అంతర్జాతీయం
హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా అమెరికా చట్టం
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఉద్యమ కారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీనిపై చైనా తీవ్రంగా మండి పడింది. దీనికి ప్రతిగా గట్టి చర్యలు ఉంటాయని హెచ్చరించింది. హాంకాంగ్‌కు ప్రస్తుతం ప్రత్యేక 'అమెరికా వాణిజ్య పరిశీలన' హోదా ఉంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతోంది. ఈ హోదాను కాపాడుకోవాలంటే హాంకాంగ్‌కు సరిపడిన స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఏటా ధ్రువీకరించాల్సి ఉంటుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన చైనా, హాంకాంగ్ అధికారులపై ఆంక్షలకూ ఇది వీలు కల్పిస్తుంది.
పాక్ సైన్యాధిపతి పదవీ కాలం పొడిగింపు
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పెంచుతూ 2019 నవంబర్ 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదవీ కాలం పొడిగింపు, పునర్నియామకంపై పార్లమెంటు చట్టం చేయాల్సి ఉందంటూ షరతు విధించింది. దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు జనరల్ బజ్వా అత్యంత సన్నిహితుడు.
జపాన్ మాజీ ప్రధాని నకసోనే కన్నుమూత
జపాన్ మాజీ ప్రధాని యశుహిరో నకసోనే 2019 నవంబర్ 29న మృతి చెందారు. ఆయన వయసు 101 ఏళ్లు. 1982 నుంచి 1987 మధ్య ప్రధానిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమితో కుదేలైన జపాన్‌ను తిరిగి గాడిన పెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఆ యుద్ధంలో అమెరికా చేతిలోనే జపాన్ ఓడిపోయినప్పటికీ, విమర్శలు ఎదురై నప్పటికీ తిరిగి ఆ దేశంతోనే సంబంధాలు బలోపేతమ య్యేందుకు చొరవ తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ ఉన్నప్పుడు ఆ దేశానికి రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించారు. రీగన్ ఆర్థిక సిద్ధాంతాల ప్రభావంతో దేశంలోని రైల్వే, టెలికాం రంగాలను ప్రైవేటీకరించారు.
చిట్టచివరి సుమత్రన్ ఖడ్గమగం మృత్యువాత
మలేసియాలోని సుమత్రన్ ఖడ్గమగం జాతి అంతరించి పోయింది. బోర్నియో ద్వీపం లోని సబాహ్ రాష్ట్రంలో ఉన్న చిట్టచివరి ఖడ్గమగం 'ఇమాన్' క్యాన్సర్‌తో బాధ పడుతూ మరణించినట్లు అధికారులు 2019 నవంబర్ 24న వెల్లడించారు. 25ఏళ్ల వయసున్న ఈ ప్రాణి మూత్రాశయ ప్రాంతంలో క్యాన్సర్ కణతులు పెరిగిపోవడంతో మరణిం చిందని వివరించారు.
దౌత్య కార్యాలయాల్లో అమెరికాను మించిన చైనా
ప్రపంచ వ్యాప్తంగా దౌత్య కార్యాలయాల ఏర్పాటులో అమెరికాను చైనా మించిపోయింది. సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనం ప్రకారం 2019లో చైనాకు 276 దౌత్య కార్యాలయాలు ఉండగా, అమెరికాకు మూడు తక్కువగా 273 ఉన్నాయి. చైనాకు 169 రాయబార కార్యాలయాలు, 96 కాన్సులేట్ కార్యాలయాలు, ఎనిమిది శాశ్వత దౌత్య కార్యాలయాలు, మూడు ఇతర దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. 2016లో అమెరికా, ఫ్రాన్స్ తరువాత చైనా మూడో స్థానంలో ఉండేది. ప్రస్తుతం భారత్ 12వ స్థానంలో ఉంది. మనకు 123 రాయబార కార్యాలయాలు, 54 కాన్సులేట్ కార్యాలయాలు, అయిదు శాశ్వత దౌత్య కార్యాలయాలు, నాలుగు ఇతర కార్యాలయాలు ఉన్నాయి.
