Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వైతాళికుడు, ప్రజా రచయిత, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, సకల ఉద్యమాల్లో క్రియాశీలక భాగస్వామిగా నిలచి సాహిత్యప్రపంచానికి ఆదర్శమూర్తిగా ప్రసిద్ధి చెందిన వట్టికోట ఆళ్వారుస్వామి శతజయంతి సంవత్సరమిది. తెలంగాణ తొలి తెలుగు నవలాకారునిగా ప్రసిద్ధి చెందిన వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక రచనల పోటీని నిర్వహించాలని 'నవతెలంగాణ' సంకల్పించింది. తన రచనల ద్వారా, ఉద్యమాచరణ ద్వారా సాహిత్యకారులు ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేసిన ఆళ్వారుస్వామికి ఈ రూపంలో ప్రకటిస్తున్న నివాళి ఇది.
సకల తెలుగు ప్రాంతాల్లోని కవుల్నీ, రచయితల్నీ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నవల, కథ, కవిత ప్రక్రియల్లో ఈ పోటీల్ని నిర్వహిస్తున్నాం.
నవలల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 25,000
ద్వితీయ బహుమతి: రూ. 15,000
తృతీయ బహుమతి: రూ. 10,000
కథల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 10,000
ద్వితీయ బహుమతి: రూ. 8,000
తృతీయ బహుమతి: రూ. 5,000
పది కథలకు ప్రత్యేక బహుమతులు: ఒక్కొక్క కథకి రూ. 1,000
కవితల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 3,000
ద్వితీయ బహుమతి: రూ. 2,000
తృతీయ బహుమతి: రూ. 1,000
పది కవితలకు ప్రత్యేక బహుమతులు: ఒక్కొక్క కవితకి రూ. 500
రచనలు ఎలా ఉండాలంటే...
- సమకాలీన సామాజిక జీవితాన్ని ప్రతిబింబించాలి.
- ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రకంపనలకు లోనవుతున్న బతుకుతీరును, దైనందిన జీవితంలోని సంక్లిష్టతల్ని, సంక్షోభాల్ని అభివ్యక్తం చేయాలి.
- చరిత్ర, పోరాటాల నేపథ్యాన్ని వస్తువుగా తీసుకున్నప్పటికీ వాస్తవాల ప్రాతిపదికగా చారిత్రక సంఘటనల్ని కళాత్మకంగా సృజించాలి.
- అణచివేతకు గురయ్యే వర్గాల గురించి ఆలోచింపజేసే ఆర్ద్రమైన ఇతివృత్తాలై ఉండాలి.
- వస్తువుతో పాటు శైలీశిల్పాలు సమగ్రంగా, పరిపూర్ణంగా ఉండాలి. ఇతివృత్తం ఎంత ముఖ్యమో, దానికి కళారూపం ఇవ్వడంలో సౌందర్యం అంతే ప్రధానమని రచయితలు, కవులు గుర్తించాలి.
నిబంధనలు- సూచనలు
- కవితలకీ, కథలకీ పేజీల కొలమానం లేదు. రచన సమగ్రంగా ఉండడమే ముఖ్యం. ఎన్ని లైన్లు, ఎన్ని పేజీలు ఉండాలన్నది ఇతివృత్తాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
- నవలలు మాత్రం 150 నుంచి 250 పేజీల (ప్రచురణలో 1/8 పుస్తకం సైజు) మధ్యలో ఉండాలి.
- రచనలపై రచయిత పేరు, చిరునామా రాయకూడదు. హామీపత్రం పేజీలో రాయాలి.
- ఒక రచన ఇదివరలో ఎక్కడా ప్రసారం కాలేదని, ప్రచురితం కాలేదని, ఏ వెబ్‌సైట్‌లోనూ, బ్లాగులోనూ, ఫేస్‌బుక్‌లోనూ ఉపయోగించలేదన్న హామీ పత్రం జత చేయాలి.
- రచనలు తిప్పి పంపడం కుదరదు. కనుక ఒక జిరాక్స్‌్ కాపీని రచయితలు తమ దగ్గర ఉంచుకోవాలి.
- పోటీలో బహుమతి గెలుచుకున్న, సాధారణ ప్రచురణకు ఎంపికయిన కవితల్ని, కథల్ని నవతెలంగాణ ఆదివారం సంచిక 'సోపతి'లో ప్రచురిస్తాం. తర్వాత వీటిని పుస్తకాలుగా, సంకలనాలుగా వెలువరించడం జరుగుతుంది.
- నవలల పోటీలో బహుమతి గెలుచుకునే నవలల్ని 'నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్' పుస్తకాల రూపంలో వెలువరిస్తుంది. బహుమతి కోసం ఎంపికయ్యే మూడు నవలలే గాక ప్రచురణకు అర్హమనిపించే రచనల్ని ఈ ప్రచురణ సంస్థ పుస్తకరూపంలో వెలువరిస్తుంది. దీనికి అంగీకరించేవారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలి.
- రచనల ఎంపిక విషయంలో తుదినిర్ణయం నవతెలంగాణ సంపాదకవర్గానిదే. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఫోన్లలో సంప్రదింపులకు తావులేదు.
- కవరు మీద 'వట్టికోట ఆళ్వారుస్వామి రచనల పోటీకి' అని తప్పనిసరిగా రాయాలి.
కథలు, కవితలు చేరవలసిన ఆఖరు తేదీ:
30 సెప్టెంబర్ 2015
నవలలు చేరవలసిన ఆఖరు తేదీ:
15 అక్టోబర్ 2015