయిత సెల్ : 9848622829
- దేవి, సాంస్కృతిక కార్యకర్త