జాతీయం
ఆర్థిక సంఘం గడువు ఏడాది పెంపు
కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని ఏడాది పాటు పెంచుతూ కేంద్ర కేబినెట్ 2019 నవంబర్ 27న నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. దీని ప్రకారం ఈ సంఘం 2020 అక్టోబరు 30న నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు నిధుల పంపిణీ, తదితర విషయాలను పరిశీలించి సూచనలు చేయాల్సి ఉంటుంది. తొలుత నిర్దేశించిన ప్రకారమయితే ఈ సంఘం 2020-21 నుంచి 2024-25 వరకు ఆర్థిక అంశాలను పరిశీలించి 2019 అక్టోబర్ 30న నివేదిక సమర్పించాల్సి ఉంది. తరువాత గడువును నవంబర్ 30వరకు పెంచారు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా సంఘం సభ్యులు రాష్ట్రాల పర్యటనను పూర్తి చేయలేకపోవడం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతా లుగా విభజించిన తరువాత నిధుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు తగిన మార్గదర్శకాలను ఇవ్వకపోవడంతో గడువు పెంపు అనివార్యమయింది.
లోక్‌పాల్ లోగో, నినాదం ఖరారు
లోక్‌పాల్‌కు లోగో, నినాదాన్ని 2019 నవంబర్ 26న ఖరారు చేశారు. ప్రజల నుంచి లోగో డిజైన్లను ఆహ్వా నించగా అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్ మిశ్ర రూపొందిం చిన లోగోను ఎంపిక చేశారు. నినాదం కోసం వచ్చిన ఎంట్రీల్లో ఏవీ అర్హమైనవిగా లేకపోవడంతో లోక్‌పాల్ పూర్తి ధర్మాసనం సొంతంగా ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని నినాదంగా ఎంపిక చేసింది. 'పరుల సొమ్ము ఆశించరాదు' అన్నది ఈ శ్లోకం సారాంశం.
మారిన రాజ్యసభ మార్షల్స్ దుస్తులు
రాజ్యసభ మార్షల్స్ యూనిఫాంలు మారాయి. సైనిక యూనిఫాం తరహా దుస్తులకు బదులు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో వారు 2019 నవంబర్ 25న విధులకు హాజరయ్యారు. తలపాగా మాత్రం లేదు. రాజ్యసభ చైర్మన్ కుర్చీకి రెండువైపులా నిలుచునే మార్షల్స్ ఇద్దరూ ముదురు రంగు 'బంద్‌గలా' యూనిఫాం ధరించారు. ప్రతి వరసలోనూ వెనక నిలబడి సభ్యులకు అవసరమైన పత్రాలు, ఇతరత్రా సాయం అందించే 'ఉషర్స్' యూనిఫాంలు మాత్రం మారలేదు.
రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం
దాద్రా-నాగర్ హవేలీ, డామన్ డయ్యూదీవ్ కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదిం చింది. ఇకపై ఈ రెండింటినీ కలిపి ''దాద్రా-నాగర్ హవేలీ- డామన్ డయ్యూదీవ్'' కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చేదీ తర్వాత ప్రకటిస్తారు.
ఫాస్టాగ్ కార్డులు ఉచితం
అన్ని జాతీయ రహదారుల వద్ద టోల్‌ట్యాక్స్ వసూలు కోసం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ కార్డులను ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జాతీయ రహదారుల్లో టోల్‌ప్లాజాల వద్ద డిసెంబరు 15 నుంచి టోల్‌ట్యాక్స్‌ను ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) విధానంలో వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఫాస్టాగ్ కార్డు విలువ రూ.100గా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 15 తేదీలోగా ఆ కార్డు తీసుకునే వారి నుంచి ఆ రూ.100 వసూలు చేయవద్దని చెప్పింది. సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా మినహాయిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని ఆయా బ్యాంకుల విచక్షణకు వదిలేసినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
చిట్ ఫండ్స్ సవరణ బిల్లుకు ఆమోదం
చిట్‌ఫండ్స్ సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ 2019 నవంబర్ 20న, రాజ్యసభ 28న ఆమోదించింది. దీని ప్రకారం ఖాతాదార్లు బకాయి పడితే అంతవరకు జమయిన మొత్తం నుంచి స్వాధీనం చేసుకొనే అధికారం యజమానికి ఉంది. చిట్‌ఫండ్‌లకు మరింత గౌరవం కల్పించడం కోసం 'సౌభ్రాతత్వ నిధి' (ఫ్రెటర్నిటీ ఫండ్) 'చక్రీయ పొదుపు' (రొటేటింగ్ సేవింగ్స్), 'రుణ సంస్థ' (క్రెడిట్ ఇన్‌స్టిట్యూట్) అన్న పదాలు చేర్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 'చిట్ మొత్తం' (చిట్ ఎమౌంట్), 'డివిడెండ్', 'ప్రైజ్ అమౌంట్', 'స్థూల చిట్ మొత్తం' (గ్రాస్ చిట్ ఎమౌంట్), 'నికర చిట్ మొత్తం' (నెట్ చిట్ ఎమౌంట్), 'రాయితీలో వాటా (షేర్ ఆఫ్ డిస్కౌంట్)' తదితర పదాల బదులు కొత్త పదాలను చేర్చామని తెలిపారు. చిట్ పాడే వారికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా కలిగించనున్నట్టు చెప్పారు.
లోక్‌సభలో పారిశ్రామిక సంబంధాల బిల్లు
విపక్షాల తీవ్ర నిరసనల నడుమ కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వార్ 2019 నవంబర్ 28న లోక్‌సభలో పారిశ్రామిక సంబంధాల స్మతి-2019 బిల్లును ప్రవేశపెట్టారు.
రూ.22,800 కోట్లతో అధునాతన ఆయుధ వ్యవస్థలు
భారత సైనిక సామర్థ్యాన్ని పరిపుష్టం చేస్తూ రూ.22,800 కోట్లతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో జలాంతర్గాములను వేటాడే విమానాలు, గగనతలంలో శత్రువుల కదలికలను పసిగట్టే వ్యవస్థలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన 2019 నవంబర్ 28న ఢిల్లీలో సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది.
పెన్‌డ్రైవ్‌లోని అంశాలు డాక్యుమెంటే : సుప్రీం
సెల్‌ఫోన్ మెమొరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌ల్లోని సమాచారం ఎలక్ట్రానిక్ రికార్డు అని, అందుకే దానిని 'భారత సాక్ష్యాధారాల చట్టం' కింద ప్రామాణిక డాక్యుమెంటుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్ 29న స్పష్టం చేసింది. మలయాళం నటుడు దిలీప్‌పై ఓ నటి దాఖలు చేసిన అపహరణ, దాడికి సంబంధించిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ ఖాన్‌విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది. దిలీప్ అభ్యర్థన మేరకు మెమొరీ కార్డు ప్రతిని ఆయన పరిశీలనార్థం అందచేయాలంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ఖాన్ మార్కెట్‌కు 20వ స్థానం
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ 20వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ 'కుష్‌మ్యాన్ అండ్ వేక్‌ఫీల్డ్' 'మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2019' పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఖాన్ మార్కెట్‌లో చదరపు అడుగుకు వార్షిక అద్దె 243 డాలర్లు(రూ.17,253)గా ఉందని నివేదిక తెలిపింది. 2018లో ఇక్కడ చదరపు అడుగుకు వార్షిక అద్దె 237 డాలర్లు (రూ.16,827) కాగా, 21వ స్థానంలో ఉంది.
కార్యాలయ అద్దెల పెరుగుదలలో బెంగళూరు ఎంజీ రోడ్‌కు అగ్రస్థానం
కార్యాలయ అద్దెలు అత్యధికంగా పెరగడంలో బెంగళూరు లోని ఎంజీ రోడ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా వద్ధి చెందుతున్న 20 ప్రధాన కార్యాలయ మార్కెట్లపై అంత ర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ నివేదిక రూపొం దించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికం అద్దెను ప్రాతిపది కగా తీసుకుంది. బెంగళూరులో అద్దె ఏడాది క్రితంతో పోలిస్తే ఆసియా పసిఫిక్‌లోనే అత్యధికంగా 17.6 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని (ఎన్‌సీఆర్) కన్నాట్ ప్లేస్, ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ఈ జాబితాలో వరుసగా 7, 11 స్థానాలు దక్కించుకున్నాయి.
దేశంలో 10శాతం తగ్గిన అవినీతి : టీఐఐ
దేశంలో 2019లో అవినీతి 10 శాతం మేర తగ్గిందని ఒక సర్వేలో వెల్లడయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (టీఐఐ), లోకల్ సర్కిల్స్ సంస్థలు కలిసి దీనిని నిర్వహించాయి. అవినీతి సూచీలో 2018తో పోలిస్తే మన దేశం ర్యాంకింగ్ మూడు స్థానాలు మెరుగుపడిందని, 180 దేశాల్లో 78వ స్థానంలో నిలిచిందని టీఐఐ ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతిలో పోలీసు శాఖ, నగరపాలక సంస్థలు ద్వితీయ, తతీయ స్థానాల్లో ఉన్నాయి.
