Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వనగరంలో వాన విలయతాండవంతో ప్రళయం సృష్టిస్తోంది. కాలనీలన్నీ నీళ్ళతో నిండి ఉన్నాయి. పేదల కండ్లలో కన్నీరు కారుతోంది. నగరం నలువైపుల నీటి దిగ్బంధనం కొనసాగుతున్నది. రహదారులన్నీ గోదారులై నావలు నడుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోలేక ప్రజలు విలపిస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలకు పాలకులు పూనుకోవటం లేదు. అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అప్పుడప్పుడు అధికారులతో చుట్టపు చూపుగా వెళ్ళి ఉచిత సలహాలిస్తున్నారు. పనులకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల భావోద్వేగాలను బ్యాలన్స్ చేస్తున్నారు. భాగ్యనగరం బాధలు ప్రభుత్వానికి పట్టటం లేదు. రాష్ట్ర రాజధానిలో ఇంత జరుగుతున్నా ఏమీ జరగనట్టు వ్యవహరించటం దారుణం. పట్టీ పట్టనట్టు వ్యవహరించడం ఘోరం.
మూసీనది సుడులు తిరుగుతూ వడివడిగా ఉరుకుతున్నది. నాలాలు నోర్లు తెరిచాయిు. కరెంట్ లేక కారు చీకటిలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పురుగుబూషి భయం వెంటాడుతున్నది. ఈ దుస్థితికి కారణం ఎవరు? పాలకుల ముందుచూపు మందగించడం. రాజకీయ నాయకుల అండతో చెరువులను పూడ్చారు. ప్లాట్లు చేశారు, అమ్ముకున్నారు. నగరంలో 530 చెరువులకు 169 మాత్రమే మిగిలాయి. వీటిలో కూడా ఎఫ్‌టిఎల్ పరిధిని మించి నిర్మాణాలను నిరాటంకంగా కట్టుకున్నా బల్దియా పట్టించుకోలేదు. మిగిలిన చెరువుల్లోనైనా పూడిక తీస్తే కొంత వరకు నీళ్ళు చెరువుల్లో చేరి తాత్కాలిక ఉపశమనం దొరికేది. ఆ పని కూడా చేయలేకపోయారు. రెండు సెంటీమీటర్ల వర్షం మాత్రమే తట్టుకునే పరిస్థితి నగరానికి ఉందని నిపుణులు హెచ్చరించినా పాలకులు చెవిన పెట్టకపోవడం విచారకరం. ఒకప్పుడు జంటనగరాలకు జంట చెరువులు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు దాహార్తి తీర్చేవి. కర్మాగారాల కాలుష్యనీరు అందులోకి చేరటంతో ఎందుకూ అక్కరకు రాకుండా పోయిన పరిస్థితి. నీటిశుద్ధి కోసం పాలకుల పథకాలు ఆచరణలో అడుగు ముందుకు వేయకపోవడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. కాలయాపన చేయకుండ నీటిని కాలుష్య కాసారం నుండి వేరు చేయాలి. వరద సమస్యకు నిపుణులు పరిష్కారం చూపినా పరిష్కరించలేదు. నాలాల మీద అక్రమ నిర్మాణాలను తొలగించలేదు. ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని నిర్ణయించారు. సర్వేల మీద సర్వేలు చేశారు. వానాకాలం దాటగానే వదిలేస్తున్నారు. ఆపద వచ్చినప్పుడే ఆలోచిస్తున్నారు. ఇది సరైంది కాదు.
వానలతో నగరం నానుతోంది. గతేడాది నిర్మాణ ప్రమాదాల్లో పదిమంది చనిపోయారు. ఇండ్లు కూలిపోయి ఇప్పుడు చనిపోతున్నారు. వందలాదిగా భవనాల శిథిలదశలో ఉన్నట్టు బల్దియా గుర్తించింది. కురుస్తున్న వరుస వర్షాలకు వారం క్రితం ఇద్దరు చనిపోయారు. కరెంట్ షాక్‌తో మరొకరు చనిపోయారు. సోమవారంనాటి వర్షానికి ఇద్దరు చనిపోయారు. నష్టం జరిగినంక ఆలోచిస్తే లాభం లేదు. పాలకులూ అధికారులూ ముందే ముప్పు గమనించాలి. కూలిపోయే భవనాలలో జీవిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి.
వాననీళ్లు రోడ్లమీదకు రావడంతో ప్రజలు ప్రయాస పడుతున్నారు. నాలుగు గంటల నుండి ఐదు గంటలు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అర్థరాత్రి దాటినా వాహనదారులు ఇండ్లకు చేరుకోలేకపోతున్నారు. నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రయివేటు పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. వర్షానికి రోడ్ల మీద నీళ్ళు నిలవటంతో వాహనాల రాకపోకలకు గుంతలు పడ్డాయి. పైపులైన్ లీకేజీలతో రోడ్లు కొట్టుకు పోయాయి. మంచినీటి పైపులు పగిలిపోయాయి. వర్షపునీరు మంచినీటితో కలిసి నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఫలితంగా జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే నీటి నిలువతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. నీటిని నిలువలేకుండా చూడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. కానీ వారాల కొద్దీ వాననీరు బయటకు పోకపోవటంతో నీటితోనే ముంపు ప్రాంత ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. అంటురోగాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నగరమంతా విషజ్వరాలతో విలవిల్లాడుతున్నది. వాతావరణంలో నెలకొన్న మార్పుల వలన డెంగీ జ్వరాల బెంగ పెరుగుతోంది. స్వైన్‌ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉంది. తాగునీటి కాలుష్యంతో డయేరియా, టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది. పాలకులు ప్రజలకు వర్షాల వలన తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. అంటువ్యాధులను అరికట్టే చర్యలు తీసుకోవాలి. రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించాలి.
విశ్వనగరం అభివృద్ధే మా లక్ష్యమని ప్రకటించిన పాలకులు ప్రకృతి విపత్తులను తట్టుకుని, విలసిల్లేలా చేయాలి. జన జీవనం స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత మరువద్దు. హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షాలపై ఏలికలు పట్టీపట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పస్తులతో పనులు లేక ఇంటి నుండి బయటకు రావటం కష్టంగా ఉంది. వారికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఆదుకోవాలి. అండగా నిలవాలి. ప్రజల కన్నీళ్లు తుడవాలి.