Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎంతో ఎంతో ఆనందం, జీవన సంధ్యామకరందం / నవ్వుల వెన్నెల పువ్వుల పున్నమిలో కన్నా జీవరసాద్ర కౌముదిని / విన్నా మమతల వేణుమాధురిని / ఎప్పుడు ఏమౌతుందో తెలియని / జీవన యాత్రా మార్గము నందున / బ్రతికే కాలపు క్షణాలు కొన్నే / నవ్వులు విసిరేలిప్తలుకొన్నే!' అని మనుమనితో ఆనందిస్తూ రాసిన పై కవిత పొత్తూరి వేంకట సుబ్బారావు గారి చివరి కవిత. కాలపు కర్కశత్వం యెరిగినవాడు. కవిత్వంలో తన్మయత్వం పొందినవాడు. పుట్టుక నుండి మరణం వరకు పదార్థ పరిణామాలను వివరించగలిగిన పాండిత్యము, కవిత్వీకరించగల నైపుణ్యమూ సొంతమైన వాడు. మానవీయ సంబంధాలన కొనసాగించిన సాహితీవేత్త పొత్తూరి వెంకట సుబ్బారావు గారు ఫిబ్రవరి పద్నాలుగున మనను వీడి పోవటం అత్యంత బాధాకరం.
సాధారణ సెంకడరీ గ్రేడు ఉపాధ్యాయుడుగా ఇల్లందు పరిసర ప్రాంతాలలో ప్రారంభమయి నిరంతర విద్యార్జనతో సాహిత్య పరిశోధనలో డాక్టరేటును సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. సాహిత్య సృజనను మాత్రం చివరి వరకూ కొనసాగించారు. ఆంగ్లోపన్యాసకుడుగా పని చేసినా ఆంగ్లంతో పాటుగా తెలుగు, సంస్కృత భాషలలో మంచి పండితుడు. నిరంతర అధ్యయన శీలి. మార్క్సిస్టు తత్వశాస్త్రాన్నీ అధ్యయనం చేశారు. తాత్విక, సాహిత్య విషయాల పట్ల మక్కువ చూపించారు. ప్రముఖ కథా రచయితలు జాతీశ్రీ, జీవన్, దిలావర్ సాహితీ వేత్తలు అద్దేపల్లి రామకోటి శాస్త్రి, లక్ష్మణమూర్తి మొదలైన వారితో ఆత్మీయ స్నేహంతో సాహిత్యా వరణంలో నిత్యం తనను తాను మెరుగు పెట్టుకున్నవాడు.
'A film into fiction' అనే అంశం మీద హెలెక్స్ హేలీ నవల రూట్స్ పైన పరిశోధన చేశారు. ఇష్టకామేశ్వర శతకం, మట్టపల్లి నృశింహ శతకం రాసినప్పటికీ ఆయన జీవన తాత్వికతను, ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిఫలించే కవితా సంపుటులు 'చక్రభ్రమణం', 'అంతశ్చేతన'. ఒకటి మానవుని జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, రెండోది మానవ పరిణామాన్ని దృశ్యమానం చేస్తుంది. 'అంతశ్చేతనం' సినారె విశ్వంభర కావ్యంతో పోల్చదగినది. ఇవేకాక అనేకమైన సాహిత్య వ్యాసాలను ఆంగ్లంలో రాశారు.
ప్రముఖ వాగ్గేయ కారులు రామదాసు, శ్యామశాస్త్రిల మీద ఆంగ్లంలో వీరు రాసిన వ్యాసాలు టి.టి.డి. వారు ప్రచురించారు. వాల్మీకి, కాళిదాసు, షేక్సిపియర్, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల సాహిత్యాన్ని విశ్లేషించి చెప్పగల దిట్ట.
సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునిక భావాలతో అభ్యుదయాన్ని కోరుకున్నవాడు. ప్రజాస్వామిక వాదిగా లౌకిక భావాల ఆచరణ శీలిగా అచ్చమైన భారతీయ సమాజపు ఆలోచనల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాడు సుబ్బారావుగారు. భిన్నమైన భావాలను, ఆలోచనలను సైతం ఆహ్వానించి, చర్చించే స్వభావం వారి సొంతం.
ఖమ్మంలో మా అందరికీ స్నేహాన్ని పంచుతూ, సాహిత్య సభలన్నింటిలోనూ పాల్గొని అనర్ఘళంగా ప్రసంగించే వారు. సాహితీ స్రవంతి, తెలంగాణ సాహితికి గౌరవ సలహాదారుగా ఉంటూ ప్రోత్సహించారు. వారి కుమారుడు సీతారామారావు కూడా సాహిత్య సృజనలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ జన విజ్ఞాన వేదిక ద్వారా శాస్త్రీయ భావాల ప్రచారంలో ముందున్నారు. నేటి యువ సాహిత్య లోకానికి స్ఫూర్తి దాయకంగా వున్న సుబ్బారావు గారు లేకపోవడం మన సాహిత్య రంగానికి తీవ్రమైన లోటు. ''మన సంతోషాలకు, దు:ఖాలకు, మన స్నేహాలకు, విరోధాలకు, మనం జీవించే క్షణాలకు, జీవిస్తూ మరణించే లిప్తలకు, కర్త, కర్మ, క్రియలం మనమే'' అంటూ తన కర్తృత్వానికి చివరి వాక్యం లిఖించి జ్ఞాపకాల్ని మనకు మిగిల్చివెళ్ళాడు.
- కె.ఆనందాచారి