జాతీయ క్రీడల కోడ్ ముసాయిదా పరిశీలన కమిటీ
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ముకుందకం శర్మ అధ్యక్షుడిగా జాతీయ క్రీడల కోడ్ ముసాయిదా 2017ను పరిశీలించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ 13 మంది సభ్యుల నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో గగన్ నారంగ్, పుల్లెల గోపీచంద్, అంజు బాబీ జార్జ్ ఉన్నారు. క్రీడల అధికారుల వయస్సు మరియు పదవీకాలం పై నియంత్రణను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. వివిధ క్రీడల ఫెడరేషన్ అధికారులు ముసాయిదాను వారివారి ఫెడరేషన్ల వారీగా పరిశీలిస్తారు.
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ 'షీబాక్స్'
దేశంలో పెరుగుతున్న లైంగిక దాడుల నిరోధానికిSexual harassment electronic-Box (SHe-Box) అనే ఆన్‌లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని కేంద్ర మహిళా శిశుఅభివద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించింది. పని చేసే ప్రదేశాల్లో మహిళలు ఫిర్యాదులను రిజిస్టర్ చేయడం కోసం ఈ పోర్టల్ ను తయారు చేశారు. దీనిని మహిళలపై లైంగిక దాడుల నివారణ, నియంత్రణ చట్టం 2013 ప్రకారం అమలు చేయనున్నారు.
ప్రాంతీయం
శాసనసభ, మండలి ప్రొరోగ్
తెలంగాణ శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేస్తూ 2019 నవంబర్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శాసనసభ నాలుగో విడత, మండలి 14వ విడత సమావేశాలు ముగిసినట్లుగా పేర్కొంది. ఈ శాసనసభ, మండలి సమావేశాలు 2019 సెప్టెంబరు 29న నిరవధికంగా వాయిదా పడ్డాయి. తాజాగా రాష్ట్రంలో శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులకు 28 ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌ల పదవులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం సాంకేతిక సమస్యలు రాకుండా వీటిని లాభదాయకమైన పదవుల జాబితా నుంచి మినహాయించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది.
కష్ణా, గోదావరి బోర్డుల్లో పరిపాలన సభ్యుడిగా సోమేశ్ కుమార్
కష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల్లో పరిపాలన పరమైన సభ్యుడిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి 2019 నవంబర్ 25న ఉత్తర్వులు విడుదల చేశారు.
పీఆర్‌సీ గడువు ఫిబ్రవరి 25 వరకు పొడిగింపు
వేతన సవరణ సంఘం (పే రివిజన్ కమిషన్-పీఆర్‌సీ) గడువును 2020 ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం.3006) జారీ చేసింది. గతంలో నిర్దేశించిన గడువు ఆగస్టు 25తో ముగియగా అప్పటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర అవతరణ తరువాత తొలి వేతన సవరణ సంఘం 2018 మే 18న ఏర్పాటైంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన మరో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు ఉమామహేశ్వర్‌రావు, రఫత్‌అలీ సభ్యులుగా కమిటీ ఏర్పడింది.
