Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కాలం చెక్కిలిపై కన్నీటి బొట్టు'' అన్నాడు రవీంద్రుడు తాజ్‌మహల్‌ని. ప్రపంచం ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆ కన్నీటి బొట్టు రూపం మారిపోతున్నది. ధవల వర్ణంలో మెరిసిపోయే తాజ్ క్రమంగా రంగు కోల్పోతున్నది. భారతీయ వాస్తుకళా ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఆ మహా కట్టడం మనకు లభించిన అద్భుత చారిత్రక వారసత్వం. ఆ వారసత్వాన్ని మన తరువాతి తరాలకు చెక్కుచెదరకుండా అందజేయవలసిన బాధ్యత మనుగడలో ఉన్న తరానిదే. మరి ఈ బాధ్యతను ఈ తరం ఎంతవరకు నెరవేర్చుతున్నది? నూనెకర్మాగారాలు, కార్పొరేట్ కంపెనీలు, సామాన్య జనం, ప్రభుత్వం... అందరూ ఈ కట్టడం రూపుమారడానికి కారకులే. వీరందరూ కాలుష్య కాసారంగా తాజ్ ఉన్న పరిసరాలను మార్చివేయడంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం కలుగజేసుకున్నది. ఇక తప్పించుకోలేని ప్రభుత్వం అత్యవసరంగా ఒక కమిటీని నియమించి తాజ్ మహల్ ని పరిరక్షించే చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ విశిష్టత, దాని మనుగడకు ఏర్పడిన ప్రమాదం గురించి చెబుతున్నది ఈవారం కవర్‌స్టోరీ.
యునెస్కో (ఐక్యరాజ్యసమితి) ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించిన తాజ్ మహల్ కేవలం భారతీయులదే కాదు, మొత్తం ప్రపంచపౌరులందరిదీ. దేశం, ప్రాంతం ఏదైనా ప్రపంచ మానవాళి అంతా సగర్వంగా తమ ఉమ్మడి వారసత్వ సంపదగా చెప్పుకోదగిన కట్టడాలు కొన్నే ఉన్నాయి. అందులో మన తాజ్ మహల్ ఒకటి. తాజ్ మహల్ ఎందుకంత విశిష్టత సొంతం చేసుకుందో తెలియాలంటే కొంత సమాచారాన్ని అర్థం చేసుకోవాలి.ఆకాలం (17వ శతాబ్దం)లోనే సుమారు 50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ మాసోలియం మొగలాయీల కళావనంలో వికసించిన పుష్పం అని చెప్పక తప్పదు. దాంపత్య ప్రేమకు, సామరస్యానికి, విశ్వాసానికి ఇది ఒక ప్రతీక. సర్వాంగ సుందరమైన కళ, అత్యంత నైపుణ్య నిర్మాణ కౌశలం కలయికే ఈ స్మారక కట్టడం. అద్భుతమైన కళాప్రతిభను, అసాధారణమైన శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశంసనీయమైన సాంకేతిక నైపుణ్యాన్ని, అపురూపమైన అందాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ అందం, నైపుణ్యం, వైభవోపేతమైన అలంకరణ, ఆకర్షణీయమైన హుందాతనం , అలరించే ఉద్యానవనాలు, పరిపూర్ణమైన నిర్మలత్వం, వాస్తుకళాసృష్టిలోని పొందిక... ఇవన్నీ కలిసి ఈ కట్టడాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిపాయి. మొగల్ వాస్తుకళకు చెందిన తార్కిక క్రమ పరిణామమే ఈ నిర్మాణం అని చరిత్రకారులు అంటున్నారు.
ఇండో-ఇస్లామిక్ శైలి
కట్టడ నిర్మాణ పరంగా మధ్యయుగాన్ని ఇండో-ఇస్లామిక్ యుగం అనికూడా అనవచ్చు. మధ్య ఆసియా నుంచి వచ్చిన మొగల్ పాలకులు అక్కడి నిర్మాణపు సాంకేతిక విజ్ఞానాన్ని భారతీయ వాస్తు శిల్పంతో మిళితం చేసి ఒక కొత్త శైలిని సృష్టించారు. అందువల్లనే దీన్ని ఇండో-ఇస్లామిక్ శైలిగా పిలుస్తారు. తాజ్ మహల్ ఈ శైలికి అత్యుత్తమ ఉదాహరణ. డోములు, మినార్లు, ఆర్చీలు తాజ్‌కి వింత శోభను చేకూర్చాయి. పచ్చటి పరిసరాల మధ్యగా ఎరుపు కాలిబాట; నేపథ్యంలో నీలపు ఆకాశం తాజ్‌కి అద్భుతమైన సౌందర్యాన్ని చేకూర్చాయి.
