Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవ్వ... అమ్మ... ఎట్ల పిలిసినా అంతే ప్రేమగా పలుకుతుంది అమ్మ.
హైదరవాద్, ఐదరవాద్, హైదరాబాద్, పట్నం ఏమన్నా... గుండెల్లో దాచుకుంటుంది.
ఐదరవాద్ అని పలుకుతున్నంతలో అనేక జ్ఞాపకాలు, అనుభూతులు గుండె నుండి చేసే తీయటి గాయం లాంటిది హైదరాబాద్.
లక్ష్మణ్ రావు పతంగే గారి 'హైదరాబాద్ నుండి తెలంగాణదాక' అనే పుస్తకం ఇది.
ఆరు బయట చల్లని గాలి నుండి చుక్కలదాంక....
సుగంధ వీచికల నుండి మల్లెలవాన దాంక...
జ్ఞాపకాల నుండి తీయటి గాయాలదాంక... హైదరాబాద్ నుండి తెలంగాణ దాక...
లక్ష్మణ్ రావు పతంగే ఈ పుస్తకంలో పొందుపరిచిన సంఘటనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతని జ్ఞాపకాలు అనే కంటే హైదరాబాద్‌లో ఆనాటి జీవనవిధానం, సాంఘిక, రాజకీయ పరిస్థితులు, పంటలు, విద్యా విధానం, మనుషుల ప్రేమలు, ఆహారపు అలవాట్లు వీటిన్నిటినీ కూడా చెప్పారు. కానీ ఏ మాత్రం విసుగు పుట్టకుండా పుస్తకం తెరిచిన దగ్గరినుండీ ఏకబిగిన చదివించే కథనం వీరి ప్రత్యేకత. సదాశివ్ పేట్ దగ్గరి (మోమిన్ పేట్) మోమిన్ ఊర్లె ముదలైన ఈ పిలగాడి ప్రయాణం నేటి తెలంగాణ సాధించినంత వరకూ సాగిన జీవితం. మోమిన్ నుండి హైదరాబాద్‌తో ఎట్ల ముడివడినదో చెప్పుకుంట వచ్చాడు. 288 కమ్మలున్న పుస్తకం ఇది. ప్రతి హైదరాబాదీకి తెలియాల్సిన అవసరం వుంది.
చిన్నప్పుడు మా నాన్న కాలుమీద కాలు వేసుకుంటే, ఆ కాలుపై ఎక్కి గుర్రం ఆట ఆడుకుంట నాన్న చెప్పే కథలు వింటుండేది. అప్పటి రోజులకు తీస్కపోయిన పుస్తకం ఇది. నాన్న కథలలోకి నేను ప్రవేశించి వాటన్నిటినీ దగ్గరనుండి చూస్తున్న అనుభూతినిచ్చింది.
ఆనాటి (పోలీస్ యాక్షన్‌లో) రజాకార్ మూవ్‌మెంట్ అప్పుడు ప్రజలు పల్లెల్లో ఏవిధంగా గస్తీ తిరుగుతూ తమ గ్రామాలకు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తూ, తనవారిని ఏవిధంగా కాపాడుకొనేవారో చెబుతున్నప్పుడు ఆ గ్రామ ప్రజల పోరాట ధైర్యం, స్త్రీలు నీళ్లు తెచ్చుకోవడానికి కూడా కాపలా ఉండడం, ఇవన్నీ చదివేప్పుడు బి.నర్సింగరావు గారి 'మా భూమి' సినిమా కళ్ళముందు రీలు తిరిగినట్లయితది. ఆనాటి గుంట ఓనమాలు అంటే మట్టికుప్పలుచేసి, వాటిమీద చూపుడు వేలుతో ఓనమాలు దిద్దుడు, చిన్న సీసాలలో గాంచు నూనె దీపాల నుండి మొదలు అయింది. మోటబాయిల కైంచుడీ మార్నా ఈ జ్ఞాపకాలలో తడిపి ముద్ద చేస్తాడు. చేని ఒరాల పైన పండించిన (చేనుగట్టు) కూరగాయలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే, పెనం లాంటి కంచుబిళ్ళ మీద గంటలు కొడితే లెక్క గట్టి సమయాన్ని తెలుసుకొనే హత్యలు, అత్యాచారాలు, దోపిడిలులేని, ఆ కాలంనాటి పని, పాటలు, పిల్లల ఆటలు ఎట్ల వుండేనో అక్కడి కథలతో ముడివేయడం, మిణుగురులతో పరుగులు, ఆ ఆటల ముందు నేటి మొబైల్ గేమ్స్ ఎందుకు పనికొస్తయి. కలికుండలు, మొర్రిపండ్లు, పావురాల కాళ్ళకు గజ్జెలు కట్టడం, సిత్తలపండ్లనే రెండు నెలలు ఆహారంగ గడిపిన పేద ప్రజలు, పుంటి జనుము, పశుల పెంటనే ఎరువుగా చేసిన తీరు చిన్ననాటి రోజులలో మమేకం చేసాడు రచయిత. పెద్ద అనంతగిరి పద్మనాభుడి గుడి కాడి గుండం నుండి పుట్టినదే 'ముచుకుందా' నది. అది ప్రవహిస్తూ హైదరాబాద్ దాక వచ్చి, ఇక్కడ ఈసీ మూసీగా విడివడి, ఈసీ చుట్టూ దిరిగి మల్ల మూసీల కలిసింది. అరబ్బీలో 'మూసీకీ' అంటే సంగీతం. గోలకొండ వరకి తరంగాల ధ్వని సంగీతంలా వినబడేది అంట. ఆ మూసీకీ 'మూసీ'గా మారిందంట. ముచుకుందా నదితో పాటుగా హైదరాబాద్ చేరిన రచయిత మనలను తన వెంట తీస్కపోతడు. 