Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వాన్ని సృజించడమే కాదు, కవిత్వాన్ని సృజించే వారిని ప్రోత్సహించడం కవితాదీప్తికి సోపానం. ఇలాంటి సోపానాలెన్నో నిర్మించే కర్తవ్యదీక్షను కొనసాగిస్తున్నవాడు కవి యాకూబ్. పాతికేళ్ళ కిందట, అంటే 1992లో 'ప్రవహించే జ్ఞాపకం' ద్వారా కవితా రంగంలోకి అడుగుపెట్టిన యాకూబ్ నిత్య ప్రవాహశీల స్వభావంతో ప్రయాణిస్తున్నాడు. స్వయంగా కవిత్వమూ, వచనమూ రాస్తున్నాడు. కొన్నేళ్ళ కిందట లబ్ధప్రతిష్టులైన అజంతా, దేవిప్రియ, ఇస్మాయిల్, చేరాల సాహిత్యకృషిని ప్రపంచానికి మరింతగా తెలియజెప్పే కార్యక్రమాల్ని నిర్వహించాడు. దాదాపు అయిదేళ్ళ కిందట 'కవిసంగమం' ఆరంభించి వర్తమాన తరంలో కవితా చైతన్యాన్ని పరిపుష్టం చేసే కృషికి శ్రీకారం చుట్టాడు. తెలుగునాట కవితా సృజన కొత్త పుంతలు తొక్కడానికి యాకూబ్ చేసిన దోహదం విశాలమైంది. ఏకకాలంలో సాహిత్యకారునిగా, కార్యకర్తగా, ఉద్యమశీలిగా తన కార్యరంగాన్ని విస్తృతం చేసుకుంటూ తెలుగు సాహిత్య ప్రపంచం మీద తనదైన ముద్రవేశాడు యాకూబ్.
ఈవిధమైన కృషిలో భాగంగా రెండేళ్ళ కిందట స్వగ్రామమైన రొట్టమాకు రేవు (ఖమ్మంజిల్లా)లో కె.యల్.నర్సింహారావు పేరిట గ్రంథాలయాన్ని నిర్మించి దాన్నొక సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా మలిచే ప్రయత్నం చేయడం చెప్పుకోదగ్గ విశేషం. అంతేగాక 'రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు' పేరిట ప్రతి యేటా ముగ్గురు కవులకు అవార్డులు ఇవ్వడం గమనార్హం. ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ''షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం'' ను గుదిగుచ్చి ''రొట్టమాకురేవు కవిత్వ అవార్డు''గా ఇవ్వడం, ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పడం ద్వారా పల్లెలు, స్థానికత అనే అంశాలకు ప్రాధాన్యత కల్పించినట్టయింది.
నిజానికి 2010లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014లో మొదలుపెట్టారు. 2010-2014 సంవత్సరాలకు గాను సౌభాగ్య (సాభాగ్య కవిత), అరుణ్ సాగర్ (మేల్ కొలుపు), షాజహానా (దర్దీ), నంద కిషోర్ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశారు. 2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి), మోహన్ రుషి (జీరో డిగ్రీ), హిమజ (సంచీలో దీపం) లకు అందించారు. 2016 సంవత్సరం అవార్డులు ప్రసాదమూర్తి (పూలండోరు పూలు), శ్రీరామోజు హరగోపాల్ (రెండు దోసిళ్ళ కాలం ), సుజాత పట్వారి (పిట్టకు ఆహ్వానం) లకు ఈ నెల 29 న ప్రదానం చేయనున్నారు.
ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్. పుస్తకసంగమంగా పేరు పెట్టారు. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక. లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి యిచ్చి వెళ్ళారు. ఇంకా పుస్తకాల్ని సేకరించి గ్రంథాలయాన్ని పరిపుష్టం చేయాలన్నది కవి యాకూబ్ సంకల్పం. కనుక సాహిత్యాన్ని ప్రేమించేవారు ఈ 'పుస్తక సంగమం' కోసం పుస్తకాల్ని అందజేస్తే ఎందరికో ఉపయోగం చేకూరుతుంది.
సాహిత్యకేంద్రాలుగా నగరాలు, పట్టణాలే కాదు, గ్రామాలు కూడా వర్థిల్లాల్సిన అవసరముంది. అందుకు నిరూపమానమైన ఉదాహరణగా రొట్టెమాకు రేవు గ్రామం నిలిచిపోవాలన్నది యాకూబ్ ఆకాంక్ష. ఇందులో భాగంగా ఈ నెల 29 ఆదివారం నాడు రోజంతా జరిగే సాహిత్య కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కవుల్ని, రచయితల్ని యాకూబ్ ఆహ్వానిస్తున్నాడు. తన గ్రామానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాడు. ప్రత్యేకించి ఆదివాసీలు ఎక్కువగా నివసించే రొట్టెమాకు రేవు సందర్శనం తెలంగాణ పల్లె జీవితంలోని మరో పార్శ్వాన్ని తెలుసుకోడానికి ఉపకరిస్తుంది. అందుకని చక్కటి సృజనాత్మక అనుభవం కోసం 29న రొట్టెమాకు రేవులో జరిగే పురస్కారాల సంరంభంకు హాజరు కావడం మంచిది.
- కిరణ్‌కుమార్
29న అవార్డు ప్రదాన సభ
ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రొట్టమాకురేవులో జనవరి 29న జరిగే నుండి 'రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2016' ప్రదాన సభలో ప్రసాదమూర్తి (పూలండోరు పూలు), శ్రీరామోజు హరగోపాల్ (రెండు దోసిళ్ళ కాలం), సుజాతా పట్వారి (పిట్టకు ఆహ్వానం) లకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఇందులో గోరటి వెంకన్న ,పల్లా రాజేశ్వరరెడ్డి, ఎం.ఎల్.సి., వాడ్రేవు చినవీరభద్రుడు, పలమనేరు బాలాజీ, ప్రసేన్,సీతారాం, వంశీకష్ణ, మువ్వా శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు.