Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రహదారుల నిండా గులాబీ దళాలతో రాజధాని రంగులమయమైంది. సభకు తరలించబడిన జనసంఖ్య ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ సంతృప్తినిచ్చిందో లేదో కానీ అధినేత ప్రసంగం మాత్రం ప్రజలను ఉత్సాహపరచలేకపోయింది. టీఆర్‌ఎస్ నేతలు ఆశించినట్టు ఈ 'ప్రగతి నివేదన' దేశంలో అతిపెద్ద సభగా చరిత్రలో నిలిచిందో లేదో కాని 'ప్రగతి'ని మాత్రం నివేదించలేకపోయింది అంటున్నారు పరిశీలకులు. అది కేవలం ప్రభుత్వ పథకాల ప్రచార సభగా సాగిందనేది విశ్లేషకుల మాట. సభకు ముందు సృష్టించిన హైప్ అంతా ఇంతా కాదు. గత పదిరోజులుగా వరుస సమాలోచనలు, క్యాబినెట్ భేటీలు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలూ సభ పట్ల మీడియా, రాజకీయ వర్గాలు సహా ప్రజలలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొల్పాయి. అభివృద్ధిని నివేదించడంతో పాటు సరికొత్త వరాలజల్లు, శాసనసభరద్దు, ముందస్తు ఎన్నికల వంటి రాజకీయ నిర్ణయాలు ఉంటాయని అంతా ఆశించారు. కానీ అటువంటి నిర్దిష్ట ప్రకటనలేమీ లేకుండానే అట్టహాసంగా ప్రారంభమైన సభ గంటన్నరలోపే సాదాసీదాగా ముగిసింది..!
తెలంగాణ ఆవిర్భావ క్రమాన్ని, ఆ క్రమంలో తన జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ తరువాత తన పథకాలను వివరించడం మీదే కేంద్రీకరించారు. ఆసరా మొదలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా మొదలైన పథకాలన్నింటినీ ఏకరువుపెట్టారు. ప్రసంగం చూస్తుంటే ఒక దశలో 'ప్రగతి' అంటే కేవలం సంక్షేమ పథకాలేనా..!? అనిపించింది. ప్రజా సంక్షేమానికి ఇటువంటి పథకాలను చేపట్టడం అభినందనీయమే. కాని అవి ప్రజల జీవితాలకు తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారాలు కావుకదా..!? అసలు ఏ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడకుండా, స్వయంగా తమ కాళ్లమీద తాము నిలబడగలిగిన స్థితిని ప్రజలకు అందివ్వడం కదా అభివృద్ధి అంటే..!? సమస్యల మూలాలను కనిపెట్టి, వాటిని మౌలికంగా పరిష్కరించి, ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడం కదా 'ప్రగతి' అంటే..!? ఆ ప్రగతికి తోడ్పడే పథకాలను కూడా కొన్ని ఆయన ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఉదాహరణకు దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్రూమ్ ఇండ్లు, నీళ్లూ, నియామకాలు మొదలైనవి. నిజానికి ఇవి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, వారి జీవన ప్రమాణాలను పెంపొందించేవి..!? కానీ వాటి ప్రస్తావనే లేకుండా ఆయన ప్రసంగం సాగడం గమనార్హం..!
భూమి, ఇల్లు దళితుల ఆర్థిక స్థోమతనే కాదు సామాజిక హోదానూ సూచిస్తాయి. అందుకే ముఖ్యమంత్రి వాటిని వాగ్దానం చేశారు కానీ అమలు సంగతే మరిచారు. ప్రభుత్వమే చెపుతున్న లెక్కల ప్రకారం భూపంపిణీకి అర్హమైన కుటుంబాలు 3,50,000 ఉండగా, కేవలం 4,819 కుటుంబాలకు 12,387 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అందుబాటులో భూమిలేదని సాకులు చెపుతున్న సర్కారు భారీ ప్రాజెక్టులు, ఫార్మాసిటీల కోసం మాత్రం వేల ఎకరాలను సమకూరుస్తుండటం విశేషం..! సాగుభూమి లేని ఈ దళిత కుటుంబాలు రైతు బంధు, రైతు బీమాకు కూడా నోచుకోవడం లేదు. ఇక డబుల్‌బెడ్రూమ్ ఇండ్లలో ప్రగతి ఎంత అంటే సముద్రంలో నీటిబొట్టంత..! లబ్దిదారులు లక్షల్లో ఉంటే పని మొదలైన ఇండ్లు వందలు దాటి వేలకు చేరడంలేదు. ఎనిమిదిన్నర లక్షల మందికి డబుల్‌బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి తన ప్రగతి నివేదనలో వీటి మాటే ఎత్తలేదు..! ఉద్యోగాల భర్తీలో దేశ సగటు కన్నా వెనుకబడి ఉండటం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం. రిటైర్మెంట్లతో కలిపి మూడులక్షల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ చెబుతుంటే, 1,07,744 ఖాళీలున్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. రెండున్నరేండ్లలో వీటిని భర్తీ చేస్తానని 2014లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఈ నాలుగేండ్లలో 12,740 ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పిఎస్‌సీ) చెపుతుంటే లక్ష ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. వాస్తవ గణాంకాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి సభలో ఈ ప్రస్తావనే లేకుండా కొత్త జోనల్ వ్యవస్థ గురించి మాట్లాడటం యువతను మభ్యపెట్టడమే. కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్ చేస్తానన్న మాట కూడా మరిచారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారం తరువాత కూడా ఉద్యోగాల కోసం వేచిచూడక తప్పని స్థితిని తెలివిగా దాటవేశారు. కొత్త జోనల్ వ్యవస్థపై ప్రధానితో కొట్లాడి మరీ ఉత్తర్వులు తెప్పించుకున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి ఆ పని మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చేయలేకపోయారో కూడా చెపితే బాగుండేది.
చివరగా శాసనసభ రద్దు, ముందస్తు ఊహాగానాలను ఉటంకిస్తూ, రాష్ట్ర శ్రేయస్సుకు లోబడి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని మంత్రివర్గం, పార్టీ తనకిచ్చిందనీ, ఆ మేరకు త్వరలో రాజకీయ నిర్ణయం ఉంటుందని చెప్పడం కొస మెరుపు. దీనిని బట్టి సభకు ముందున్న రాజకీయ వాతావరణాన్ని యథాతథంగా కొనసాగించడమే కేసీఆర్ వ్యూహంగా అర్థమవుతోంది. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దు, గులాబీలుగా వెలుగుదాం అంటూ మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని, సెంటిమెంట్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేసారు. మళ్లీ ఆశీర్వదించండని కోరుతూ ముందస్తు ఎన్నికల సంకేతాలను అందించారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ ప్రగతిని విస్మరించి పథకాలను ఏకరువు పెట్టింది.