Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక మందిలో భక్తి పారవశ్యం కంటే స్వలాభాపేక్షే ఎక్కువ! నాయకమన్యుల దృష్టిలో పడితే ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక పదవిరాక పోతుందా, తానూ తన తోటి వాళ్ళలా ఎంతో కొంత వెనకేసుకోకపోతానా అనేది వర్తమాన పాలక 'తత్వశాస్త్రం'. దీనికి సజీవ నిదర్శనం మొన్న తెలంగాణ భవన్‌ముందు వెలిసిన ఓ ఫ్లేక్సీ! కేటీఆర్‌ని ''ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ'' అని రాసిన దానికంటే ''అప్పుడు రామ రాజ్యం, ఇప్పుడు రానున్నది రామన్న రాజ్యం'' అనేది తరచి చూస్తే భజన పాలే నిలువెల్లా దర్శనమిస్తుంది.
''నా విష్ణుః పృధివీ పతిః అన్నట్టు రాజులు దైవాంశ సంభూతులు. ఏ రాజ్యంలో కులధర్మాలు విధిగా ఆచరించబడ్తాయో ఆ రాజ్యంలోని రాజు శాంతి దాంతుల్తో ఇహ పరసుఖాల్ని పొందుతాడని..'' సత్యకాముడితో యాజ్ఞ వల్క్య మహర్షి చెప్తాడు (సి.వి.రాసిన సత్యకామ జాబాలి నుంచి).
రామరాజ్య స్థాపనే తమ లక్ష్యమన్న కమలనాథుల కలతో ఈ గులాబీ కార్యకర్త ఆశ సింక్రనైజ్ కావడాన్ని ప్రస్తుతానికి కాకతాళీయమే అనుకుందాం. ధర్మం నాలుగు పాదాలతో నడవడం రామరాజ్యం ప్రత్యేకతంటారు విశ్వాసులు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఊడలేసి ఉండటం. అందుకే నాటి పురోహిత వర్గం శూద్ర శంభూక వధ జరిపిస్తుంది. ఆ స్థితికి సమాజ చక్రాన్ని వెనక్కి తిప్పాలని కమలనాథుల ప్రయత్నం. అందుకు ఎప్పటికప్పుడు కొత్త సామంతుల్ని పోగు చేసుకుంటూనే ఉంటుంది కాషాయపార్టీ. సామ, దాన భేద, దండోపాయాల్ని అంటే సీబీఐ, ఈడీ, ఐటీ, విజిలెన్స్ శాఖల్ని యమపాశంతో పెనవేసి ప్రయోగిస్తే అనేక పాలకపార్టీలు గిలగిల్లాడి పాదాక్రాంతమవడం వర్తమాన వాస్తవం. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన పరమసత్యమొకటుంది. అధినేత రాజకీయ ప్రయోజనాలే తెలంగాణ ప్రయోజనాలుగా ప్రకోపిస్తే సాధించుకున్న తెలంగాణ ఈనగాచి నక్కలపాలే అవుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
వెనకటికి ''ఇండియానే ఇందిర! ఇందిర అంటేనే ఇండియా!'' అని అత్యవసర పరిస్థితిలో పారాయణం చేసిన 'కోటరీ' ఆపార్టీని ఎక్కడికి చేర్చిందో వెనక్కి తిరిగి చూస్తే కనపడే నిష్టుర సత్యం. ప్రజల ప్రయోజనాలు పాలక నేతల ప్రయోజనాలతో ఎన్నటికీ సరిసమానం కావు. నిమ్జ్ భూసేకరణ అయినా, పోలేపల్లి సెజ్ కార్మికుల ప్రయోజనాలైనా పాలకుల ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రయోజనం అసలేకావు.
తెలంగాణ ఉద్యమంలో కోట్లాది సామాన్యులు భాగస్వాములైంది వారి జీవితాలు స్వరాష్ట్రం అయితేనే తెల్లారతాయని. కనీస వేతనాలందని కార్మికులు, మద్దతుధర దక్కని రైతులు, ఆరేండ్లు దాటినా 'మగ్గం' గిట్టుబాటుకాని నేతన్నలు ఉరితాళ్లనే నేస్తాలుగా నమ్ముకుంటూంటే వచ్చిన రాష్ట్రం తెచ్చుకున్న వారికి ఏమి మిగిల్చింది? అదే దొరతనం, అవే గడీల్లాంటి ''భవనాలు'', ఎవరికీ అందకుండా చిటారు కొమ్మన అధినేత. తిరుపతి వెంకన్నకైనా ధర్మ దర్శనం ఉంటుంది. కాని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓన్లీ వి.ఐ.పి. దర్శనమే. సెక్రటేరియట్‌కే రాని సీఎం, ఆ దారిలోనే అనేకమంది అమాత్యులు. సచివాలయమే లేని 'మేక్ షిఫ్టు' ఆఫీసుల్లో సచివులు. బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో అర్థంకాని ప్రజలు. ఇదీ నేటి వ్యదార్థ జీవిత యధార్థ తెలంగాణ.
ఇది పైపై పూతలతో మెరుగయ్యే వ్యాధికాదు. పాలన మెరుగవకపోతే పాలితులు కాకవికలౌతారు. సాధించుకున్న తెలంగాణ అర్థం, పరమార్థంలేనియవుతాయి. ఈ దశలో పుత్రవాత్సల్యం కోసం ధృతరాష్ట్ర కౌగిలే ప్రత్యామ్నాయమని అధినేత తలపోయడం కొరివితో తలగోక్కోవడమే! గుడిని గుడిలో లింగాన్ని మింగి అరాయించుకోగలిగిన పార్టీ బీజేపీ. తనతో కలిసిన మిత్రపక్షాల్నే నిర్దాక్షిణ్యంగా నమిలి మింగేయడం దాని నైజం. డౌటుండే మా రాజులు అసోంలో ఎ.జి.పి.ని, ఆంధ్రాలో టీడీపీల ప్రారబ్దాల్ని పరిశీలించవచ్చు. ఢిల్లీ కెళ్లి కొత్వాలుకు, మూలవిరాట్‌కు వంగి వంగి దండాలు పెట్టొచ్చిన మరుక్షణం సంజయుడేమన్నాడో టీఆర్‌ఎస్ శ్రేణులు మర్చిపోకూడదు. పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్‌ను కటకటాల్లోకి నెడ్తామంటాడు. అధినాయకులు అభయహస్తమిస్తూంటారు. లోకల్ లీడర్లు కాలు దువ్వుతుంటారు. ఇది వారి రీతి. దేశమంతటినీ కాషాయీ కరించాలనేది బీజేపీ లక్ష్యం. ఆ విధంగా గుత్త పెట్టుబడికి వ్యతిరేకత లేకుండా చూసుకోవడం ఆ లక్ష్యంలో అంతర్భాగం.
అందుకే ఎవరు ''భజన''లో నిమగమైనా తలయెత్తి దేశంలో జరిగే పరిణామాల్ని పరిశీలించకున్నా కాషాయ దాడిని నిలువరించలేరు. నాలుగు కోడ్‌లపై కార్మిక సమ్మెలైనా, మూడు వ్యవసాయ చట్టాలపై ఏకమవుతున్న రైతు ఉద్యమమైనా, దానిలో మమేకమవుతేనే సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుంది.