Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో స్మృతిసంచికలు, సంకలనాలు ఉన్నాయిగాని సంపుటాలు తక్కువే. శిఖామణి రచన ''స్మరణిక'' కొంత అకడమిక్ దృష్టికి, అనుభవ పారవశ్యానికి మధ్య ఆత్మీయతను ధ్వనిస్తుంది. కొన్ని మరణాల తరువాత ఒక నిశ్చేష్ట, ఒక నిరామయ వైరాగ్యం ఈ వ్యాసాల రూపంలో స్పందనలను రాయించిందని చదవగానే అర్థం అవుతుంది. సుమారు ముప్పై నాలుగు స్పందనాగతమైన వ్యాసాల్లో ముప్ఫైమంది కవులు, విమర్శకులు, దార్శనికులు, ఆత్మీయులను స్మరించుకున్న వ్యాసాలివి.
''మో'' గురించి రెండు, బోయి భీమన్న గురించి మూడు, తెరేశ్‌బాబు గురించిన రెండు వ్యాసాలతో బాటు సావిత్రి, మద్దూరి నగేశ్ బాబు, మల్లవరపు జాన్, భార్గవీరావు, స్మైల్, జ్ఞానానందకవి, వెంకట నరసమ్మ, జాషువా, కలేకూరి ప్రసాద్, కాశీ, ఇస్మాయిల్, జాన్ హైడ్ కనుమూరి వంటి కవులను గూర్చి కొన్ని వ్యాసాలున్నాయి. ఈ మార్గంలోనే జి.వి.సుబ్రహ్మణ్యం, వడలిమందేశ్వరరావు, చేరా, యు.వి.నరసింహమూర్తి వంటి విమర్శకులతో పాటు శాంతయ్య, హేమలతా లవణం, బాలయోగి మొదలైన దార్శనికుల గురించి, ఆత్మీయులైన బుల్లబ్బాయి, కన్నమరాజు, తనకు గురువైన శ్రీ మొలగజ్జెల గంగిశెట్టి గారి గురించిన వ్యాసాలున్నాయి.
సాహిత్య విమర్శకులుగా, దళిత సాహిత్య విమర్శకులుగా గతంలో విశ్లేషణలు చేసిన అనుభవ ముద్ర ఈ సంపుటిపై కనిపిస్తుంది. రూపంలో ఈ వ్యాసాలు అకడమిక్ వాసన నుంచి తప్పుకుని, ఆత్మీయతతో కూడిన సంభాషణా రూపాన్ని సంతరించుకున్నాయి. కొన్ని వాక్యాలు కవితాత్మకంగా కనిపించడంలో ఈ ఆత్మీయతే కారణం.
''వెళుతూ వెళుతూ పాతికేళ్ళుగా గూడుకట్టుకుంటూ వస్తున్న జ్ఞాపకాల తేనె పట్టుమీద తన మరణం రాయిని విసిరి మరీ వెళ్ళిపోయాడు. - (56.పే.)
''కలం పట్టిన దాదిగా చుట్టూ ఎంతమంది లేకపోతే ఒక కవీ కళాకారుడూ రచయితా వున్నాడు'' - (58.పే.).
''అడుగడుగునా దారి దీపమై నిలిచారు చేరా. ఆ వెలుగులోనే ఈ ప్రయాణం'' - (63.పే.).
''కుంభ వృష్టి కురిసిన రాత్రి అతితక్కువ మందితో కాశీగారి అంతిమయాత్ర సాగిందనీ/ కన్నీళ్లను కవిత్వంగా మలచుకుని పూడుకు పోయిన గొంతుకతో కవితాంజలి ఘటించడానికి వచ్చిన స్మైల్ గార్ని శవం లేచిన శూన్య గృహం మరింత బాధించిందని'' (70.పే))
''ఇస్మాయిల్ గారి జ్ఞాపకం అప్పుడే స్నానం చేయించిన పసిపిల్లాడి ప్రాకృతిక పరిమళం'' (91.పే.))
శిఖామణి సహజంగానే అనుభూతి, అనుభవం, ఆత్మీయతను ఊపిరిగా చేసుకున్న హృదయవాది. ఇలాంటి వాక్యాలు కవితాత్మకం కావడంలో ఆశ్చర్యంలేదు. వ్యాసాల్లో ఆంతరిక సంభాషణలు, అంతరంగం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సంజీవరావు ''శిఖామణి''గా మారటం రచయిత నిజాయితీని, నిబద్ధతను, అన్నిటికీ మించి ఆత్మీయతను నిలబెడతాయి. చాలా వాక్యాలు చదువుతున్నప్పుడు రవీంద్రుని కవితలు ''స్మరణ-నైవేద్యం'' గుర్తుకొస్తాయి.
- ఎం.నారాయణ శర్మ, 9848348502