Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు శీతాకాలపు సమావేశాలను రద్దు చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి ఆచరణలో ఏపాటి విలువనిస్తున్నదో తేటతెల్లం చేస్తున్నది. ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేంతవరకే ప్రజాస్వామ్యం తప్ప ఏ విధంగా ప్రభుత్వం నడుస్తున్నదో ఎప్పటికప్పుడు నిగ్గుతేల్చే చట్టసభల సమావేశాలకు అంతగా ప్రాధాన్యత లేదని మోడీ ప్రభుత్వం చెప్పకనే చెప్తోంది. మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ 2020 సంవత్సరంలో కేవలం 33రోజులు మాత్రమే మన లోక్‌సభ పని చేసినట్టయింది. ట్రంప్ పర్యటనకు, బీహార్ ఎన్నికలకు, పలు ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీలకు, శాసన మండళ్ళకు జరిగిన ఉప ఎన్నికలకు, అయోధ్యలో ఆలయ శంకుస్థాపనకు ఆటంకం కాని కోవిడ్-19 ఈ శీతాకాలపు పార్లమెంటు సమావేశాలకు మాత్రమే అడ్డం వచ్చిందా?
ఇప్పటికన్నా ఇంకా ఉచ్ఛ స్థాయిలో కోవిడ్-19 ప్రభావం చూపుతున్నప్పుడు కూడా తమ కార్పొరేట్ ఎజెండాను అమలు చేయాలనుకున్నప్పుడు కేంద్రం పార్లమెంటును నడిపింది. రికార్డు సంఖ్యలో అత్యధికంగా 40కి పైగా చట్టాలను ఆమోదింపజేసుకుంది. వాటిలో అత్యధికం ప్రజా వ్యతిరేకమైనవి. కార్మికుల నుంచి, రైతాంగం నుంచి వాటికి తీవ్ర ప్రతిఘటన ఇప్పటికే మొదలైంది. ఈ ఉద్యమాల ద్వారా ప్రజలు సంధించిన పలు ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. తమ కార్పొరేట్ సేవా తత్పరత, ప్రజా వ్యతిరేకత నగంగా మరోసారి పార్లమెంటు సాక్షిగా వెల్లడవుతుందన్న భయమే మోడీ ప్రభుత్వం సమావేశాలనే జరపకుండా మొహం చాటేసేందుకు నెట్టింది.
అంతర్జాతీయంగా సవాలుగా మారిన ఆర్థిక సంక్షోభ ప్రభావం తక్కిన దేశాల కన్నా మన దేశం మీద చాలా ఎక్కువగా పడింది. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టడానికి మోడీ ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. కానీ ఆ సంక్షోభ భారాలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీడీపీ వృద్ధి పతనం రూపాల్లో అనునిత్యం బయటపడుతూనే ఉన్నాయి. కరోనా కాలంలో ప్రజలను ఆదుకునే ఉద్దీపన పథకాలను ఏదోఒక మేరకైనా తక్కిన దేశాలు అమలు చేశాయి కాని మోడీ సర్కారు మాత్రం ఉద్దీపనను కార్పొరేట్లకే పరిమితం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను పతనపుటంచులకు తీసుకువచ్చిన బీజేపీ దివాళాకోరుతనం పార్లమెంటులో చర్చకు వస్తే ఎదుర్కోగలిగిన నిజాయితీ మోడీ ప్రభుత్వానికి లేదు గనుకనే శీతాకాలపు సమావేశాలను రద్దు చేసి రగ్గు కప్పేసుకుంటోంది. ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు దిగజారి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మైనారిటీలను, దళితులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సాగిస్తున్న దాడులు జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశాలయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ-హిందూత్వ శక్తులు రెచ్చగొట్టే అవాస్తవిక భావావేశాల ఎజెండా పక్కకు పోయి దేశం, ప్రజలు ఎదుర్కుంటున్న వాస్తవికమైన, దైనందిన జీవితపు ఎజెండా ముందుకొచ్చింది. ఈ సెక్యులర్ ఎజెండాపై చర్చించడానికి బీజేపీకి ధైర్యం లేదు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడానికి ఈ ఎజెండా అనుమతించదు.
వానాకాలపు సమావేశాల వరకూ వెంట వచ్చిన మిత్రపక్షాలు ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ఒకటొకటిగా ముఖం చాటేస్తున్నాయి. సంక్షోభ సమయంలో రాష్ట్రాలను ఆదుకునే బదులు వాటి వనరులను సైతం కాజేసిన పెద్దన్న పట్ల అవి గుర్రుగా ఉన్న సమయంలోనే వెల్లువెత్తిన రైతాంగ ఉద్యమం పలు ప్రాంతీయ పార్టీల వైఖరిని ప్రభావితం చేస్తోంది.
ఇటీవల నూతన పార్లమెంటు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఆ సందర్భంగా పాత పార్లమెంటుకు కాలం చెల్లిందని నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. అయితే ప్రజాస్వామ్యం పాతబడిపోయిన భవనం లాంటిది కాదు. తమకు వీలైనట్టు కూల్చివేయ వచ్చుననుకుంటే సాధ్యమూ కాదు. లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల బీజేపీకి ఎంత చిన్నచూపు ఉందో దేశంలో ప్రజాస్వామ్య శక్తులు ఇప్పటికే గమనించాయి, అర్థం చేసుకున్నాయి. పరిరక్షించుకు నేందుకు సమాయత్తం అవుతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను ఇకముందైనా నిజాయితీగా పాటించడానికి సిద్ధపడకపోతే మోడీ ప్రభుత్వానికి ఆ శక్తులు తగిన పాఠం నేర్పడం ఖాయం.