తాజ్ నిర్మాత షాజహాన్ నియమించిన తోటల డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ ఎంతో ఆలోచించి తాజ్ ఉన్న ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన కట్టడం తోట మధ్య భాగంలో కాకుండా దూరంగా చివర భాగంలో నిర్మించడం వల్ల ఆ ప్రాంగణంలోకి ప్రవేశించినవారికి అల్లంత దూరంలో తాజ్ అద్భుతంగా దర్శనం ఇస్తుంది. ఈ దృశ్యం చూపరులను విస్మయపరుస్తుంది. చతురస్రాకారపు వేదికపై నిర్మితమైన సమాధి; నాలుగు దిక్కులా నిర్మితమైన ఎనిమిది పార్శ్వాలు కల మినార్ల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నది. తాజ్ మహల్ లోపల ఉన్న ముంతాజ్ గోరి, షాజహాన్ గోరి (షాజహాన్ మరణించిన తరువాత అతడి పార్థివ దేహాన్ని కూడా ఇక్కడే పాతిపెట్టారు) చుట్టూ చలువరాతితో అద్భుతమైన స్క్రీన్ ఏర్పాటుచేశారు. ఇది అలనాటి మొగల్ కళాకారుల నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ స్క్రీన్‌ని ఎంతో నైపుణ్యంతో పాలిష్ చేసి, తీగలు పుష్పాల ఆకారంలో విలువైన రాళ్లను పొదిగారు.నిజానికి ముంతాజ్, షాజహాన్ గోరీలుగా పైకి కనిపిస్తున్నవి ప్రతీకాత్మక గుర్తులు మాత్రమే. అసలు సమాధులు లోపల గదిలో ఉన్నాయి. మధ్యయుగ మొగల్ సమాధులన్నీ ఈవిధంగా నిర్మించడం ఒక ఆనవాయితీ.
తాజ్‌మహల్ ప్రాంగణంలో ప్రధాన కట్టడం తాజ్ కాక మసీదు, గెస్టహౌస్, ప్రధాన ద్వారం; దానికి ఇరువైపుల ఉన్న షాజహాన్ మరో ఇద్దరు భార్యల సమాధులు ఉన్నాయి. ఈ ప్రాంగణం అంతా భారత పురావస్తు సర్వేక్షణా సంస్థ(ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) కింద ఉంది. ఆ సంస్థ నిరంతరం జాగ్రత్తగా దీన్ని పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు రిపేరింగ్ పనులు చేపడుతూ ఉంటుంది. ఇట్లా మరమ్మత్తు పనులు జరగడం బ్రిటీష్ వాళ్ల కాలం నుంచి జరుగుతున్నవే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తాజ్‌మహల్ తీవ్రమైన వాతావరణ కాలుష్యానికి గురవుతూ ఉంది. ఇందువల్ల తెల్లని తాజ్ రంగు క్రమంగా మారిపోతున్నది. ఈ కాలుష్యాన్ని నియంత్రించి తాజ్‌ని రక్షించడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. దీనికి ఆగ్రహించిన భారత సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. నిజానికి ఇట్లా ప్రభుత్వాలకు మొట్టికాయలు వేయడం కొత్తేమీ కాదు. 1996లో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తూ తాజ్ ట్రెపీజియం జోన్ (టిటిజడ్)లో ఉన్న పరిశ్రమలేవీ బొగ్గును ఇంధనంగా వాడరాదని, అటువంటి పరిశ్రమలు సహజవాయువుకు మారడమో లేక వేరే ప్రాంతాలకు తరలిపోవడమో చేయాలని పేర్కొంది. టిటిజడ్ లో మొత్తం నలభై రక్షిత కట్టడాలు ఉన్నాయి. అందులో తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రపంచవారసత్వ కట్టడాలు కూడా ఉన్నాయి.
పరిశోధకులేమన్నారు?
