Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాలయ సానువుల్లో గల ఉత్తరాఖండ్‌లో ఆదివారం అకస్మాత్తుగా సంభవించిన జల విలయానికి 18 మంది మత్యువాతపడగా రెండొందలకుపైన గల్లంతయ్యారు. ఒక్కపెట్టున విరుచుకుపడ్డ వరదలకు ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు, ఇళ్లు, కట్టడాలు కొట్టుకుపోవడమో తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. జల విద్యుత్ కేంద్రాలు సైతం నామరూపాల్లేకుండా పోయాయంటే బీభత్స స్థాయి ఏమిటో ఊహించవచ్చు. చమోలీ జిల్లా జోషీమఠ్ సమీపంలోని నందాదేవి హిమానీ నదం నుంచి భారీ మంచు చరియలు ధౌలీగంగ నదిలో పడటంతో ఒక్కసారిగా వరద పోటెత్తి రుషిగంగ, అలకనంద నదులను ముంచెత్తడం జల ప్రళయానికి కారణంగా చెబుతున్నారు. హఠాత్పరిణామానికి ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ కేంద్రం 'తపోవన్'లో పని చేస్తున్న 170 మంది కార్మికులు ప్రవాహంలో చిక్కుకుపోయారు. వంతెనలు, రహదారులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందైంది. సైన్యం, పోలీస్, విపత్తు స్పందన బందాలు సహాయక చర్యలు చేపట్టాయి. షరా మామూలే అన్న విధంగా కేంద్రం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.
పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటే ఎటువంటి విపత్తులొస్తాయో ప్రస్తుత ఉత్తరాఖండ్ అనుభవం మరోసారి పాలకుల కండ్ల ముందుంచింది. రెండు దశాబ్దాల్లో ఉత్తరాఖండ్ పెద్ద ప్రకతి వైపరీత్యాలను ఎదుర్కొంది. 2013లో 'చార్‌ధామ్' యాత్ర మార్గాల్లో వరద బీభత్సం దేశానికే కాదు ప్రపంచానికే పాఠాలు నేర్పింది. అప్పుడు ఏకంగా 5,700 మంది మరణించారు. ఇష్టారీతిన నదులపై నెలకొల్పిన ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులు నదీ ప్రవాహానికి అడ్డుగా మారడంతో నష్టం తీవ్రత ఎక్కువైంది. దేశంలో 2004లో సునామీ తర్వాత అతి పెద్ద ప్రళయం అదే. అంతకుముందు అదే రాష్ట్రంలో ఉత్తర కాశీ, చమోలీలో భారీ భూకంపాలు, మల్పాలో మంచు చరియలు పడ్డ ఘటనల్లో వందల్లో ప్రాణనష్టం సంభవించింది. 2013 విపత్తు అనంతరం కూడా హిమాలయాల్లో వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అన్వేషించి ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేసే వ్యవస్థను నెలకొల్పకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. సునామీ తర్వాత సునామీ సూచనలకు సముద్రతీర ప్రాంతంలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పినప్పుడు, హిమాలయాలపై ఆ విధంగా ఎందుకు నెలకొల్పరు? ఇస్రో వంటి సంస్థలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టాల నివారణకు ఎందుకు ఉపయోగించరు?
భూగోళం వేడెక్కడం వలన హిమాలయాలకు ముప్పు పొంచి ఉందని పలు అధ్యయనాలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. 1975-2000 మధ్య పాతికేండ్లలో హిమాలయాల్లో మంచు కరిగే వేగం కంటే ఆ తర్వాత రెట్టింపైందనేది పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన. ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ పెరిగింది. పర్యవసానంగా మంచు కరగడం ఎక్కువైంది. ఆ నీటితో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడుతున్నాయి. నీటి ప్రవాహం పెరిగినప్పుడు నదులుగా మారుతున్నాయి. మంచు కరగడం వలన చరియలు విరిగిపడుతున్నాయి. భూతాపం తగ్గించేందుకు గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి. పారిశ్రామిక దేశాలు తమ తమ కార్పొరేట్ల లాభాలే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. పర్యావరణ హాని కారకాలను ఇష్టారీతిన ప్రపంచంపై వదులుతున్నాయి. హానికారకాలను వదలొద్దని, అడవులను పెంచాలని తతీయ ప్రపంచ దేశాలకు సూక్తులు చెప్పడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నాయి. పైగా ఇక్కడి సహజ వనరుల విచ్చలవిడి దోపిడీ ద్వారా పర్యావరణానికి హాని తలపెడుతున్నాయి. ఈ విధానానికి ప్రస్తుత భారత ప్రభుత్వం తందాన అంటోంది. ఆసియాలో ఆవరించిన హిమాలయాలు 200 కోట్ల ప్రజలకు జీవాధారంగా నిలిచాయి. వాటిని రక్షించుకోవడం ప్రపంచ బాధ్యత. ఆ విషయంలో భారత్ ముందుండి నాయకత్వం వహించాలి. పర్యావరణాన్ని దెబ్బ తీసే కార్పొరేట్ అనుకూల నయా-ఉదారవాద విధానాలను విడనాడితేనే హిమాలయాలకు, ప్రకతి వనరులకు రక్ష.