Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జయంతి తే సుకృతినో రస సిద్ధా: కవీశ్వరా:
నాస్తి తేషాం యశ: కాయే జరామరణజం భయం''
భర్తృహరి నీతి శతకములోని పై శ్లోకంలోని లక్షణాలు వాసాల నర్సయ్య గారికి సరిపోతాయి.
''సాహిత్యం'' అన్న పదంలోనే మంచి హితవు అన్న అర్థం ధ్వనిస్తుంది. వాసాల వారి కలం సమాజాన్ని ఉత్తేజపరిచే సాహిత్యాన్ని సృష్టించడానికి నిరంతరం తపించి తపించి.. ఫిబ్రవరి 14న మూగపోయింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వాసాల నర్సయ్య గారు నిరాడంబరులుగా జీవించి సాహిత్యానికి అలంకారాలు.. అందాలు అద్ది తెలుగు సాహితీ చరిత్రలో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు.
మారుమూల కుగ్రామం జగిత్యాల జిల్లా చౌలమద్దిలో 1942లో లక్ష్మమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన వాసాల నర్సయ్య. చిన్నప్పటి ప్రత్యేక స్థానాన్ని పొందుతూ.. విజ్ఞానాన్ని.. వికాసాన్ని తెలివి తేటల్ని స్వంతం చేసుకుంటూ తన జీవితాన్ని సాగించారు. చదువు విలువ తెలియని కాలంలో చదువుకోవాలన్న దృఢ సంకల్పంతో నాటి మెట్రిక్యులేషన్ వరకు చదివారు. అది కూడా రవాణా సౌకర్యాలు లేని రోజులో ప్రతి రోజు కాలినడకన 10 కిలోమీటర్లు తన స్నేహ బృందానికి ఆధిపత్యం వహిస్తూ విద్యాభ్యాసం పూర్తి చేసారు. తదనంతరం జాతీయ భాష హిందీలో భూషణ్ పట్టాను పొందారు.
మొదట ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఆ తర్వాత పోస్టుమాస్టర్‌గా పనిచేసి సాహిత్య సేవ చేశారు. కర్షకుడా.. కార్మికుడా అనే తొలి గేయ సంపుటిని 1978లో ముద్రించి సాహితీ ప్రపంచంలో అరగ్రేటం చేశారు.
సాహిత్యానికి బీజం వారి కుటుంబం, సమాజం నుండి లభించింది. వాసాల నర్సయ్య గారి లేఖని నుండి 34 ముద్రిత రచనలు వెలుబడ్డాయి. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను చేపట్టిన వాసాల నర్సయ్య గారి సాహితీ ప్రస్థానంలో వెలువరించిన ముద్రించిన సాహిత్యాన్ని ప్రక్రియా పరంగా విభజిస్తే ఈ విధంగా ఉంటుంది.
ప్రక్రియా పరంగా విభజన
1) వచన కవిత్వం : చిరుతరగలు, ఈ దేశం, గమ్యం
2) వ్యాస సంపుటాలు : సమాజానికి సంకెళ్ళు, అనాచారాలు - అనర్థాలు
3) గేయ సంపుటాలు : కర్షకుడా - కార్మికుడా, శ్రమగీతం
4) బాల సాహిత్యం : తపాల ప్రపంచం, పొడుపు క(వి)తలు, బాల బొమ్మలు, కార్డులు- కబుర్లు, చిట్టిపొట్టి కథలు, కథలు-కదంబం, స్పూర్థి కథలు - 1, వాసాల బాలల గేయ సుమాలు, విజ్ఞాన పొడుపు గేయాలు, స్ఫూర్తి కథలు -2, అంజయ్య - అరటి తొక్క, స్ఫూర్తి కథలు -3, సరిహద్దు గాంధీ - ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహారాణా ప్రతాప్ సింగ్, సిరిమల్లెలు, పిల్లల కోసం ఫిలాటలి, తారపద ముఖర్జీ జీవిత కథ
5) మినీ కవితలు : వాన
6) నిబంధనలు : తపాల ... ఉద్యోగులు, తపాల ఛార్జీలు
7) బాల గేయాలు - సంపాదకత్వం : గోగుపూలు, గులాబీలు, మల్లెమొగ్గలు
8) నానీలు : నవ పల్లవాలు
9) పొడుపు కథలు : మీ మెదడుకు పదునెంత?
10) వివిధాంశాలు : సర్కిల్ పిన్‌కోడ్, తెలంగాణలో బాల సాహిత్య రచనలు - రచయిత్రులు
పది రకాల సాహితీ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించి అందులో ప్రత్యేకించి బాల సాహిత్యంలో విశేష కృషిని చేసి బాల సాహిత్యంలో రారాజుగా నిలిచారు.
వివిధ ప్రక్రియల్ని చేపడుతూ.. సాహిత్యంలో ఒక ప్రత్యేకతను చాటుకోవాలని అనుకున్నారు. దాని కోసం ''మొక్కై వంగనిదే మ్రానై వంగునా'' అనే ఆర్యోక్తిని తలుస్తూ.. ''నేటి బాలలే రేపటి పౌరులు'' అని భావించి బాలల కోసం రచనలు చేస్తే సమాజ శ్రేయస్సు కల్గుతుంది అని గట్టిగా భావించారు.
