Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంగసాన్ సూకీ మళ్ళీ నిర్బంధించబడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా 2015లో ఎన్నికై పదవీకాలం పూర్తిచేసుకుని రెండవసారి ఎన్నికలలో భారీమెజారిటీతో ఎన్నికైనా మిలటరీ ఎదరుతిరిగి ఆమెను నిర్భందించింది.
మయన్మార్‌లో 2020 నవంబర్ 8న ఎన్నికలు జరిగాయి. నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ఘనవిజయం సాధించింది. ఎన్‌ఎల్‌డీకి ఆంగసాన్ సూకీ నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికలలో అవకతవకలు జరిగినట్టు సైన్యం ప్రకటించింది. సైన్యం ప్రోద్బలంతో నడిచే డెవలప్‌మెంట్ పార్టీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓటమిపాలైంది. దానితో సైన్యం ఎన్నికలను తొత్తడం చేయ్యాలని పూనుకున్నది.
ఫిబ్రవరి 1న కొత్తగా ఎన్నికైన సభ్యులు జాతీయ అసెంబ్లీ సమావేశం జరుపుకుని తమ నాయకత్వాన్ని రాజ్యాంగపరంగా ఎన్నికోవాల్సి ఉన్నది. అదే రోజు ఉదయాన్నే సైన్యం, ఆంగసాన్ సూకీని, దేశాధ్యక్షుడిని, ఎన్‌ఎల్‌డీ పార్టీ ముఖ్య నాయకులను గృహనిర్భందంలో పెట్టేసి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సంవత్సరంలో తిరిగి ఎన్నికలు జరిపి అప్పుడు ఎన్నికైన వారికి నాయకత్వం అప్పగిస్తామని ప్రకటించింది. సైన్యం అప్రజాస్వామిక చర్యకు ఇది పరాకాష్ట. సూకీపై, దేశాధ్యక్షుడిపై పెట్టిన కేసులు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సూకీ ఇంటిని సోదాచేస్తే 10వాకీటాకీలు దొరికాయని, వాటికి సంబంధించిన దిగుమతి పత్రాలు సక్రమంగా లేవనే కారణం చూపుతున్నారు. అధ్యక్షుడు నవంబర్ ఎన్నికల సమయంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించారని అభియోగం మోపారు.
మయన్మార్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన పార్టీ వారికి 75శాతం పదవులు ఇచ్చి ఇరువై ఐదుశాతం పదవులు సైన్యం నియమించిన వారికి ఇస్తారు. అందులో రక్షణ, సరిహద్దులు, అంతర్గత భద్రత లాంటివి ఉంటాయి. ఈ ఎన్నికలలో ఎన్‌ఎల్‌డీ 476 సీట్ల జాతీయ అసెంబ్లీలో అత్యధికంగా 396 సీట్లు గెలిచింది. సైన్యం బలపర్చిన డెవలప్‌మెంట్ పార్టీ కేవలం 33సీట్లు మాత్రమే గెలిచింది. ఈ ఫలితాల వలన సైన్యం ప్రాధాన్యత తగ్గిపోతుందని భావించిన సైన్యం ప్రజాస్వామ్యంపై దాడి చేసింది. ప్రస్తుతం మిలటరీ జనరల్ పదవీకాలం త్వరలో ముగియనున్నందున ఆయన పదవీ కాలం పొడిగించుకునే అవకాశం తగ్గిపోయినందున కూడా దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే డెవలప్‌మెంట్ పార్టీకి గెలుపు సిద్ధించి ఉంటే ఆయన పదవీకాలం పెంచుకునే అవకాశం ఆయన చేతులలోనే ఉండేది. ఇది చేజారిపోవడం కూడా సైనిక తిరుగుబాటుకు మరో కారణం కావచ్చు.
గతంలో రాజ్యాంగంలో చేసిన సవరణతో ప్రభుత్వ విధానాల నిర్ణయంలో మిలటరీ జోక్యం చేసుకునే అవకాశం ఉండేది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే పాత సవరణను తొలగించేందుకు ఎన్‌ఎల్‌డీ పూనుకుంటుందనే అనుమానంతో కూడా సైనిక తిరుగుబాటు జరిగి ఉంటుంది. తాజా పరిణామాలు మయన్మార్ ప్రజాస్వామ్య ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ. సుదీర్ఘకాలం ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మయన్మార్ ప్రజలు మిలటరీ ఆధిపత్యాన్ని అంగీకరించే అవకాశం ఉండదు. ప్రభుత్వ టీవీ ప్రసారాలను మిలటరీ నిలిపివేసింది. రాజ్యాంగం ప్రకారం ఒక ఏడాదిపాటు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించేందుకు అవకాశం ఉంది. దానితో మిలిటరీ అధిపతికి ఆమేరకు ఏడాదిపాటు మిలటరీ, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు దఖలు పడ్డాయి. మిలిటరీ ప్రధాన కమాండర్ మిన్ ఆంగ్ లైయింగ్ అధికారాన్ని చేపట్టారని మిలిటరీ టీవీ ప్రకటించింది. ప్రస్తుతం మిలిటరీ ప్రతిపాదించిన ఉపాధ్యక్షుడు, మిలిటరీ మాజీ జనరల్ అయిన యుమియింట్ స్యేదు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డారు.
మయన్మార్ గత చరిత్రను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం కోసం అక్కడ అనేక సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉన్నది. ఈ పోరాట క్రమంలో సూకీ ఒక కీలక నేతగా, ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటానికి ఒక ఐకాన్‌గా ఎదిగారు. ఈ పోరాటంలో ఆమె 15ఏండ్లు గృహ నిర్బంధంలో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిర్బంధించబడ్డారు. నిర్బంధాలకు వెరవని సూకీ గత పోరాట స్ఫూర్తితోనే ఉన్నారు. ఒక చిన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి సూకీ అన్ని విధాలా త్యాగానికి సిద్ధపడ్డారు. సూకీ తండ్రి గతంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధుడు. ఆయన కమ్యూనిస్టు. ఆయన పోరాట వారసత్వాన్ని సూకీ కొనసాగిస్తున్నారు.
మిలటరీ పాలన ప్రకటించిన వెంటనే ఒక ప్రకటనలో సూకీ ఈ సైనిక ప్రభుత్వాన్ని అంగీకరించకండి, మనస్ఫూర్తిగా దాన్ని ప్రతిఘటించండి, ఈ పరిణామం దేశాన్ని మళ్ళీ మిలటరీ నియంతృత్వంలోకి తీసుకుపోతుందని ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి స్పందిస్తూ సైనిక తిరుగుబాటు ఎట్టి పరిస్తితులలో అంగీకరించేది లేదని, ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తుందనీ, చట్టబద్ధ పరిపాలనను నీరుకారుస్తున్నదనీ పేర్కొన్నది. రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చింది.
మయన్మార్‌లో ఎన్‌ఎల్‌డీ శాంతియుత నిరసనల పిలుపుతో ప్రజలు కార్ల హారన్లు పెద్దగా మోగిస్తూ రహదార్లపై నిరసనలకు దిగారు. దేశంలోని వైద్య సిబ్బంది మిలిటరీ ప్రభుత్వ పాలనలో తాము పనిచేయమని తమ నిరసన తెలిపారు. డాక్టర్లు పనులకు హాజరుకావడం లేదు. ఆస్పత్రులలో వైద్యసేవలు స్తంభించిపోతున్నాయి. మయన్మార్‌లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును గౌరవించి మిలటరీ పాలకులు ప్రజాస్వామ్యాన్ని వెంటనే పునరుద్ధరించాలి.