Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి మళ్లీ నిరాశే ఎదురైంది. వానజాడ కనుచూపుమేరలో లేకపోవడంతో రాష్ట్రాన్ని కరువు కబళించబోతుందా అన్న సంకేతాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు, ఇతర మెట్ట ప్రాంతాలు అనావష్టి కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ సంవత్సరం సైతం ఖరీఫ్ మొదలైందో లేదో అప్పుడే ఆయా ప్రాంతాలు వర్షాభావ సమస్యను ఎదుర్కొన్నాయి. తొలకరి సమయంలో కురిసిన కొద్దిపాటి వానలకు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర పంటలు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 18 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉంది. 31 జిల్లాలకు గాను కేవలం నాలుగు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇవి ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగాల గణాంకాలే. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం పంటల విస్తీర్ణంలో వరినాట్లు 56శాతం, ఆహారధాన్యాలు 68శాతం విస్తీర్ణంలో సాగుచేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క పత్తి మాత్రమే వందశాతం సాగైంది. వర్షాలు అనుకున్నస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంలో భయాందోళన నెలకొంది. ఇదే పరిస్థితి మరికొద్దిరోజులుంటే వేసిన పంటలపైనా ఆశలు వదులుకోవాల్సిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలు పడే అవకాశాలు లేవు. సమీప భవష్యత్తులో వానలు పడకపోతాయా సమస్య నుంచి తప్పించుకోకపోతామా అన్న ఆశతో ఆకాశం వంక ఎదురు చూస్తూ రైతులు కూడా అదే పని చేయాలని ప్రభుత్వం అనుకుంటే అంతకంటే బాధ్యతారాహిత్యం మరోటి ఉండదు. ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించాలి ఈ సీజన్‌లో సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సీజన్‌కు ముందే మే నెలలో ప్రకటించడంతో రైతుల్లో ఎక్కడలేని ఆనందం వెల్లివిరిసింది. ఆ సంతోషం వారికి ఎక్కువ రోజులు లేకుండానే ఆవిరైందని చెప్పవచ్చు. జూన్ 1 నుంచి జులై ఆఖరు వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లోనే వంద శాతం వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 42 శాతం, సంగారెడ్డిలో 40, వికారాబాద్‌లో 38, హైదరాబాద్‌లో 33, మేడ్చల్‌లో 33, జోగులాంబ గద్వాలలో 23, నాగర్‌కర్నూలులో 22, మహబూబ్‌నగర్‌లో 20 శాతం తదితర జిల్లాల్లో లోటు ఉంది. మండలాల వారీగా చూస్తే రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షమే కురిసింది. కొన్ని మండలాల్లో కనీసం 50 శాతం వర్షం కూడా పడకపోవడం దుర్భిక్ష పరిస్థితులకు తార్కాణం. అయితే, భారత వాతావరణశాఖ విడుదల చేసిన లెక్కలు దారుణంగా ఉండటం గమనార్హం. వర్షాలు పడుతున్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ రాష్ట్ర, జిల్లా సగటును తీసుకుని సాధారణ వర్షపాతం కన్నా మూడుశాతమే వర్షం తగ్గిందని ప్రకటించడం విడ్డూరం. 12 జిల్లాల్లో నూరుశాతం వర్షాలు కురిశాయని చెప్పారంటేనే వారి వద్ద వర్షపాతం పరికరాలు లేవన్నది తెలుస్తూనే ఉంది. ఇవే లెక్కలను కరువుకు ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయశాఖ వద్ద వర్షపాతం కొలిచే పూర్తిస్థాయి కేంద్రాలు లేవు. మండల కేంద్రంలో వర్షం పడినా దాని చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం చుక్క పడదు. ఒక్కరోజులోనే పడిన వర్షంతో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువపడిందని గుర్తిస్తే జరిగేది అన్యాయమే.
కరువు పట్ల ఈ సర్కారుకు బాధ్యత లేదనడానికి నాలుగేండ్ల పాలనే నిదర్శనం. కేంద్రం నుంచి విడుదలైన నిధులను కరువు జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల పథకానికి, ఇన్‌పుట్ సబ్సీడీ మంజూరుకు, పశువుల మేతకు, తాగునీరు, వలసల నివారణ వంటి పనుల కోసం వెచ్చించాలి. కేవలం 400 కోట్లు ఖర్చు పెట్టి, మిగతా నిధులను దారి మళ్లించి ఇతర వాటికి వాడుకోవడం గమనార్హం. కరువు మండలాలను గుర్తించడంలోనూ ఆలస్యమే. ధనిక రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించడానికి ఈ ప్రభుత్వానికి నా మోషీ. 2014-15లో 360 కరువు మండలాలను గుర్తించినా సకాలంలో కేంద్రానికి పంపలేదు. రైతులు, ప్రతిపక్షాల ఆందోళనల దరిమిలా 2015-16లో 231 మండలాలను ప్రకటించి కేంద్రానికి అందించింది. ఎప్పటికప్పుడు కరువును దాచిపెట్టేందుకు శతవిధాలా యత్నించింది. రుణమాఫీ దెబ్బ కరువు బాధితులపై పడింది. బ్యాంకులు కరువు బాధిత రైతుల రుణాలను రీషెడ్యూలు చేయట్లేదు. దీంతో అప్పుల వాయిదా లేక కొత్త అప్పు పుట్టక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇంకా అప్పులపాలవుతున్నారు. కౌలు రైతుల బాధ వర్ణనాతీతం. పనుల్లేక మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా కరువు సహాయ చర్యలకు ఉపక్రమించాలి. రైతులకు రూ.4వేల ఇచ్చేశాం.. మిగతా కులాలకు ఏదో ఒకటి అందించినందున వర్షాలు పడినా పడకున్నా తమకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకోవడం మానుకుని ఇప్పట్నుండే తక్షణ చర్యలకు దిగడం మంచిది. ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలి. యుద్ధప్రాతిపదికన చిత్తశుద్ధితో ఈ చర్యలు చేపడితే కరువు రహిత రాష్ట్ర సాధన సంకల్పానికి కొంతైనా సార్ధకత ఉంటుంది.