తెలంగాణకు రూ.312 కోట్లు కేటాయింపు
2019-20 ఆర్థిక సంవత్సరంలో అనుబంధ పద్దుల్లో దేశవ్యాప్తంగా రూ.21,246.16 కోట్ల అదనపు వ్యయం వినియోగానికి పార్లమెంటు అనుమతిచ్చింది. ఇందులో తెలంగాణకు రూ.312 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ ఐఐటీకి క్యాపిటల్ ఆస్తుల సష్టికి రూ.300 కోట్లు, అత్తాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, నార్కొటిక్స్ ప్రాంతీయ శిక్షణసంస్థ నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్‌లో ఆధార్ సేవా తొలి కేంద్రం
రాష్ట్రంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మొట్టమొదటి ఆధార్ సేవా కేంద్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభమైంది. ప్రతిరోజు 1000 వరకు ఆధార్ నమోదు, నవీకరణలు (అప్‌డేట్స్) చేపట్టే సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు సంస్థ 2019 నవంబర్ 27న వెల్లడించింది. పూర్తిస్థాయి ఆధార్ సేవా కేంద్రం (ఆస్కా) రాష్ట్రంలో ఇదే మొదటిదని తెలిపింది. యూఐడీఏఐ వెబ్‌సైట్ ask.uidai.gov.in ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో అపాయింట్ మెంట్ తీసుకుని కేంద్రంలో తమకు కావాల్సిన సేవలు పొందవచ్చు. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పని చేస్తుంది. ఆదివారం కూడా ఈ కేంద్రం అందుబాటులో ఉంటుంది. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు విధిగా వర్తించే బయోమెట్రిక్ సేవలు ఇక్కడ పూర్తిగా ఉచితం. ఇతర నవీకరణల కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
దివ్యాంగుల సలహా మండలి నియామకం
దివ్యాంగుల హక్కుల చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం సలహా మండలిని నియమించింది. దివ్యాంగుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధి కారులు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు, ప్రభుత్వ దివ్యాంగుల సంస్థల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఉంటారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి
రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించేందుకు వీలుగా వారి హక్కుల చట్టం మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. ప్రభుత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యాంగుల సంక్షేమానికి ఇచ్చే విరాళాలను దీనికి మళ్లిస్తారు. ఈ నిధిని ప్రత్యేక ఖాతా కింద ఏర్పాటు చేసి, సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ నిర్వహిస్తుంది.
హెచ్‌ఐవీ హైదరాబాద్‌లోనే అధికం
దేశం మొత్తమ్మీద 2017లో కొత్తగా నమోదైన హెచ్‌ఐవీ కేసుల్లో అత్యధికం తెలంగాణలోనే ఉన్నాయి. ఆ ఒక్క ఏడాదిలోనే 9,324 కేసులు నమోదయ్యాయి. 2019 నవంబర్ 28 నాటికి రాష్ట్రంలో 83,102 మంది హెచ్‌ఐవీ బాధితుతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీ సాక్స్) ప్రకటించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే... హైదరాబాద్‌లో వ్యాధిగ్రస్థులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా టీ సాక్స్ గణాంకాలను వెల్లడించింది. గతంలో హెచ్‌ఐవీ బాధితులకు రక్తంలో సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటేనే 'యాంటీ రిట్రో వైరల్(ఏఆర్‌టీ)' ఔషధాలను ఇచ్చేవారు. ఇటీవల మార్చిన విధానంలో హెచ్‌ఐవీ సోకిందని నిర్ధరించగానే ఏఆర్‌టీ ఔషధాలు పంపిణీ చేస్తున్నారు.
సిడ్నీలో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా సంజరుకుమార్
ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా వరంగల్‌కు చెందిన ములక సంజరు కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్‌బ్లాక్ గల్ఫ్ డివిజన్ అండర్ సెక్రటరీగా పనిచేసిన ఆయనను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ 2019 నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన సంజరు.. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుడాన్‌లోనూ పని చేశారు.
తెలంగాణకు 3 స్కోచ్ పురస్కారాలు
మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు 3 స్కోచ్ పురస్కారాలు దక్కాయి. ఢిల్లీలో 2019 నవంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో స్కోచ్ చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా ఆ సంస్థల అధికారులు పురస్కారాలు స్వీకరించారు. డ్యాష్‌బోర్డు, ఈ-కార్యాలయం నిర్వహణకు జెన్‌కోకు, సరఫరా సమస్యల నుంచి ఉపశమనం కల్పించినందుకు ట్రాన్స్‌కోకు ఈ పురస్కారాలు దక్కాయి.
పంటల ఎగుమతులకు కమిటీ ఏర్పాటు
వ్యవసాయ ఎగుమతుల విధానంపై పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ తెలగాణ ఉద్యానశాఖ 2019 నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గల ఈ కమిటీలో మరో 16 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. మామిడి, మిరప. పసుపు, పంటలు పండే జిల్లాలకు అక్కడి కలెక్టర్లను ఈ విధానం అమలుకు నోడల్ అధికారులుగా నియమించారు.
