Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్ఠానపురానికి రాజు విక్రమార్కుడు. శాంతి శీలుడనే బౌద్ధ బిక్షువు రోజూ ఒక రత్నం లోపల ఉంచిన ఒక ఫలాన్ని రాజుకిస్తూ ఉంటాడు. ఇలా ఆ ఫలాన్ని ఎందుకిస్తున్నాడో చెప్పాలని రాజు అడిగినప్పుడు, 'ఒక మంత్ర సాధన కోసం నీ సాయం కావాలి రాజా' అంటాడా సన్యాసి. కష్ణ చతుర్దశి నాడు శ్మశానం వచ్చి శింశుపా వక్షానికి వేలాడే శవం తెచ్చి సాయం చేయాల్సిందిగా అర్థిస్తాడు. విక్రమార్కుడు ఆ చెట్టుమీద ఉన్న శవాన్ని భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవడం ప్రారంభిస్తాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, 'నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక కథ చెబుతా విను!' అంటూ ఒక కథ చెప్పి ఒక ప్రశ్న అడిగి 'ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి వక్కలౌతుంది' అనడం తెలివైన విక్రమార్కుడు తెలివితక్కువగా, వచ్చిన పని మర్చి పోయి సమాధానం చెబుతూనే ఉండటమూ, మౌనంగా వెళ్ళాల్సినవాడు, శవాన్ని అప్పగించాల్సిన విక్రమార్కుడు, మౌనం వీడి తెలివి ప్రదర్శించడంతో బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కి మళ్ళీ మనకో కథ చదివే అవకాశం ఇస్తూ! బేతాళుడు నాటి మన అపరూప జ్ఞాపకం! ఎంతగా గుండెలకు హత్తుకున్నాం, కొంచెం భయంగా, ఇంకొంచెం బెరుగ్గా.. ఈ భుజం మీద శవాన్ని?... పండిత లోకానికి బహత్కథనో, కథాసరిత్సాగరమో చేరువ కొస్తే, పామరులకోసం ఏకంగా చందమామ ముంగి టికొచ్చి చేతికందేది! ఆరొందల పైచిలుకు అల్లిబిల్లి కథలన్నింటినీ అందమైన చిత్రాల్లో పొదిగి అందిం చిన కథా వేదిక నాటి ఒకానొక అజరామర కానుక! అందులో బేతాళకథల శీర్షిక కింద సాగిన నిరంతర కథా మాలిక ఒక అపురూప జ్ఞాపకాల యవనిక!
ఈ ఆధునిక బేతాళ శతకథావింశతి రూపశిల్పి ప్రసిద్ధ మార్క్సిస్టు అధ్యయన కారులూ, అనేక మార్క్సిస్టు శాస్త్ర గ్రంథాల రచయితా, బతుకుపోరు కథా సంకలనకారులూ అయిన రావుకష్ణారావు ప్రతీకాత్మకంగా తెలుగుజాతి మూలుగుల్లో ఆవహించిన బేతాళుడ్ని భుజానికెత్తుకొని శ్మశాన వాటికల్ని ఒదిలి, విలువలు లుప్తమైపోతున్న జన వాహినిలోకి నిబ్బరంగా చొరబడ్డారు! భుజం మీద శవం తానై, మోసే విక్రమార్కుడూ తానే అయి, ఎవడికీ పట్టని సామాజిక వికతుల్ని ప్రశ్నిస్తూ, విసుగు చెందని విక్రమార్కుడిలా సమాధానాలు వివరిస్తూ వంద కథల సమాహారాన్ని తెలుగు పాఠకులకు ధారావాహిక స్రవంతిగా విశాలాంధ్ర వేదికగా అందించారు గతంలో. కారా, కాకరాల, రంగనాయకమ్మ ఇంకా ఎందరో కథా దిగ్గజాలూ రావు ప్రయత్నాన్ని హదయపూర్వకంగా స్వాగతించి ప్రశంసించారు.
మధ్య నిషేధం గురించి అనుకుంటా, ఓ చోట అంటారు రావు 'కొంపలంటింపజేసి బొగ్గులేరి వాటితో గంజి కాసి పోయడమ'ని! నాలుగైదు వేల కోట్ల ఆదాయం కోసం ఇరవైవేలకోట్ల మద్యాన్ని తాగించి ఇంటికొక బంగారు బాతునిచ్చి, వాడు ఓటరుగా చావకుండా ఉండేందుకు పింఛనిచ్చి బతికించే యుగధర్మం మను ధర్మాన్ని మరిపించదా మరి! మనందరికీ పేరుకే ఎర్ర బస్సు అది! రావుకు మాత్రం అది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతాన్ని వెక్కిరించే చిహ్నం! అదంత హుందాగా ఏదో ఎరుపుకి ప్రతీకగా కళ్ళముందు గర్వంగా వెడుతుంటే హాస్టల్లో వుంటూ, మెరిగల్లో, పురుగుల్లో అన్నం మెతుకులు ఏరుకోవడం కష్టమై రోడ్డెక్కిన స్కూల్ పిల్లాడికి కూడా అలుసే... స్ట్రైక్ అంటే చాలు రాయి విసరడానికి ఎర్రబస్సు వళ్ళప్పగించేది! ఏమీ తెలీని పసివాడికే ఎర్రబస్సు అలుసైతే ప్రపంచ బ్యాంకు పాలకులకు అది ఎందుకు కంటగింపు కాదు? అందుకే తరచూ దాని ఉసురు తీసే ప్రయత్నం. ప్రజారాజ్యంలో ప్రజాసేవ చేయడానికి ప్రజలెన్నుకున్న వాళ్ళ చేతుల్లో ఆస్తులు పెట్టేయాలి. ఈ మర్మం తెలుసుకుంటే అన్నీ అర్ధం అయినట్టే!
భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఒట్టి అబద్ధం! అది డబ్బు చుట్టూ తిరుగుద్ది! సరుకు చుట్టూ తిరుగుద్ది!
ప్రశాంత నిలయాల్లో, సినీ హీరోల ఇళ్లల్లో తుపాకీ మోతలు వినబడవ్, రక్తం మరకలు అంటవ్. బడుగు దేశంలో ప్రజలే బడుగులు గానీ గుడులూ, గుళ్లో లింగాల్ని మింగేవాళ్ళు మాత్రం కాదు! మఠాధి పతులకు ఏమైనా అయితే ఇంకేమైనా వుందా, రాష్ట్రపతులే వస్తారు. వీధి కుక్కల్ని ప్రేమించే అమ్మణిలో ప్రేమించే స్వభావాన్ని 'ప్రేమించుకునే' బలహీనతని బాగా చెప్పారు! పసిబిడ్డ కాళ్లు, మొహం కండలుగా పీకేసిన కుక్కల క్షేమం పట్ల అవ్యాజమైన ప్రేమ ఆ పసికందుపై ఇసుమంత చూపినా యెంత బావుండు!
విద్య మీద ప్రభువర్గాలకులేని వలపు ప్రపంచ బ్యాంకు వాడికెందుకో భలేగా చెబుతారు! ఊళ్ళో జేసీబీలూ నడపాలంటే వాడికి ఏబీసీలు రావాలి! క్రికెట్టు గ్రౌండులో హౌర్డింగులు చదివి వందైనా చేయని బూట్లను ఐదువేలకు కొనాలంటే ఆ పాటి జ్ఞానం కావాలి! అట్టకట్టుకుపోయిన తాటిమట్ట టైపు చిరుగుల జీనుపాంటు మీద బ్రాండు పేరు చదివేందుకు పదో తరగతన్నా ఫేలై ఉండకపోతే వరల్డు బ్యాంకు వాడు ఎందుకు ఫీలవుతాడో కథగా చెబుతారు రావుగారు!.
ఆ మధ్య ఆంగ్ల మాధ్యమం చదువులపై న్యాయ స్థానాలు సైతం దోబూచులాట్టం వెనుక కుట్రని పదిహేనేళ్ల క్రితమే చెప్పేరు రావు! సామాన్యుడి కోసం కాదది అమెరికా వాడికి ఊడిగం చేసిపెట్టే తెలివైన పిల్లల్ని వడగట్టుకుపోయి వీసాలిచ్చే ప్రయత్నం అంటారు. ఈ దేశంలో స్త్రీ లోకానికున్న అదనపు పాతివ్రత్య బానిసత్వపు సూత్రాన్ని బొమ్మిడాయి కథలో చెబుతారు. జిడ్డు వారి ''నిన్ను నువ్వు తెలుసుకో'' తాత్విక సూత్రంలో మర్మాన్ని చెబుతూ, దోపిడీదార్లకు వాళ్లేమిటో తెలుసనీ, తెలియాల్సింది పీడితుడికేనంటారు!
వ్యక్తిత్వ వికాసం కాదది వ్యక్తిత్వ వినాశం అంటారు బోల్డ్‌గా! సినిమాల మీదా, సాహిత్యం మీదా, వాస్తు మీదా, పీఠాధిపతుల మీదా, వ్యాపార నీతుల మీదా సంధించిన వ్యంగ్యాస్త్రాలు వ్యాపార కూట నీతుల్ని ప్రతిభా వంతంగా వివరిస్తారు!
నిజం చెప్పొద్దూ, కాపిటల్ పూర్తిగా అర్థం కాలేదు ఏనాడూ అనుకున ేవారికీ, బహుశా చాలా మంది మధ్యలో ఆపేసిన వారికీ, రావు రచనల్లో, మరీ ముఖ్యంగా, బేతాళ కథల్లో అంతర్లీనంగా తారట్లాడుతూ, సునిశితంగా తాకే, కాపిటల్ చదివిన పరిణితి అనుభూతమయ్యాక ఇంక చదవకుండా వుండలేరు! ఏ పెట్టుబడి గురించి నిరంతరం వేదనతో వ్యధాభరితుల మౌతామో, ప్రతినిమిషం ఆందోళనలకు గురికాక తప్పదో, ఆ పెట్టుబడి వికత లీలల్ని తెలుసుకోవడానికి పెట్టుబడి గ్రంథమే విరుగుడన్నది రావుగారి కథలు చెప్పకనే చెబుతారు!
ప్రతి వ్యక్తీ ఏదో ఒక జ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూ సంతప్తి చెందుతుంటాడు. అది మానవ వికాసానికా, వినాశనానికా అన్నదే ముఖ్యం. సమాజాన్ని మార్చడానికి ముందు ఏం మార్చాలో తెలియజేయడానికి ఒక రూట్ మ్యాప్ కావాలి! మార్చడానికి సంసిద్ధులు కావడం ఒక్కటే సరిపోదు, ఎలా మార్చాలో అనే జ్ఞానం కంటే ఏది మారాలి ఈ సమాజంలో అని తెలియజెప్పే జ్ఞానం నేటి అవసరం. అదిగో! ఆ జ్ఞానం కోరేవారికి రావుగారు బేతాళ కథలు ఒక కల్ప తరువు! అవి వంద కథలు కావు, సమాజంలో మనకి సాధారణంగా అర్ధం కాని శతాధిక సమస్యల పరిష్కారాలకు తోవ చూపే వెలుగు దారులు.
(రావు కష్ణారావు గారి ఆధునిక బేతాళ కథా సంకలనంపై చిరు పరామర్శ)
- వి.విజయకుమార్,
8555802596