Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నా ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతూనే ఉంది. తమ అధికార బలంతో ఎటువంటి ప్రతికూలతనైనా సానుకూలతగా మార్చుకోగలమన్న బీజేపీ అతివిశ్వాసాన్నీ అహంకారాన్నీ మహారాష్ట్ర పరిస్థితులు గట్టిగానే దెబ్బతీశాయి. గవర్నర్ ఆహ్వానించినా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేని ఈ పరిణామం కమలనాథులకు మింగుడుపడనిదే..! ఈ నేపథ్యంలో రెండవ పెద్ద పార్టీగా గవర్నర్ ఆహ్వానాన్ని అందుకున్న శివసేన ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా జరుగుతున్న పరిణామాలకు వారి పరోక్ష మద్దతునే సూచిస్తున్నది. కేంద్రంలో మంత్రిపదవికి రాజీనామా చేస్తానని శివసేన నేత అరవింద్ సావంత్ ప్రకటించడం ఈ పరిణామాలకు మరింత బలం చేకూర్చింది. ఇంతలోనే గవర్నర్ ఎన్సీపీని ఆహ్వానించి శివసేనకు షాక్ ఇచ్చారు!
పరిణామాలేవైనా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో అడుగడుగునా కనిపిస్తున్నది అనైతికమే! ఇందుకు ప్రధాన కారణం బీజేపీ, శివసేన అధికారదాహమే! ఎన్నికల ముందు ఒకే కూటమిగా ప్రజల ముందుకు వెళ్లినా, అనంతరం విబేధాలతో విడిపోయినా అందుకు ఏకైక ప్రాతిపదిక అధికార కాంక్షే తప్ప విధానాలూ, ప్రజా సమస్యలూ కాదని కండ్లముందరి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్నే కాదు ఓటేసిన ప్రజలనూ అవమానించడమే. ప్రజలను మరిచి పరస్పర నిందారోపణలతో కేవలం పదవి కోసం పోట్లాడుకునే దుస్థితికి దిగజారాయి బీజేపీ శివసేనలు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండేండ్లు పంచుకోవాలనే ఒప్పందం జరిగిందని శివసేన, లేదని బీజేపీ వాదులాడుకుంటున్నాయి. ఈ వాదులాటలో నిజానిజాల మాటెలా ఉన్నా, ఇరువురి ధ్యాసా ప్రజా సమస్యల కంటే ముఖ్యమంత్రి పదవి మీదేనన్నది తేలిపోయింది.
ఇక ఈ ప్రహసనంలో బీజేపీ, శివసేనలకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు కోరిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కూడా.. ఆ తీర్పుకు భిన్నంగా శివసేనతో అధికారం పంచుకోవడానికి ఒకరు, పరోక్ష సహకారానికి మరొకరు సిద్ధపడటం విచారకరం. ప్రభుత్వ ఏర్పాటుకు తాము కలిసి రావాలన్నా, సహకరించాలన్నా మతతత్వ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనీ, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని షరతులు విధించినా.. శివసేన కూడా మత పునాదుల మీదే రాజకీయ మనుగడ సాగిస్తోందన్న సంగతి మరిచిపోవడం వీరికే చెల్లింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. మన ప్రజాస్వామ్యంలో ఓటు కేవలం ఓ సాంకేతిక ప్రక్రియగానే కనిపిస్తుండటం ఓ విషాదం. ప్రభుత్వంలో ఎన్సీపీ చేరినా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్ సహకరించినా, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎన్సీపీకి శివసేన మద్దతు నిచ్చినా నేటి మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మాత్రం ఇదే కావడం వైచిత్రి!
ఈ మొత్తం పరిణామాలన్నిటికీ ఆయా పార్టీల అధికార ప్రయోజనాలే తప్ప ప్రజాసమస్యలు కేంద్రబిందువు కాకపోవడం అన్నిటికీ మించిన 'మహా విషాదం'..! నిజానికిప్పుడు మహారాష్ట్ర ప్రజలనేక సమస్యలెదుర్కొంటున్నారు. ముఖ్యంగా అక్కడ వ్యవసాయం తీవ్రమైన కష్టాల్లో ఉంది. ఆత్మహత్యలూ ఆకలిచావులూ నిత్యకృత్య మైపోయాయి. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్రది. దీనిని ఎలుగెత్తుతూ సాగిన అక్కడి రైతాంగ ఉద్యమాలు దేశానికే మార్గదర్శనం చేశాయి. ఏటా క్రమం తప్పక కరువుతోపాటే, తీవ్ర మంచినీటి ఎద్దడినీ ఎదుర్కొంటున్నారా ప్రజలు. అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య యువత భవితకు ప్రశ్నార్థకంగా మారింది. ఇవి కాకుండా దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం, దిగజారుతున్న పారిశ్రామిక ప్రగతి, క్షీణిస్తున్న సమస్త ఉత్పత్తిరంగాల ప్రభావంతో ప్రజాజీవితం ముందెన్నడూ ఎరుగని సంక్షోభంలో కూరుకు పోతోంది. అయినా ఇవేవీ ఆ రాష్ట్రంలో రాజకీయ ఎజెండాగా మారకపోవడం గమనార్హం. ప్రజలను పక్కదారి పట్టిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ పబ్బం గడుపుకునే విధానాలకూ, అధికారమే పరమావధిగా సాగే పాలకపార్టీల పదవీ వ్యామోహాలకూ ఇదొక పరాకాష్ట!
ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ఎలా ఏర్పాటు చేస్తారన్నది కాదు ప్రశ్న. ఆ ప్రభుత్వ మనుగడ ఏమిటన్నదే ప్రశ్న. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతి తెలుపడానికి సోమవారం రాత్రి 7.30 గంటల వరకూ గడువు విధించారు గవర్నర్. అందుకనుగుణంగానే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తీరికలేని సంప్రదింపులు, సమాలోచనల్లో మునిగితేలుతున్న స్థితిలో.. మరో 24గంటల గడువు కోరింది శివసేన. అందుకు తిరస్కరించిన గవర్నర్ మూడవ పెద్దపార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి 'మహారాజకీయాల'ను మరో మలుపు తిప్పారు! ఎన్సీపీకి 24 గంటల గడువు నిర్దేశించారు. ఇక ఇప్పుడేం జరుగుతుందో వేచి చూడాలి. ఈ పరిస్థితులలో ఏ ప్రభుత్వమైనా ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చుగాక! కానీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో అదొక అవాంఛనీయమైన సందర్భంగానే మిగిలిపోతుంది. విస్మరించబడుతున్న ప్రజల జీవితాలనే ప్రతిబింబిస్తుంది. అన్నిటికీ మించి ఈ దేశంలో వామపక్ష శక్తులు బలపడవల్సిన అవసరాన్నీ అనివార్యతనూ నొక్కి చెపుతోంది.