అలా బాలల కోసం నిరంతరం శ్రమిస్తూ బాలలకు ఉపయోగపడే వివిధ వస్తువుల్ని సునిశితంగా పరిశీలించి బాలల స్థాయికి అర్థమయ్యేట్లు రచనలు చేసారు.
వాసాల వారిని అక్షర పిసినారి అనవచ్చు. ఎందుకంటే చెప్పదలుచుకున్న భావాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా సొగసుగా చెప్తారు కాని అక్షరాలను, తక్కువగా ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రత్యేకత. తక్కువ అక్షరాలతో ఎక్కువ భావాల్ని ప్రకటించి బాల సాహిత్యంలో అందెవేసిన చేయిగా రాణించారు.
వర్తమాన ప్రపంచాన్ని కన్నుల్లో వత్తులు వేసుకొని పరిశీలించి మరీ బాల సాహిత్యాన్ని రచించిన నిరంతర సాహితీ కృషీవలులు వాసాల నర్సయ్య.
వాసాల నర్సయ్య పొందిన పురస్కారాలు - అవార్డులు
వాసాల నర్సయ్య సాహితీ ప్రస్థానంలో విశిష్ఠ సాహితీ సామాజిక సేవల్లో నిమగమై ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు పొందారు. అందులో విశిష్టమైన పురస్కారం అత్యుత్తమమైన పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 2017లో వీరు బాల సాహిత్యానికి చేసిన కృషికి లభించినది.
తొలి పురస్కారం 1984లో రంగారెడ్డి జిల్లా సాహితీ కథా పురస్కారాన్ని సాహితీ సమితి రంగారెడ్డి వారు అందించారు. ఇప్పటివరకు 16కుపైన సాహితీ పురస్కారాలు అందుకున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2009లో రాష్ట్రస్థాయి బాల సాహిత్య పురస్కారం అందించారు. ఇది వారి బాల సాహిత్య కృషికి నిలువెత్తు దర్పణంగా నిలిచింది. బావి బాల సాహిత్య కృషికి రాశానని, ఏనాడు అవార్డుల కోసం సాహిత్యాన్ని రాయలేదని చెప్పుకునే వాసాల వారిని వెతుక్కుంటూ అవార్డులు వచ్చి వరించాయి.
ఎన్నో అవార్డులు పురస్కారాలు పొంది ప్రోత్సాహాన్ని పొందిన వాసాల నర్సయ్యగారు బాల సాహిత్యం రచించే కవులను ప్రోత్సహించేందుకు 2009లో వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు. ప్రతీ సంవత్సరం వీరి జన్మదినాన (26 జనవరి) ఈ పురస్కారాన్ని అందించారు. తొలి పురస్కారాన్ని టి.కాదాంత సూరి హైదరాబాద్ బాల సాహిత్య సృష్టికర్త 2009లో పొందారు.
సాహిత్యం సత్యం - శివం - సుందరం అన్న పలుకుబడి రవీంద్రుని వల్ల ఆధునిక సాహిత్యంలో వ్యాపించింది. సత్యము అనేక అంతస్థులలో వ్యాఖ్యానించుకోవచ్చు. అలాగే శివం సుందరాలు కూడా వాస్తవ జగత్తు, ప్రాణమయ జగత్తు, భావమయ జగత్తు ఇలా ఎన్నో మెట్లుమెట్లుగా అనుభవం పొందే కవి తాను చేరుకున్న మెట్లకు అనుగుణంగా దీనిని వ్యాఖ్యానించుకోవచ్చు. వాసాల నర్సయ్య గారి సాహిత్యంలో శాశ్వతమైన నైతిక విలువలు అంత:స్సుత్రంగా ప్రకాశిస్తున్నాయి.
వాసాల నర్సయ్యగారి బాల సాహిత్యంలో ఒక అన్వేషణ కనిపిస్తుంది. గేయమైనా బాల గేయమైనా ధారాళంగా పరిపుష్టంగా సాగుతుంది.
బాలలను అలరించడానికి వారి మేధో వికాసానికి కథలు గేయాలు, పొడుపుకథలు, వ్యాసాలు, ఇత్యాది పది క్రియల్లో విశేష కృషి చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాసాల నర్సయ్య గారికి, అశ్రునయనాలతో... అక్షర నివాళి అర్పిస్తూ... జాషువా కవి అన్నట్లు.
రాజు మరణించె
ఒక తార రాలిపడు
సుకవి మరణించె
ఒక తార గగనమెక్కు
రాజు జీవించు రాతి విగ్రహములయందు
సుకవి జీవించు ప్రజల నాల్కల యందు
అక్షరయోధుడైన వాసాల నర్సయ్య సృష్టించిన బాల సాహిత్యం వల్ల వారి కీర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు అజరామరమై నిలుస్తుంది.
- వాసాల వెంకటేశ్వర్లు,
9440201798