వార్తల్లో వ్యక్తులు
ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ డైరెక్టర్‌గా సింగరేణి జీఎం
సింగరేణి కాలరీస్ కంపెనీ జనరల్ మేనేజర్ బి.వీరారెడ్డి ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ డైరెక్టర్(టెక్నికల్)గా నియమితులయ్యారు. నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2019 నవంబర్ 26న ఇందుకు ఆమోదముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి బి.వేణుగోపాలరెడ్డి ముంబయి శాంటాక్రజ్ సెజ్ అభివద్ధి కమిషనర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లు ఆయన పదవిలో కొనసాగుతారు.
జీ చైర్మన్ సుభాశ్ చంద్ర రాజీనామా
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్) చైర్మన్ సుభాశ్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వచ్చిందని, బోర్డు కూడా ఆమోదం తెలిపిందని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. 'సెబీ నమోదు నిబంధనల్లో రెగ్యులేషన్ 17(ఐబీ) ప్రకారం.. కంపెనీ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) లేదా మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ) సంబంధీకులు బోర్డు చైర్‌పర్సన్‌గా ఉండకూడదు. దీనికి అనుగుణంగానే ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాను బోర్డు ఆమోదించింద'ని కంపెనీ తెలిపింది. కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా చంద్రా కొనసాగుతారని తెలిపింది.
నేవీ మాజీ ఛీఫ్ అడ్మిరల్ సుశీల్‌కుమార్ కన్నుమూత
భారత నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్ సుశీల్ కుమార్ (79) 2019 నవంబర్ 27న దిల్లీలో మృతి చెందారు. ఆయన 1998 నుంచి 2000 వరకు భారత నావికాదళం ప్రధానాధికారిగా పనిచేశారు. తమిళనాడులోని నాగర్ కోయిల్‌లో జన్మించిన సుశీల్ కుమార్ 1965, 1971లలో జరిగిన భారత-పాక్ యుద్ధాల్లో నావికాదళంలో సేవలు అందించారు. దేశానికి ఆయన అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట సేవా పురస్కారం, ఉత్తమ యోధ సేవా పురస్కారం, అతి విశిష్ట సేవా పురస్కారం వంటి అనేక గౌరవాలను అందుకున్నారు.
అవార్డులు
న్యాక్‌కు గోల్డెన్ ట్రోఫీ అవార్డు
హైదరాబాద్ మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు గోల్డెన్ ట్రోఫీ ఇన్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్స్ 2019 అవార్డు లభించింది. ఢిల్లీలో 2019 నవంబర్ 27న నిర్వహించిన అసోచామ్ స్కిల్ ఇండియా 2019 సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్‌సింగ్ చేతుల మీదుగా న్యాక్ ప్లేస్‌మెంట్స్, ట్రైనింగ్ విభాగం డైరెక్టర్ శాంతిశ్రీ ఈ అవార్డును అందుకున్నారు. నిర్మాణ రంగంలో నిరుద్యో గులకు వత్తి విద్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో న్యాక్ అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం వరించింది.
హెచ్‌సీయూకి 'వర్సిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయాని (హెచ్‌సీయూ)కి ఫెడరే షన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఫిక్కీ) తరపున 'యూనివర్సిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది. 2019 నవంబర్ 27న ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 6వ ఉన్నత విద్యా ప్రతిభా పురస్కారాల ప్రదానం సందర్భంగా హెచ్‌సీయూకి ఈ అవార్డు దక్కింది. వర్సిటీ అనుసరిస్తున్న విధానాలు, భావి లక్ష్యాలు, అవార్డులు, ర్యాంకింగ్స్, స్వర్గ్, ఆచార్యుల పదోన్నతులు తదితర అంశాలపై నవంబర్ 22న హెచ్‌సీయూ ప్రతినిధులు ఫిక్కీ అవార్డు జ్యూరీ ఎదుట హాజరై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని గుర్తించి 30 ఏళ్లకు పైబడి కొనసాగుతున్న విభాగంలో 'యూనివర్సిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఫిక్కీ అందించింది.
డీఆర్‌డీవో అధిపతికి రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్
రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అధిపతి జి.సతీశ్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ(ఆర్‌ఏఈఎస్) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఏరోనాటికల్ సొసైటీలో భారతీయుడొకరికి ఈ ఘనత దక్కడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఏరోస్పేస్ రంగంలో దీన్ని నోబెల్ పురస్కారానికి సమానంగా పరిగణిస్తారు. గత మూడు దశాబ్దాల్లో సాంకేతిక రంగంలో అందించిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా సతీశ్ రెడ్డికి ఈ ఫెలోషిప్ లభించింది. ఈ గౌరవ ఫెలోషిప్‌ను తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల్లో ఒకరైన ఆర్విల్ రైట్‌కు అది దక్కింది.
