Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ బయోటెక్-ఐసిఎంఆర్ తయారు చేస్తున్న 'కోవాగ్జిన్' మూడవ దశ క్లినికల్ పరీక్ష పూర్తి కాకుండానే దీనిని వినియోగానికి అనుమతించడం మోడీ మార్క్ టీకా రాజకీయానికి నిదర్శనం. ఈ దేశీయ టీకా ' భారత్‌కే గర్వకారణం', 'కరోనాపై పోరులో నిర్ణయాత్మక మలుపు' అంటూ మోడీ, ఆయన వంది మాగధులు అదే పనిగా ఊదరగొడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలోను, ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి దిగజారకుండా నిలువరించడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యం కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవం. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కోవాగ్జిన్ టీకాను అది ఒక అస్త్రంగా వాడుకోవాలని చూడడం నీతిమాలిన చర్య. మూడవ దశ పరీక్షలో ఉండగా ఒక టీకాను ఈ విధంగా అత్యవసర వినియోగానికి అనుమతించడం ప్రమాదకరం. పోలియో వ్యాక్సిన్ వచ్చినప్పుడు దానిపై ఎలాంటి వివాదమూ లేదు. సీరమ్ అభివద్ధి చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) ఆమోదం తెలిపినప్పుడు దానికి ఎవరూ అభ్యంతరపెట్టలేదు. కోవాగ్జిన్‌పై వివాదం తలెత్తడానికి ప్రభుత్వ బాధ్యతారహిత వైఖరే కారణం. 26 వేల మంది వలంటీర్లపై ప్రయోగం జరపాల్సి ఉండగా, ఇంతవరకు 23 వేల మందిపైనే ప్రయోగించారు.
ఆ ప్రయోగాల మూడో దశ ఫలితాలు రావడానికి 2 నుండి 10 నెలల సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండకుండా ఇంతలోనే దీనికి కేంద్ర డ్రగ్ కంట్రోల్ సంస్థకు చెందిన సబ్జక్టు నిపుణుల కమిటీ ఎలా ఆమోదం తెలిపింది? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమే. దీనిపై రాజకీయ పార్టీలే కాదు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీరమ్-ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెన్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకా డోసులు అయిదు కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. అటువంటప్పుడు కో వ్యాక్సిన్ సురక్షితమని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సు ఉండవని నిర్ధారణ అయ్యేవరకు ఎందుకు ఓపిక పట్టలేక పోయారు? ఈ టీకా కొనుగోలుకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధర ఎంత? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
కోవిడ్‌పై పోరులో ముందు పీఠిన నిలిచిన వైద్య , భద్రతా సిబ్బందికి ఈ టీకాను మొదట వేస్తామంటున్నారు. ఈ వ్యాక్సిన్ తుది ట్రయల్స్‌కు సంబంధించిన డేటా ఏదీ వెల్లడికాక మునుపే వైద్యులను ప్రయోగాలకు బలిపశువులను చేస్తారా? ప్రభుత్వ తొందరపాటుతనం ప్రజల ప్రాణ సంకటంగా మారకూడదు. కోవాగ్జిన్ టీకాతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధించేసినట్లు మోడీ ప్రభుత్వం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. దేశంలోని మొత్తం 130 కోట్ల మంది వుంటే, మూడు కోట్ల మందికి మాత్రమే మొదటి విడతలో టీకాలు అందుబాటులో ఉంటాయి. అదీ గాక ఈ టీకాలు ఎంతవరకు ఫలితమిస్తాయో అనుభవంలో కానీ తేలదు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టీకాలు వేసే కార్యక్రమం ఇప్పటికే చేపట్టారు. అయినా, అక్కడ కోవిడ్ కేసులు ఆగలేదు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి తార్కాణం కరోనా కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలవడమే. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాళాకోరు నయా ఉదారవాద విధానాలు కరోనా విజంభణకు మరింత ఆజ్యం పోశాయి. కరోనా కాలంలో ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకన్నా కార్పొరేట్లకే ఎక్కువ ప్రయోజనం కలిగించాయి. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో మొదటిసారి దేశ ఆర్థిక వ్యవస్థ నెగిటివ్ గ్రోత్‌లో పడింది. 2016-17లో 8.3 శాతంగా ఉన్న జిడిపి 2020-21లో మైనస్ 9.5 శాతానికి పడిపోయింది.
సిఎంఐఇ సర్వే ప్రకారం కరోనా కాలంలో 15 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది. ప్రజల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి ఒక వైపు ఉంటే మరో వైపు దేశంలోని 15 మంది అత్యంత సంపన్నుల వద్ద సంపద ఈ కాలంలో 14 శాతం మేర పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాపితంగా నిరసనలు, ఆందోళ నలు తీవ్రతరమవుతున్నాయి. కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలకు రైతులను, వ్యవసాయాన్ని వదిలిపెట్టే మూడు చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా సాగిస్తున్న పోరాటం నయా ఉదారవాద విధానాలకు పెరుగుతున్న ప్రతిఘటనను తెలియజేస్తోంది. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం పది మాసాల వ్యవధిలో రెండు భారీ సమ్మెలు నిర్వహించింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతప్తి రగులుతోంది. కో వాగ్జిన్‌ను అడ్డం పెట్టుకుని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవచ్చునని అనుకుంటే మోడీ పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్టే.