Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఉద్యమకాలంలో అధినేత ప్రవచనాలను విన్న జనం ఉర్రూతలూగారు. పెట్టుబడిదారీ విధాన పర్యవసానాలన్నింటికీ - అది అవిద్య అయినా, నిరుద్యోగమైనా, పేదరికమైనా - అన్నింటికీ రాష్ట్రావతరణే ఏకమూలికా ప్రయోగమని రాజకీయ 'ధన్వంతరి' చెపితే ఓట్లు రాలి, సీట్లు వచ్చాయి. అధికారం దఖలు పడింది. వలస పక్షుల కూడికతో 'పద్దు' నిండి పరిపూర్ణమైంది. విధానాల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకుదారిచూపడం కంటే జంప్ జిలానీలతోనే తన బుట్ట నింపుకునే దగ్గరి మార్గాలను అధినేత వెతుక్కున్నాడు. సంపాదించుకునే మార్గాలు చూపితేనే కదా ఆ తక్కెడ్లోని కప్ప ఈ తక్కెడ్లోకి దూకేది! కేసీఆర్ సాబ్ అదే చేశాడు. కాబట్టి అలానే జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాల స్థానంలో స్వ ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం ముందుకొస్తే?! పైగా బీజేపీ కేంద్రంలో శతసహస్ర కోటీశ్వరుల దన్నుతో ఊడలేసి నిలబడున్న నేపథ్యంలో కేసీఆర్ 'ఆపక్కనుండాలో ఈ పక్కనుండాలో' తేల్చుకోవాలి. రెండు పడవల మీద ప్రయాణం అసాధ్యమనే సంగతి తెలీని అమాయకుడేం కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి! దుబ్బాకలో ఓటమి, జీహెచ్‌ఎంసీలో శృంగభంగం లాంటిది కాదు నేడు అధినేత ముందున్న పరీక్ష. భారీగా పెట్టకపోయినా కనీసం అన్నంతినే చెయ్యి విదిలిస్తే ఆ మెతుకులైనా ఏరుకుందామని బీజేపీ పాలకుల ముందు దేబిరిస్తే నిరుపయోగమనే విషయాన్ని రాష్ట్ర నేతలు ఎంత తొందరగా గుర్తిస్తే ఈ రాష్ట్రానికి అంత మంచింది. 2021-22 బడ్జెట్ రాష్ట్రానికి మొండిచేయి చూపిన తర్వాత దీని ప్రాధాన్యత ఇంకా పెరిగింది.
''అనుభవంలోకొస్తేనే తత్వం బోధపడుతుంద''నే గిరీశం డైలాగు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లెవేసి ఎక్కువ రోజులు కూడా కాలేదు. మన రాష్ట్రానికి సాయం చేస్తారన్న ఆశతో ఇంతకాలం కేంద్రపై యుద్ధం చేయలేదు. ఇక చూడండి మన తడఖా అని ఇటీవలే అన్న పెద్దమనిషి సర్వశ్రీ కేసీఆర్. మళ్ళీ ఏ బెదిరింపులొచ్చాయో, బ్లాక్ మెయిలే చేయబడ్డాడో తెలీదు కానీ, కళ్ళెదుటే ఇంత పెద్ద అన్యాయం జరుగుతూంటే అటు లోక్‌సభ, రాజ్యసభ నేతలు, ఇటు అధినేత, అటు ''బుల్లినేత'' మౌనం ఎందుకు వహిస్తున్నారు? తెలంగాణకి ద్రోహం చేస్తే డొక్క చింపుతామని, డోలుకడ్తామని గాండ్రించిన పెద్దలు మోడీ, అమిత్‌షాల ముందు మ్యావ్! మ్యావ్! మనడం వెనుక కథేమిటి!?
15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయకపోవడం వల్ల మన రాష్ట్రం రూ.723 కోట్లు నష్టపోయిందని కేంద్రానికి వినతిపత్రాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని కేసీఆర్‌కు ఎవరు చెప్పాలి? మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.900కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేలా కేసీఆర్ సర్కార్ కేంద్రంపై పోరాడదా? కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాకు మళ్ళీ గండికొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇది మన రాష్ట్ర ఖజానాకు మరింత భారం కానుంది. చివరికి కేసీఆర్‌కు ప్రియతమమైన, ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'కాళేశ్వరం' ప్రాజెక్టుకు జాతీయ హౌదా కూడ సాకారం కాలేదు. ఆ విధంగా భూసేకరణకు కాకుండా ఇతర నిధులు వస్తాయని పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఇంటింటికి నల్లా నీళ్ళు వస్తాయని ఊరించిన మిషన్ భగీరథ కోసం అడిగిన రూ.19వేల కోట్ల ఆర్థిక సహాయం ఇంతే సంగతులైంది. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్‌లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ మోడీ సర్కార్ ప్రయివేటీకరణ హౌరులో ఎగిరిపోయాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బంగకు వేలకోట్ల రూపాయలు జాతీయ రహదారుల విస్తరణకు కేటాయించిన కేంద్ర బడ్జెట్ మన రాష్ట్రం ఊసే ఎత్తకపోవడంతో ఇది ఫక్తు రాజకీయ బడ్జెట్ అని చెప్పక తప్పదు. వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్‌లో కేంద్రం వాటా రూ.200 నుంచి వెయ్యికి పెంచాలన్న విజ్ఞప్తిని కూడా 2021-22 బడ్జెట్ పట్టించుకోలేదు.
రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యులు గత ఐదేండ్లుగా చేస్తున్న ఏ ఒక్క విజ్ఞప్తిని నేటి కేంద్ర బడ్జెట్ పరిగణనలోకి తీసుకోలేదు! బీజేపీ స్పష్టంగానే ఉంది. తన కబంధ హస్తాలను దేశమంతటికి విస్తరించాలన్న కుతి ఆ పార్టీకి కనపడుతుంది. నిర్ణయించుకోవాల్సింది మనమే. అధినేత ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. పైగా ఇదే విధంగా అనేక రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్ర బీజేపీ పాలన నష్టం చేస్తోంది. కలిసొచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రపై వత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ సిద్ధం కావాలి. గుత్తపెట్టుబడి కనుసన్నల్లో రూపొందించబడి అమలు చేయబడే ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా రంగంలోకి దూకాలి.