భారత, అమెరికా శాస్త్రవేత్తల బృందం ఒకటి సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఆగ్రాలో పెరిగిన వాయు కాలుష్యం వల్ల తాజ్ కలర్ ఎట్లా మారుతుందో బయటపడింది. అమెరికాకు చెందిన జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విస్కాన్సిన్ యూనివర్సిటీలకు చెందినవారు, ఇండియాకు చెందిన కాన్పూర్ ఐఐటి, ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) నిపుణులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వీరి పరిశోధనా ఫలితాలు 2014 డిసెంబర్‌లో 'ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు ముందుగా ఒక ఏడాదిపాటు తాజ్ దగ్గర గాలిలో ఉన్న కాలుష్యాన్ని ఫిల్టర్లను ఉపయోగించి గుర్తించారు. గాలిలో అధికమొత్తంలో కాలుష్యకారక కణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ కణాలు తాజ్ కలర్‌ని మార్చడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వాతావరణ కాలుష్యానికి ఏమాత్రం గురికాని స్వచ్ఛమైన చలువరాతి ముక్కలను తాజ్ మహల్‌పై ఎంపిక చేసిన చోట్ల పెట్టారు. రెండు నెలల తర్వాత ఆ శాంపిల్స్‌ని ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎక్స్ రే స్పెక్ట్రోస్కోప్ వంటివాటిని ఉపయోగించి విశ్లేషించారు. చలువరాతి ముక్కలపై పేరుకుపోయిన కాలుష్యకారకాలను గుర్తించారు. ఇందులో మూడు శాతం బ్లాక్ కార్బన్, సుమారు 30 శాతం ఆర్గానిక్ కార్బన్ (బ్రౌన్ కార్బన్), మిగిలినది దుమ్ముకణాలుగా గుర్తించారు. బ్లాక్ కార్బన్... వాహనాలు, ఇతర యంత్రాలు దహనం చేసిన ఇంధనాలనుంచి వెలువడినట్లు, బ్రౌన్ కార్బన్... వ్యర్థపదార్థాలు, చెత్త, పేడ వంటి బయోమాస్‌ని దహనం చేసినందువల్ల వెలువడినట్లు గుర్తించారు. బ్లాక్ కార్బన్ తెల్ల చలువరాతిని ఊదా (గ్రే) రంగులోకి, బ్రౌన్ కార్బన్, ధూళి కణాలు... పసుపు వర్ణంలోకి మార్చుతున్నాయి. మొత్తంమీద పరిశోధకుల విశ్లేషణ సారాంశం ఏమిటంటే..కాంతిని సంగ్రహించగల దుమ్ము, ధూళికణాలు, కార్బన్ కణాలు తాజ్ మహల్ రంగు మారడానికి కారకాలు.
ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ 2008 నుండి తాజ్ మహల్ పసుపు రంగులోకి మారిన చోటల్లా ముల్తాన్ మట్టిని అతికించి (క్లే ప్యాక్) ఆ రంగును తొలగించే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ పద్ధతి మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇట్లా ముల్తాన్ మట్టి ప్యాక్‌లు వేసుకుంటూ పోతే తాజ్ అందానికి మరింత ప్రమాదమని అంటున్నారు. బొల్లి వ్యాధిగ్రస్తునిలా తాజ్ మరకలు మరకలుగా కనిపించే అవకాశం ఉందనేది వారి మాట.
అసలేం జరుగుతున్నది?
తాజ్ అందాలకు భంగం కలిగించే కారకాలు అనేకం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్, కట్టెలను ఉపయోగించి దహన సంస్కారాలను పూర్తిచేసే స్మశానాలు, చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, రోజు రోజుకు పెరుగుతున్న ఆగ్రా జనాభా ఇందులో కొన్ని. జనాభా పెరిగిపోతుండటంతో యమునా నది నీటిని అధికంగా వాడుకుంటారు. అట్లా జరిగితే నదిలోని నీరు అడుగంటి బురద బయటపడుతుంది. యమునా నది నేపథ్యంలో తాజ్‌ని చూడటానికి, బురద మైదానం నేపథ్యంలో తాజ్‌ని చూడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా! జనాభా పెరగటంతో పట్టణంలో నానాటికీ పెరిగిపోతున్న చెత్తా చెదారాన్ని తొలగించి, దాన్ని ప్రమాద రహితంగా మార్చి తిరిగి వాడుకోవడం మున్సిపాల్టీకి చేతకావడంలేదు.
