Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తెచ్చిన ట్రిబ్యునళ్లు, భట్టిప్రోలు పంచాయతీ''లా మిగలకూడదు. దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచని భూవివాదాల అంతును నెలరోజుల్లోనే ట్రిబ్యునళ్లు తేల్చేయడం హాస్యాస్పదం. రెవెన్యూ కోర్టుల్లోని కేసుల పరిష్కార ప్రక్రియలో శాస్త్రీయత లేదు. సహేతుకత అంతకన్నా లేదు. ఏదో పైపైన పరిశీలించి, సీఎం కేసీఆర్ మెప్పుకోసం ట్రిబ్యునళ్లు ''మమా'' అనిపించేశాయి. ఇరుపక్షాల వాదనలు విని, వాస్తవాలను అంచనా వేసి తీర్పులివ్వాలనే సంగతినే మరిచాయి. ఏకపక్ష తీర్పులు కోర్టుల్లో సైతం నిలబడవనీ, భూ, న్యాయశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఖమ్మం జిల్లా వాసి హైకోర్టులో పిల్ దాఖలు చేయడమే ఇందుకు సాక్ష్యం. ఈ తీర్పులకు రాష్ట్ర బార్‌కౌన్సిల్ సైతం అభ్యంతరం చెప్పింది. రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామనీ, అవినీతి మకిలంతా వదిలిస్తామని చెప్పిన గులాబీ సర్కారు, 135 రెవెన్యూ చట్టాలను 'తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల చట్టం-2020'గా మార్చింది. ధరణి వెబ్‌సైట్‌తో రెవెన్యూ సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని ఆర్భాటంగా ప్రకటించింది. వెబ్‌సైట్ ఏర్పాటయ్యే నాటికి 16వేల కేసులు, తహిసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యునళ్లతో నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని సర్కారు చెప్పిన గడువు కంటే ముందే రెవెన్యూ కోర్టులు తీర్పులిచ్చేసి చేతులు దులుపుకున్నాయి. 26 జిల్లాల్లో ఇప్పుడు అసలు కేసులే లేవనడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఒక నెలలోనే వేలాది కేసులను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు కలెక్టర్లకు ఉన్నప్పుడు, ఇంతకాలం ఆ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ, నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఏర్పాటైన ట్రిబ్యునళ్లు, కొత్త భాష్యం చెప్పాయి. తాజాగా వచ్చిన తీర్పులన్నీ ఏకపక్షమవడం గమనార్హం. ఇందుకు నిదర్శనం ట్రిబ్యునళ్ల తీర్పులపై తిరిగి సివిల్ కోర్టులకు కక్షిదారులు వెళ్లడమే. అంతేగాక ఈ తీర్పులు పాక్షికమని తేలిపోయింది కూడానూ.
రెవెన్యూ కోర్టుల్లో నుంచి కేసులను వదిలించుకోవడమే లక్ష్యంగా ఆఘమేఘాల మీద ఈ తీర్పులొచ్చాయి. ఒక భూసంబంధమైన కేసును తేల్చడానికి కక్షిదారులను పిలవడం, వారి వాదనలు విన్న తర్వాతే జడ్జ్‌మెంట్‌రావాలి. గతంలో లోకాయుక్త, లోక్‌అదాలత్ కూడా ఈ తరహాలోనే చేసేవి. ముందే ఉభయ కక్షిదారులతో సంప్రదింపులు చేసి, వారి మధ్య జరిగిన ఒప్పందం మేరకే తీర్పుచెప్పడం వీటి ప్రత్యేకత. ఈ ట్రిబ్యునళ్ల తీర్పుల్లో దాన్ని పాటించలేదు. లావుణి పట్టా భూములను ప్రభుత్వమే సేకరించదలుచుకున్న కేసులు, అర్హతలేని వాళ్లు కొనుగోళ్లు చేసిన కేసులు, పాసుపుస్తకాల్లో తప్పులు జరిగిన కేసులు, సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వాల్సిన కేసులకు సంబంధించి ఒకే రోజులో తీర్పు ఇవ్వొచ్చా? అది సాధ్యమేనా? ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి, సర్వే చేసి, పొడి చేసి(డిమార్కేషన్), సప్లిమెంటరీ సేత్వార్లు(రికార్డు రిజిష్టర్) ప్రకటించి, పంచనామా ద్వారా రైతులకు అప్పగించాలి. రెవెన్యూశాఖ చేయాల్సిన ఈ పనులు పెండింగ్‌లో పెట్టడం మూలాన ఆ కేసులు కూడా రెవెన్యూ కోర్టుల్లోకి వచ్చేశాయి. వాటినీ ట్రిబ్యునళ్లు త్వరితగతిన పరిష్కరించడం అనుమానించాల్సిందే. సీఎంను సంతృప్తి పరచడానికి కలెక్టర్లు నిబంధనలను తుంగలోతొక్కారు. హడావుడి తీర్పులతో సివిల్ కోర్టులకు పనిపెంచడం, ఆలస్యం చేయడంతోపాటు పేదలపై మరింత ఆర్థికభారాన్ని మోపడమే. ప్రస్తుతం రెవెన్యూ కోర్టుల్లో కేవలం 879 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయట! తీర్పులు న్యాయబద్దమైతే, కక్షిదారుల్లో అసంతృప్తి ఎందుకున్నట్టు? మళ్లీ సివిల్ కోర్టుల బాట పట్టాల్సిన అవసరమేంటి? ఇష్టానుసారం ఇచ్చిన తీర్పులతో వారంతా ఆందోళనకు గురవుతున్నారనేది నూటికినూరుపాళ్లు నిజం.
గ్రామసభ నిర్వహించి ప్రజల కండ్లెదుటే సమస్యలకు చరమగీతం పాడటం ఒక పద్దతి. మోకా పైకి(భూమి మీదకు) వెళ్లి సెటిల్ చేయడం మరో విధానం. రికార్డులను చూసి తీర్పునివ్వడం మూడో తరహాది. ఏ పద్ధతులను అనుసరించి, ఇంత వేగంగా కేసుల్లో తీర్పులిచ్చారో సర్కారే ప్రజలకు జవాబు చెప్పాలి. ఇప్పటికీ రాష్ట్రంలో 15 శాతం సాగు భూములు తగాదాల్లోనే ఉన్నాయి. ఉభయతారకంగా పరిష్కారం కనుగొనాలి తప్ప, పాక్షికంగా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో శాంతి-భద్రతల సమస్య పుట్టుకొస్తుంది. కాగా ఈ కేసుల పరిష్కారం తర్వాత ట్రిబ్యునళ్లు ఉండవనేది సర్కారు షరతు. అప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరగలేక, పేదలు చివరకు భూముల్నే వదులుకునే పరిస్థితి రావచ్చు. అప్పుడు డబ్బున్నోడిదే భూమి అయ్యే ప్రమాదముంది. ధరణితోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేది అభూత కల్పనే. ఈ నేపథ్యంలో సర్కారు తొందరపాటుతో కాకుండా సమస్యలను చట్టబద్దంగా, రికార్డుల ఆధారంగా గ్రామసభల్లో పరిష్కరించడమే ఉచితం. ఇందుకు ట్రిబ్యునళ్లల్లో నిపుణులను నియమించి, శాశ్వత ప్రాతిపదికగా తీర్పులిస్తేనే సర్కారు కొత్త చట్టానికి సార్థకత, ప్రజలకు మేలునూ.