Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది తూర్పుతీర వెనిస్ నగరంగా పేరుగాంచిన కేరళలోని అలప్పుజ పట్టణం. సముద్రం లోనికి చొచ్చుకుని రావటంతో సహజ సిద్ధంగా ఏర్పడిన కాల్వలు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. బీచ్‌లు, ఉద్యాన వనాలు, పూదోటల సోయగాలు, పురాతన ఇండ్లు, హౌస్‌బోట్లతో పర్యాటక పట్టణంగా రూపుదిద్దుకున్నది. దీనికి తోడు అద్దంలా కనిపించే ఈ పట్టణంలో చెత్త కనిపించదు. చెత్తను సేకరించే వారు కూడా ఉండరు. డంపింగ్ యార్డుల జాడ లేదు. రహదారులు, వీధులు చెత్తమయమై, నగరాలు పట్టణాలు మురికి కూపాలుగా మారి ప్రజారోగ్యానికి సవాలుగా మారిన దేశంలో ఒక చిన్న పట్టణం పరిశుభత్రకు చిరునామాగా మారటం విశేషమే మరి. ఇదెలా సాధ్యమని అందరూ విస్తుపోవచ్చు. కేవలం ప్రజల భాగస్వామ్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అలప్పుజ పట్టణం. వికేంద్రీకృత వ్యర్థ పదార్థాల నిర్వహణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశంలోని అన్ని పట్టణాలకు, నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజా చైతన్యం, వామపక్ష ప్రభుత్వ విధాన నిర్ణయాలు, కార్యాచరణ తోడై ఒక కొత్త మోడల్‌ను సృష్టించాయి. అలప్పుజలో ప్రారంభైన 'నిర్మల భవనం, నిర్మల నగరం' ఒక ఉద్యమంగా మారి కేరళ రాష్ట్రమంతటా వ్యాపించింది. దేశం దృష్టిని మరల్చింది.
సర్వోదయపురం కేరళలోని ఒక కుగ్రామం. జిల్లా కేంద్రమైన అలప్పుజ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అలప్పుజ పట్టణం నుంచి సేకరించే చెత్తను ఈ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డులో పడవేసేవారు. గ్రామ ప్రజలందరూ రోగాల బారిన పడ్డారు. భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి అక్కడ సేకరించిన చెత్తను తమ గ్రామం వద్ద పడవేయటాన్ని సర్వోదయపురం వాసులు జీర్ణించుకోలేక పోయారు. 2012 జూన్10 వ తేదీన చెత్తను తీసుకువస్తున్న ట్రక్కులను నిలిపివేశారు. అలప్పుజ పట్టణమంతా చెత్తతో నిండిపోయింది. రహదారుల వెంట ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ రంగంలోకి దిగారు. సర్వోదయపురం గ్రామస్థులతో చర్చలు జరిపారు. అయినా డంపింగ్ యార్డును కొనసాగించేది లేదని వారు తేల్చి చెప్పారు. వారి వాదనలో న్యాయం ఉందని గ్రహించిన థామస్ ప్రత్యామ్నాయం కోసం ఆలోచించారు. రాష్ట్ర ప్రజల సైన్స్ ఉద్యమంగా పేరుగాంచిన కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, సమీకృత గ్రామీణ సాంకేతిక కేంద్రం (ఐఆర్‌టీసీ), రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధనవనరుల సంస్థలతో సంప్రదింపులు జరిపారు. అలప్పుజ పట్టణంలో సేకరించిన తడి చెత్తను పట్టణంలోనే వినియోగించుకునే విధంగా బయోగ్యాస్ ప్లాంట్‌లకు రూపకల్పన చేశారు. ప్రతి ఇంట్లో ఇటువంటి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మహిళలు మొదట అంగీకరించలేదు. థామస్ ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు నచ్చ చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు, కార్పొరేటర్ల సహకారంతో వారికి అవగాహన కల్పించారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా 12 వార్డుల్లో ప్రతి ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్‌లను నెలకొల్పారు. దీనికి 90 శాతం సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్‌లు నిర్వహించుకోలేని వారి కోసం ఖాళీ ప్రదేశాల్లో ట్యూట్ కంపోస్ట్ యూనిట్లను ప్రారంభించారు. తడి చెత్తను ఈ కేంద్రాల్లో వేసే విధంగా మహిళలను ప్రోత్సహించారు. తొలి దశలోనే 75 శాతం తడి చెత్తను వినియోగించుకున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావటంతో పట్టణంలోని ఇతర ప్రాంతాల వారిని కూడా ఈ పద్ధతి ఆకర్షించింది. అనతి కాలంలోనే మొత్తం 52 మునిసిపల్ వార్డుల్లో ఈ ప్లాంట్‌లు ప్రారంభమయ్యాయి. హౌటళ్లు, రెస్టారెంట్లు కూడా సొంతంగా బయోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకున్నాయి. పొడి చెత్త, సీసాలు, ప్లాస్టిక్‌లు, హాస్పిటల్, ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను కూడా రీసైక్లింగ్ చేసే యూనిట్లను ప్రారంభించారు. నూటికి నూరు శాతం తడి, పొడి చెత్తను ఇండ్ల వద్దే వేరు చేసే పద్ధతిని ప్రజలు పాటించారు. చెత్తను సేకరించే పని మునిసిపాలిటీది కాదని థామస్ ఐజాక్ అభిప్రాయపడ్డారు. ప్రతి వార్డులోచెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ కేంద్రాలకు వెళ్లి చెత్తను అక్కడ అప్పగించే విధంగా అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేసే వారికి రూ. 2,500 అపరాధ రుసుము విధించే నిబంధనను మునిసిపాలిటీ అమలు చేసింది. రాత్రి వేళల్లో రోడ్లపై నిఘా పెంచటంతో పాటూ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసింది. ఈ చర్యలతో కేవలం ఏడాదిన్నర కాలంలో నూటికి నూరు శాతం చెత్త కనిపించని పట్టణంగా అలప్పుజ పేరుతెచ్చుకున్నది.
