Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదైనా కవిత్వ పుస్తకం కొందామని కోఠివెళ్ళా. చేతిలో సరిగ్గా బస్సు చార్జీలకు సరిపోను వందంటే వందే ఉన్నాయి. ఏది కొందామా? అని ఒక్కొక్క పుస్తకాన్ని తిప్పేస్తుండగా అట్టచివర ఈ కవితా వాక్యాలు కనిపించాయి.
''ఈ పుస్తకం అల్మారాల్లో
దాచుకోవల్సిందేమీ కాదు
ప్రతి పేజీని ముక్కలుగా చింపి
ఒక మనిషినైనా చేయాల్సింది''
కవి ఎవరైతే నేం? కవిత మనసును హత్తుకుంది. చదివిన ఒకసారికే నాల్కపై నిలిచిపోయింది. ఇక వెనకాముందూ ఆలోచించకుండా పుస్తకం కొనేసి చదవడం మొదలు పెట్టా. నిజానికి ఈ సంపుటి అంతా చదివాక ఏ పేజినీ చింప బుద్ధి కాలేదు. అల్మరాల్లో జాగ్రత్తగా దాచుకోదగ్గ పుస్తకం. పదిమందికి చదివి వినిపించి మనిషితనాన్ని గుర్తుచేసే పుస్తకం. ఇంతకూ ఆ పుస్తకం పేరే చెప్పడం మర్చిపోయా కదూ! పేరు 'రెండో అధ్యాయానికి ముందుమాట'. కవి విరించి విరివింటి.
ఎంచుకున్న వస్తువు గురించి ఒకేసారి చెప్పకుండా, దానికి సంబంధించిన పదాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ, అన్వయ లోపం లేకుండా ప్రతీకలతో, పదబంధాలతో దృశ్య కవితగా మలచడం వీరి శైలి.
''నీ బాధ నా నుండి ప్రవహించాలని/ ఈ అక్షర గునపాలతో
నాలో నేనే ఒక వాగు తవ్వుకుంటాను''
పై వాక్యాలు 'ఎవరు కవి' కవితలోని ప్రారంభ వాక్యాలు. కవి తన గురించి తాను చెప్పుకుంటున్నట్లు పైకి కనిపించినా గునపాలు, తవ్వుకుంటున్నాను అనే పదాలు కష్టజీవిని ముందే పరిచయం చేస్తాయి. ఈ రెండు పదాలు శ్రమకు సంకేతం. ఎండా వానలనక బతుకును ఎల్లదీసే కష్టజీవి కన్నా ఏ కవీ గొప్పవాడు కాదన్న సత్యాన్ని అందంగా, ఆర్ద్రంగా ఇలా ముగిస్తాడు.
''కాళ్ళీడుస్తూ నీవు రాసే కవిత్వం ముందు
ఖాళీ కాగితాల మీద ఈ కవిత్వం ఎంతటిదని
ఓ కష్టజీవీ.../ నీవే అసలు సిసలు కవివి''
ఇక్కడ 'కాళ్ళీడుస్తూ' పదంలో శ్రమజీవుల చెమట వాసన, పూట గడపడానికి వారు పడే శ్రమంతా ఆ పదంలో ధ్వనిస్తుంది. కష్టజీవుల పట్ల గౌరవాన్ని కల్గించే గొప్ప కవిత.
పెళ్ళిలో అప్పగింతల సందర్భాన్ని తీసుకొని, నాన్న ఔన్నత్యాన్ని మహోన్నతంగా చూపిన కవిత 'అప్పగింతలు'. అల్లారుముద్దుగా పెంచిన తన కూతుర్ని ఒక అయ్యచేతిలో పెట్టేటపుడు నాన్న మానసిక స్థితిని, కుటుంబంలోని ఆత్మీయతలను పరిచయం చేస్తుంది. నాన్నను ఎండిపోయిన చెరువుగా, దీపస్తంభంగా చెబుతూ మొద్దుబారిన చేతులను కన్నీటితో కడగడం వంటి దృశ్యంతో బాధామయ వాతావరణంలోకి తీసుకువెళ్తాడు కవి.
''ఆడపిల్లకి పెళ్ళంటే
అప్పగింతలంటే ఏమోకాదు
మొదటిసారి నాన్న కళ్ళలో నీళ్ళు చూడడమే!''
ఇన్ని రోజులూ ప్రేమను దాచుకున్న నాన్న, గంభీరంగా కనిపించిన నాన్న, కూతురు అత్తారింటికి వెళ్తుందంటే ఏ నాన్నైనా భళ్ళున కురిసే వానౌతాడు.
విరించి గారు ప్రతి కవితలోనూ బలమైన కవిత్వం వినిపించారు. పర్సనిఫికేషన్ నిర్మాణంలో రాసిన 'చీకటివరం' కవిత వారిలోని ఊహాశక్తిని పరిచయం చేస్తుంది. చీకటి పడుతుండగా ఆకాశంలోకి నక్షత్రాలు వచ్చాయి అన్న విషయాన్ని ఇట్లా కవిత్వీకరించారు.
