Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది రోజూ
నడుస్తూసాగే వింత సంత
దేశ వర్తమాన ముఖచిత్రం
ఈ సంచార సమిష్టి కుటుంబం
జీవితాలన్నీ కలబోసుకున్న రంగస్థలి.
బస్సులోనే ఉదయిస్తాయి కొన్ని బతుకులు బస్సులోనే పయనిస్తాయి కొన్ని సంసారాలు.
వీళ్లంతా
ప్రజలు బహుకరించిన
కష్టజీవి బిరుదాంకితులు
ఒకటో తారీకు కలలు గనే ఉద్యోగులు
గిలేటి బాసండ్లమ్ముకునే మాసిన తలలు
వలలతో గాసంకు వెళ్లే గంగ పుత్రులు
తోటను గంపలో తెచ్చిన అంగడి దారులు
బరువులతో బస్సెక్కిన బడి కార్మికులు
దేశ ప్రణాళికా రచనకు ఇదే అసలు పేజీ.
గంజి దొరకని పేద మొఖాలు
గంజి బట్టల చూపులకు బెదిరిపోతాయి
జరీ చీరల హౌరుగాలికి
మట్టికాళ్ళు వణికిపోతాయి.
భారతీయులందరూ సహౌదరులు
ఇక్కడ మాత్రం హెచ్చుతగ్గుల పలకరింపులు
అలసటని తుడుచుకుంటూ
టికెట్లు గాలిస్తున్న కండక్టరు నిలుచున్నచోటే
బతుకు బ్యాలెన్స ను సరిచేసుకుంటది. దేశాధినేతకున్న రీవీని స్టీరింగులో చూయిస్తూ
గమ్యం తెరను చీల్చుకుంటూ వెళ్తడు డ్రైవరు.
ఇంత రద్దీలోనూ
పక్కవాని పేపరును చప్పరించే
పిసినారి ఆకలి కండ్లు
చిన్నపిల్లల అల్లర్లు చిల్లర పైసల గలగలలు
చిన్నపాటి గొడవల చినుకులు
తడారిన ఏడ్పులు పాత యాది నవ్వులు
అదొక విచిత్ర వస్తు సముదాయ కేంద్రం
అదొక ఎత్తు పల్లాల ఆధునిక భారతం
ఆయుధాలు లేని నిత్యసమర క్షేత్రం.
భూమితో పాటు తానూ తిరుగుతున్న
ప్రజా జీవన వారధి ఈ పల్లె బస్సు.
- డా.ఉదారి నారాయణ,
9441413666