పైన పటారం..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసిన పరిశుభ్రనగరాల్లో 50 నగరాలు వ్యర్థ పదార్థాల నిర్వహణలో వెనకబడి ఉన్నాయి. కేవలం పైకి కనిపించే అంశాల ప్రాతిపదికగా ఎంపిక జరిగినట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) వెల్లడించింది. ఈ సంస్థ పరిశీలన ప్రకారం ఒక లక్ష కంటే అధిక జనాభా కలిగిన ఈ నగరాల్లో ఇండ్ల వద్దే చెత్తను వేరు చేస్తే ఎంపికైన చండీగఢ్, ఉత్తర, దక్షిణ ఢిల్లీ, వారణాసి, ఘజియాబాద్, గ్రేటర్ హైదరాబాద్, అహ్మదాబాద్, జబల్‌పూర్, జైపూర్ నగరాల్లో చెత్తను వేరు చేసి సేకరించే పద్ధతిని పాటించటం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఇండోర్ నగరంలో చెత్తను వేరు చేయటం, సేకరించటం, రీసైకిల్ చేయటం వంటి ప్రమాణాల్లో ముందున్నప్పటికీ భారీ పెట్టుబడులతో కూడిన ఈ విధానం దేశంలోని అన్ని నగరాల్లో అమలు చేయటం సులభం కాదు. స్వచ్ఛ నగరాల జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన చండీగఢ్‌లో కూడా ఇండ్ల వద్దే వేరు చేసిన చెత్తను సేకరించే పద్ధతి అమల్లో లేదు. చెత్త నిర్వహణ, రవాణా సక్రమంగా లేక పోవటంతో ఈ ప్రక్రియ అమల్లో లేదు. ఈ నగరాల్లో చెత్తను సేకరించి దుర్గంధాన్ని వెదజల్లే డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. స్వచ్ఛ నగరాలుగా నగరవాసులు ఇటీవల ఆందోళనకు కూడా దిగారు. స్వచ్ఛ నగరాల్లో నాలుగవ ర్యాంక్ సాధించిన ఉత్తర ఢిల్లీ, 32 వ స్థానంలో నిలిచిన దక్షిణ ఢిల్లీ నగరాల్లో చెత్తను యంత్రాల ద్వారా సేకరిస్తున్నారు. దీనిలో 80 శాతం చెత్తను విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. ఓక్లా వద్ద చెత్త ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్న కర్మాగారం నుంచి కాలుష్యం వెలువడుతున్నది. స్వచ్ఛ నగరాలుగా ఎంపికైన తిరుపతి, ఆలీగఢ్, ఘజియాబాద్ నగరాల్లో వ్యర్ధాలను వేరు చేసి ఇతర అవసరాల కోసం వినియోగించుకునే వ్యవస్థ లేదు. 39 వ ర్యాంకు సాధించిన జైపూర్‌లో కేంద్రీకృత కంపోస్ట్ ప్లాంట్ మాత్రమే ఉన్నది. ఇంటింటికీ చెత్తను సేకరించే పట్టణాలను, నగరాలను స్వచ్ఛ సర్వేక్షణ్ గుర్తించినప్పటికీ సేకరించిన తడి చెత్తను ఇంటి వద్దే సద్వినియోగం చేసుకునే పట్టణాలను గుర్తించలేక పోయింది. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో వికేంద్రీకృత విధానం అమలు చేయటం ద్వారా వీటి సేకరణ కోసం పెట్టే భారీ ఖర్చును తగ్గించవచ్చని నిరూపించిన పట్టణాలను, నగరాలను స్వచ్ఛ సర్వేక్షణ్ పరిగణలో లేదని సీఎస్‌ఈ తెలిపింది.