''పగలంతా ఎండలో దాగుడుమూతలాడి
అలసిపోయిన నక్షత్రాలపుడు
ముఖం కడుక్కోని
అలంకరించుకోవడం మొదలెడతాయి''
మానవ లక్షణాలైన అలసిపోవడం, ముఖం కడుక్కోవడం అనే లక్షణాలను నక్షత్రాలకు ఆపాదించి కవిత్వం చేశారు. బలమైన కవిత్వం వినిపించడానికి ఈ నిర్మాణం తోడ్పడింది.
తాజాగా, నూతన అభివ్యక్తితో కూడిన భావచిత్రాలు ఎన్నో ఉన్నాయి. సిద్దప్రతీకలు ఎక్కడా కనిపించవు. విరించి గారిలోని కవిని అర్థం చేసుకోవడానికి, వ్యక్తీకరణలో నవ్యత ఉందనడానికి ఈ కవితావాక్యాలు సాక్ష్యం.
1) ఈ రోజు మధ్యాహ్నం
ఆకాశాన్ని పిడకల మీద కాల్చినట్టుంది
2) లోవెలుగుల లోతు తెలియాలంటే
ఈ రెండు కళ్ళదివిటీలు ఏ మాత్రం సరిపోవు.
కవితా శీర్షికలు కూడా కొత్తగా కనిపిస్తాయి. సిరాపూత, వెలుగుముద్దలు, చీకటి వరం మొదలైన అచ్చమైన తెలుగుపదాలతో కొన్ని ఉంటే మరికొన్ని రెం (=జువీ), ప్రాస్టిట్యూట్, కామన్ మాన్... మొదలైన ఆంగ్లపదాలనూ శీర్షికలుగా ఉంచారు.
మనుషుల గురించి చెప్పాలంటే అక్షరాలను ఆశ్రయిస్తాం. మరి అక్షరాల గురించి చెప్పాలంటే వేటిని పోలికగా తీసుకోవాలి? కవి ఇక్కడ మనిషినే పోలికగా తీసుకొని 'అక్షరాలూ కవితలూ' కవితను నడిపిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
''మనుషుల్లానే అక్షరాలునూ/ గుంపులుగా ఒకచోట చేరాయంటే/
నిశ్శబ్దంగా ఉండనే ఉండవు''
ఇక్కడ ఒకేసారి మనుషుల, అక్షరాల స్వభావం తేటతెల్లమౌతుంది.
వీరి కవితలూ అంతే! ఒకసారి చదివితే కుదురుగ కూర్చోనివ్వవు. మనిషిలా మనతో సంభాషిస్తాయి. కరచాలనం చేస్తాయి.
మారుతున్న మనిషి తీరును చిత్రించిన కవిత 'మూగ జంతువు'. ఏదో మూగ జంతువు గూర్చి చెబుతున్నాడేమో అని భ్రమ పడతాం మొదట. సమాజంలోని మనుషులతో ఓడిపోయి, విషపూరిత మాటల మధ్య నలిగిపోయి మూగజీవులతో స్నేహం చేస్తాడు కవి.
''మాటల్లో మంటల్ని/ కరచాలనాల్లో కరవాలాల్ని
చిరునవ్వుల్లో విద్వేషాల్ని/ బహిరంగ రహస్యాల్లా దాచేస్తాము''
నోటితో నవ్వుతూ మాట్లాడుతున్నా నొసటితో వెక్కిరించే మనుషులు లేకపోలేదు. పైకి అనురాగం చూపిస్తున్నట్టుగా కనిపించినా లోలోన ఎన్నో పగల సెగలు మండుతూనే ఉంటాయి. అందుకే కవి ఓ మాటంటాడు.
''మన మధ్య మాటలెందుకో
మనల్ని కలపాలని ఎపుడూ అనుకోవు''
అంటూ దగ్గరగా ఉన్న మనుషుల మధ్య దూరం ఎందుకు ఏర్పడుతుందో ప్రశ్నిస్తారు. ఎవరు గొప్ప వారు చెప్పుకోవడంలోనే మొత్తం సమయం గడిచిపోతుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుందామంటే అహం అడ్డొస్తుంది. మనుషుల మధ్య విద్వేషాలు రాజ్యమేలుతున్నప్పుడు మూగజీవులను ఆశ్రయించడమే మంచిదని భావిస్తాడు.
విరించి గారి కవితల్లో ఎంతో ప్రత్యేకమైనది 'ఈక్వాలిటీ కండెమ్డ్' (జునబaశ్రీఱ్y షశీఅసవఎఅవస). విరించి అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చే కవిత ఇది. స్త్రీ గొంతుకను బలంగా వినిపించే కవిత ఇది. కవిత మొత్తం ఉదహరించినా తప్పులేదనుకుంటా. నేడు ప్రతీరంగంలో మగువలు మగవారితో సమానంగా పోటీపడుతున్నారు. అబలగా ముద్రపడిన స్త్రీలు బస్సు, విమానాలు నడుపుతున్నారు. శిఖరాలు అధిరోహిస్తున్నారు. కాబట్టి మనం ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అంటాం. కానీ స్త్రీ పురుషుని కంటే సమానం కాదంటాడు కవి. ప్రతీదాంట్లో పురుషునికంటే ఎక్కువే అంటాడు.
''వాళ్ళంటారు/ బస్సులు విమానాలు నడుపుతున్నందుకు
నేను వాళ్ళతో సమానమని/ కానీ వాళ్ళకు తెలియదు
డ్యూటీలో చంటిపిల్లలు గుర్తొచ్చినపుడల్లా
స్తనాలు రెండూ బరువెక్కుతాయని''
ఇలా ఒక్కొక్క స్టాంజాలో ఆమె అతడితో ఎందుకు సమానం అవుతుందో చెబుతాడు.
చదువుల్లో ర్యాంకులు సాధిస్తున్నందుకు, యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నందుకు, ఉద్యోగాల్లో క్రీడల్లో ముందున్నందుకు సమానమని అంటాం. కానీ వాళ్ళు ఆయా పనులు చేస్తున్నప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులు మీకెవరికీ తెలియదంటుంది. ఈ కవితలో ప్రత్యేక కవితాశిల్పం కనిపిస్తుంది.
''వాళ్ళంటారు/ నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు''
అనే పంక్తులు పలుమార్లు పునరుక్తిగా వాడడం వలన కవితకు మరింత బలం, సొగసు చేకూరింది. ఒక ప్రవాహంలా సాగిపోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ముందు ముందు ఏం చెబుతాడో అనే ఆసక్తి కూడా ఏర్పడుతుంది.
ఇక చివరలో సాధారణ పడతిగా కనిపించిన స్త్రీ, ఆదిపరాశక్తిగా రూపం దాల్చినట్లుగా రౌద్రంగా ఇలా గర్జిస్తుంది.
''స్త్రీత్వం నా ఒంటినిండా పులుముకున్నప్పుడు
ఆ గర్వం మనసునిండా పొంగుతున్నప్పుడు
తల పైకెత్తి, నీ గల్లా పట్టుకుని అడగాలని వుంటుంది
నేను నీతో ఎట్టా సమానంరా....!!!'' అని.
విరించిగారు వృత్తిరీత్యా డాక్టర్ అని ముందుమాటలో చదివా. కాబట్టి వైద్యరంగంలోకి భాషాపదాలు ఈ కవితలో ఔచిత్యంగా వాడారు. రక్తస్రావం, ప్రిమోల్టన్ మాత్రలు, ఓసీ పిల్స్ పదాలు అందుకు ఉదాహరణ. స్త్రీవాదాన్ని ప్రతిఫలించే మరిన్ని 'పదసోదరీ', 'ప్రియసఖీ', కవితలను చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో కవితల గురించి చెప్పుకోవచ్చు.
మొత్తం 53 కవితల్లో దేనికదే విభిన్నమైనది. ఈ పుస్తకానికి సవివరంగా, విశ్లేషణాత్మకంగా దర్భశయనం శ్రీనివాసాచార్య ఏకంగా ఐదు పేజీల ముందుమాట రాశారు. విరించి కవిత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ ముందుమాట ఎంతో తోడ్పడుతుంది.
చివరగా ప్రధాన శీర్షికగా ఉన్న 'రెండో అధ్యాయానికి ముందుమాట' కవిత గురించి రెండు మాటలు చెప్పి ఆపేస్తా. ఈ వాక్యాలు చెప్పకపోతే అసంపూర్ణ వ్యాసంలాగే తోస్తుంది నాకు.
కవికి, పాఠకునికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ బంధం ప్రతీ రచనలో ఉండక పోవచ్చు. ఒక్కోసారి పాఠకుడు కవితో ఏకీభవించకపోవచ్చు.
ఇంకా వారిమధ్య సంబంధం ఎలా ఉంటుందో మీరే చూడండి.
''తరువాత వొచ్చే అధ్యాయాల్లో
మనిద్దరికీ ఒక యుద్ధమే జరగొచ్చు
చెమటతో నేను కట్టిన ఈ పదాలు
నీకు ముచ్చెమటలు పట్టీయొచ్చు''
ఇలా పాఠకుడికీ, కవికీ ఏకాభిప్రాయం కుదరకపోయినా కవిగారు సహృదయతతో ఇలా ముగిస్తారు.
''నీవు నన్ను ఎలా అర్ధం చేసుకున్నా నేను మాత్రం నిన్ను
నా ప్రియ పాఠకుడా అనే/ సంబోధించాల్సి వుంటుంది''
విరించి గారు సమాజం వణికిపోతుంటే స్పందించి, కాలిపోతూ కవిత్వం రాసే కవి.
మనిషి జాడ కనుమరుగు కావొద్దని కాంక్షించే కవి. మనం కూడా వారిని 'నా ప్రియకవీ' అని ఆత్మీయంగా కౌగిలించుకుందాం. వారి అక్షరాన్ని ప్రేమిద్దాం.
- తగుళ్ళ గోపాల్
రచయిత సెల్ : 9505056316