17-9-1948 నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించింది. 1952 వరకూ జె.ఎన్.చౌదరి మిలటరీ పాలన, 52లో మొదటిసారిగా భారత్‌లో ఎన్నికలు జరిగాయి. 1952 బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి. వీరి పరిపాలన 1-11-56 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యే వరకూ సాగింది. 1953 - 56 మధ్య కాలంలో మనకు 2 రాష్ట్రాలున్నాయి. అంటే ఆంధ్రరాష్ట్రం కంటే ముందే హైదరాబాద్ వుంది అంటారు. 1874లో బ్రిటీష్ వారి కాలంలో రైలు ప్రారంభమైంది. 1929లో ఉస్మానలీఖాన్‌కి సొంత రైలుండేది. అంటే హైదరాబాద్ ఆనాడే అభివృద్ధి చెందినది అనేది అర్థమవుతుంది. హైదరాబాద్‌కు చారు అలవాటు చేసిన విధానం గమ్మత్తుగా ఉంటుంది. రచయిత అమ్మ చిన్నప్పుడు చారు లేదు. బ్రిటిష్ వారు తెల్లవారంగ వచ్చి పెద్ద వాడల్లో ఉచితంగా అలవాటు చేసేవారంట. 'గధేకీ బిర్యానీ ధోబీకి పరెషాని' మదీనా బిర్యానీకి పోటీగా జనాలతో గాడిద బిర్యానీ తినిపించి పారిపోయిన ఉత్తరాది వాని కథ చదవాల్సిందే. గోల్లకొండుగోలకొండగా మారిన వైనం, అట్లగే అబ్దుల్లా కుతుబ్ షా తారామతి (సంగీత విదుషీమణి), ప్రేమామతి (నాట్యకారిణి) వీరి పేరిట రెండు గ్రామాలే వెలిసాయి. అలాగే ప్రత్యేక శిల్పకళతో రెండు భవనాలను కూడా కట్టించాడు. మొహ్మద్ కులీకుతుబ్ షా మంచి కవి. తన ప్రేయసి గురించి చెబుతూ...
''హజారో మన్నత్ కర్తాతో తుక్ హస్ బోల్తీ నహీదీ. సో ఆజ్ ఉతర్ ఆయిహై బాతో మేకి మైమద్ పిలాయాహూ...'' వేయి సార్లు మాట్లాడమని వేడుకున్నాడు, ఆమె నవ్వుతూ ఒక్క మాటా పలికేది కాదు. ఈరోజు ఆమె చేత కొంచెం మద్యం తాగించాను. ఆమె నోటి నుండి మాటలు జాలువారుతూనే ఉన్నాయి.... అంటాడు.
400 వందల సంవత్సరాల హైదరాబాద్‌ను కళ్ళ ముందుంచిన తీరుకు నిజంగా ఫిదా అవ్వాల్సి వుంది. నిజాం నుండి ఇప్పటి వరకు... ఈ పుస్తకాన్ని సమీక్ష చెయ్యాలంటే ఇంకొక పుస్తకమే రాయాలి.
ప్రతి హైదరాబాదీ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. పరిశోధన చేసే వారికి గని లాంటిది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1912లో మొదలు పెట్టి 1919లో పూర్తి అయిన హైకోర్టు... ఇది స్వతంత్ర హైదరాబాద్‌ను చూసింది. ఆంధ్రప్రదేశ్ పాలనను చూసింది. ఇప్పటి తెలంగాణ రాష్ట్రం పరిపాలనను చూస్తుంది. పూర్తిగా చదివినంక పుస్తకం వెంట తీసుకొని అన్నీ చారిత్రక పేర్లున్న స్థలాలను, ఖిల్లాలను, చూసి చివరగా గోలకొండ చూసి అక్కడున్న స్నానాల కొలను దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని ఆ గోడలు చెప్పే కథలను, ప్రేమ గాథలను వినాలని వుంది. అక్కడి ధూళిలో కలిసి పాదముద్రల సవ్వడి ఆస్వాదించాలని వుంది.
- సిహెచ్.ఉషారాణి,
9441228142