సీఎస్‌ఈ ఎంపిక చేసిన స్వచ్ఛ నగరాలు
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో జరుగుతున్న నగరాల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని భావిస్తున్న రీసెర్చ్ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) స్వయంగా రంగంలోకి దిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఉన్న లోపాలను ఎండగట్టడమే కాక స్వచ్ఛ నగరాల ఎంపిక కోసం కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది. స్వచ్ఛ నగరాలను ఎంపిక చేయటానికి సీఎస్‌ఈ 13 అంశాలను పరిగణలోకి తీసుకున్నది. చెత్త లభించే ప్రదేశంలోనే వేరు చేయటం, సేకరించే విధానం, రవాణా, తడి, పొడి చెత్తను ప్రోసెస్ చేయటం, డంపింగ్ యార్డులు లేకుండా చేయటం, వికేంద్రీకృత ప్రాసెసింగ్ విధానం, ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణకి సంబంధించి నిబంధనల రూపకల్పన, బయోమెడికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణతో పాటూ చెత్త సేకరణ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు అమలు చేయటం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని స్వయంగా స్వచ్ఛ నగరాలను ప్రకటించింది. పరిశుభ్ర నగరాల ఎంపికతో పాటు తమతో కలసి వచ్చే నగరాల ప్రతినిధులతో ఒక ఫోరం కూడా ఏర్పాటు చేసింది. దేశంలోని 100 ప్రముఖ నగర కార్పొరేషన్లు, పురపాలక సంఘాలతో ఏర్పాటు చేసిన ఈ ఫోరం వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ, వికేంద్రీకృత విధానాలు అమలు చేయటానికి సీఎస్‌ఈ సాంకేతిక సహకారం అందచేస్తున్నది. 2018 సంవత్సరానికి సీఎస్‌ఈ ఎంపిక చేసిన పది లక్షల జనాభా కన్నా ఎక్కువ ఉన్న స్వచ్ఛ నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా వరుసగా మైసూర్, భోపాల్, గ్రేటర్ హైదరాబాద్, బెంగళూరు, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పాట్నా నగరాలు వరుస క్రమంలో నిలిచాయి. పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న స్వచ్ఛ నగరాల్లో అలప్పుజ ప్రథమ స్థానంలో నిలవగా తిరువనంతపురం ద్వితీయ స్థానంలో ఉన్నది. గాంగ్‌టక్, ముజఫర్‌పూర్, ఇంఫాల్, గురుగ్రామ్, గయ నగరాలు వరుస క్రమంలో నిలిచాయి.
చెత్తతో ఆదాయం...
చెత్తను సేకరించటం, దీనిని తరలించటం పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు తలకు మించిన భారంగా మారింది. పన్నుల రూపంలో ప్రజల వద్ద వసూలు చేసిన కోట్లాది రూపాయలను వ్యర్థ పదార్ధాల నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్న తరుణంలో అలప్పుజ మరొక మైలు రాయిని కూడా దాటింది. చెత్త సేకరణకు స్వస్తి చెప్పటం ద్వారా ఆదా చేసిన పురపాలక సంఘం నిధులను ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్నది. ఇండ్లలో నెలకొల్పిన బయోగ్యాస్‌ప్లాంట్‌ల వల్ల ఎల్‌పీజీ వినియోగం తగ్గిపోయింది. ఒక సంవత్సర కాలంలో గ్యాస్ రూపంలో ఖర్చు పెట్టే రూ. 1.19 కోట్లు ఆదా అయింది. సేంద్రీయ ఎరువు తయారీ, ఘన వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ద్వారా అటు ప్రజలకు ఇటు పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది.
ఐక్యరాజ్య సమితి గుర్తింపు..
వ్యర్థ పదార్ధాల నిర్వహణలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న ఐదు రకాల పద్ధతుల్లో అలప్పుజ ఎంపిక చేసుకున్న వికేంద్రీకరణ విధానం ఉత్తమమైనదని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం కితాబునిచ్చింది. 2016 ఏప్రిల్ 16 న వాతావరణ మార్పులపై ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఐక్యరాజ్య సమితి అలప్పుజను పొగడ్తలతో ముంచెత్తింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, సీఎస్‌ఈ వంటి పరిశోధన సంస్థలు అలప్పుజ పారిశుధ్య కార్యక్రమాన్ని వినూత్న మైనదిగానూ, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగానూ అభివర్ణించాయి.
- కొండూరి రమేష్ బాబు, 8332995398
(రచయిత నవతెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్)