ప్రతి రోజు మున్సిపాల్టీవారు పోగుచేసే వ్యర్థా (గార్బేజ్)ల్లో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, న్యూస్ పేపర్లు, పాతబట్టలు, ఆహార సంబంధిత వ్యర్థాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని ఒక క్రమ పద్ధతిలో గోతుల్లో పూడ్చిపెట్టడం, లేక ఇతర వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అనుసరించి రీసైకిలింగ్ చేడానికి బదులు మున్సిపల్ సిబ్బంది కాలుస్తున్నారు. ఇందువల్ల పెద్ద ఎత్తున పొగవెలువడుతున్నది. ఈ పొగతోపాటు వెలువడే అనేక ప్రమాదకర రసాయన విషవాయువులు, రేణువుల వల్ల తాజ్‌మహల్ అందాలకే కాదు, ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు ఏర్పడుతున్నది. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటా కి చెందిన డా||అజరు నాగపురే అనే పరిశోధకుడు ఇండియాలోని మున్సిపాలిటీ చెత్తసమస్యపై 'ఎన్విరాన్‌మెంటల్ సైన్స అండ్ టెక్నాలజీ' జర్నల్‌లో పరిశోధనా వ్యాసం రాశారు. ''మేం ఢిల్లీ, ఆగ్రాల్లో బహిరంగంగా మున్సిపాలిటీ చెత్తా చెదారాలను కాల్చివేయడాన్ని అధ్యయనం చేశాం. ఢిల్లీ 190 నుండి 246 టన్నుల వ్యర్థాలను కాల్చివేస్తుంటే, ఆగ్రా రోజుకి 223 టన్నుల వ్యర్థాలను కాలుస్తున్నది. దీన్ని బట్టి అక్కడ ప్రమాద ఘంటికలు ఎంత తీవ్రంగా మోగుతున్నాయో అర్థమవుతున్నది. దాదాపు 25 శాతం వ్యర్థాలను ఆగ్రావాసులు కాల్చడం ద్వారా వదిలించుకుంటున్నారు.ఇందువల్ల వచ్చే పొగవల్లనే మహాకట్టడం తాజ్‌కి ప్రమాదం కలుగుతున్నది'' అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నిజానికి తాజ్ ఉపరితలం రంగు మారడం ఒక్కటే సమస్య కాదు. కొన్ని చోట్ల కట్టడానికి చిన్న చిన్న రంధ్రాలపున్నాయి. క్రిమికీటకాలు, ఆమ్లవర్షాలు ఉపరితలాన్ని తినివేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2015లో సుప్రీం కోర్టు తాజ్ మహల్ చుట్టుపక్కల ఉన్న కట్టెలను ఉపయోగించి శవ దహనం చేసే స్మశానాలపై ఆంక్షలు విధించింది. కట్టెల బదులు విద్యుత్తును ఉపయోగించి దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించింది. అట్లాగే ఆగ్రా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆవుపేడను (పిడకలను) కాల్చడాన్ని నిషేధించింది. ఇప్పటికీ పేదలు ఎండిన ఆవు పేడను ఉపయోగించి వంటచేసుకోవడం కనిపిస్తున్నది. వారంతా గ్యాస్ పొయ్యిని ఉపయోగించి వంటచేసుకొనే స్థితికి ఎప్పుడు రావాలె?! ఈ ఆవుపేడ కాల్చడం వల్ల బ్రౌన్ కార్బన్ వెలువడుతున్నది. దీనికారణంగానే తాజ్ ఎల్లో-బ్రౌన్‌గా మారుతుందని అంటున్నారు.
ఇది ఇట్లా ఉంటే ఆగ్రాకి దగ్గరలో ఉన్న మధురలో నూనె శుద్ధికర్మాగారం నుండి వెలువడే కాలుష్యం వల్ల తాజ్‌కి తీరని హాని జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ తన నూనెశుద్ధి కర్మాగారాన్ని విస్తరించాలనే ప్రయత్నాలు చేయడం బాధాకరం. ఈ ప్రయత్నాలను వాతావరణ ప్రేమికులు, సాంస్కృతిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చారు.
నానాటికీ తాజ్‌మహల్ రంగు మారడం పట్ల సుప్రీం కోర్టు కోపగించింది. ''ఈ కట్టడాన్ని కాపాడుతారా? లేక మూసివేస్తారా?'' అంటూ పాలకులను గతవారం గట్టిగా అడిగింది. దీంతో హడావిడిగా ఒక కమిటీని వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఎటువంటి సూచనలు చేస్తుందో చూడాలి మరి.
మధుర రిఫైనరి
మధుర పట్టణం ఆగ్రాకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అందువల్లనే ఆ పట్టణంలో ఉన్న నూనెశుద్ధి కర్మాగారం నుండి వెలువడే అనేక వాయుకాలుష్య కారకాలు తాజ్‌మహల్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా నూనెశుద్ధి కర్మాగారం నుంచి వెలువడే సల్ఫర్ డె ౖఆక్సైడ్ వాతావరణంలో ఉన్న నీటితో కలిసి సల్ఫ్యూరిక్ ఆసిడ్‌గా మారుతుంది. ఇదే వర్షంవచ్చినప్పుడు భూమిపై పడుతుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆసిడ్ కలిగిన వర్షానే 'ఆమ్లవర్షం' అంటారు. ఈ ఆమ్లం తాజ్‌మహల్ అరిగిపోవడానికి, దాని తెల్లని రంగు మారడానికి కారణం అవుతున్నది.
రంగు మారుతోంది
తాజ్ మహల్ ఉపరితలం బ్లాక్ కార్బన్ వల్ల ఊదా రంగులోకి, బ్రౌన్ కార్బన్, దుమ్ము వల్ల పసుపు రంగులోకి మారుతున్నట్లు గ్రహించాం.
- డా||ఎస్.ఎన్.త్రిపాఠి, ఐఐటి
- సోపతి డెస్క్