సైన్స్ & టెక్నాలజీ
పీఎస్‌ఎల్‌వీ-సి47 ప్రయోగం విజయవంతం
సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో 2019 నవంబర్ 27న రెండో ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి47 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన కార్టోశాట్-3తోపాటు, అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ-సి47 మొత్తం పక్రియను 26.50 నిమిషాల్లో పూర్తి చేసింది.
డిసెంబర్‌లో పీఎస్‌ఎల్వీ సీ 48
పీఎస్‌ఎల్‌వీ సీ 48 విజయవంతం అవడంతో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ 48 ను డిసెంబర్‌లో ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనిని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్11న ప్రయోగించనున్నారు. దీని ద్వారా రీశాట్2 బీఆర్1తో పాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రీశాట్-2బీఆర్1 ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. పరీక్షల దశలో ఉంది. ఇది ఆధునిక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. అయితే రీశాట్ -1 పూర్తిగా సిద్ధం కాక పోవడం వల్ల ముందుగా రీశాట్ - 2ను పంపుతున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.
అతిపెద్ద బ్లాకహేోల్‌ను కనుగొన్న చైనా
చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ హోల్‌ను కనుగొన్నారు. సూర్యుడి ద్రవ్యరాశి కంటే ఈ బ్లాకహేోల్ ద్రవ్యరాశి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ క ష్ణ బిలానికి ఎల్‌బీ-1 అని పేరు పెట్టారు. పాలపుంతలో 100 మిలియన్ నక్షత్ర వ్యవస్థలో బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. భారీ నక్షత్రాల పతనం ద్వారా ఏర్పడిన విశ్వ బిలాలు కావడంతో కాంతి కూడా వీటిలో నుండి చొరబడలేదు. ఈ క ష్ణ బిలాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సైస్(ఎన్‌ఎఒసి)కి చెందిన చైనా నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటర్ శాస్త్రవేత్తల నేతత్వంలోని అంతర్జాతీయ బందం కనుగొంది.
క్రీడాంశాలు
డేవిస్ కప్ విజేత స్పెయిన్
స్పెయిన్ జట్టు ఆరోసారి డేవిస్‌కప్ టైటిల్‌ను చేజిక్కించు కుంది. ఫైనల్లో డబుల్స్ మ్యాచ్‌తో పని లేకుండానే కెనడాపై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో రఫెల్ నాదల్ 6-3, 7-6 (9-7)తో షపోవలోవ్‌ను ఓడించడంతో స్పెయిన్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాబర్టో బటిస్టాతో ఫెలిక్స్ అగర్-అలియాసిమ్‌పై విజయం సాధించాడు. 19 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ నాదల్‌కు ఇది నాలుగో డేవిస్‌కప్ టైటిల్.
రష్యాపై నాలుగేళ్ల నిషేధానికి వాడా ప్రతిపాదన
అంతర్జాతీయ క్రీడల నుంచి రష్యాను నాలుగేళ్లు నిషేధిం చాలని అంతర్జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ(వాడా) ప్యానెల్ ప్రతిపాదించింది. డోపింగ్ కుంభకోణంపై విచారణ జరుపు తున్న అధికారులకు తప్పుడు లాబొరేటరీ డాటాను ఇచ్చినం దుకు రష్యాపై చర్యలకు ఉపక్రమించినట్లు వాడా తెలిపింది. జనవరిలో ఇచ్చిన ఈ వివరాల నుంచి అనేక విఫల డ్రగ్ పరీక్షలను తొలగించినట్లు రష్యా ఆరోపణలు ఎదుర్కొం టోంది. నిషేధం అమలైతే వచ్చే ఒలింపిక్స్‌లో రష్యా ఉండదు. డోపింగ్ కుంభకోణం కారణంగా రష్యా గత ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌కు దూరమైంది. నాలుగేళ్ల పాటు ఏ రకమైన క్రీడల్లోనూ పోటీపడకుండా, అంతర్జాతీయ టోర్నీల ఆతిథ్యానికి బిడ్ వేయకుండా రష్యాపై నిషేధం విధించాలని వాడా ప్యానెల్ ప్రతిపాదించింది.