Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఏలికలు నిజాలను గ్రహించలేకున్నారా? లేక నిజాలను దాచి ప్రజలను మభ్యపెట్టజూస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మాటెలావున్నా.. దేశంలో నిజం మాట్లాడాలంటే మాత్రం ప్రాణాలకు తెగించాలన్న అభిప్రాయాలేర్పడటం శోచనీయం! అవును.. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రాహుల్‌బజాజ్, పార్లమెంటు సభ్యుడూ అధికారపార్టీ ప్రముఖుడూ అయిన సుబ్రమణ్య స్వామి తాజా వ్యాఖ్యల సారమిదే..! ప్రభుత్వాన్ని విమర్శించాలంటేనే ప్రజలు భయపడుతున్నారని రాహుల్ బజాజ్ అంటుండగా, ప్రధానికి చెప్పింది విని తలాడించేవాళ్లే కావాలి.. అందుకే ప్రధాని సలహాదారులు వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకుపోలేక పోతున్నారని సుబ్రమణ్యస్వామి అంటున్నారు.
ప్రజలు భయపడేంతగా మోడీ సర్కార్ విమర్శ సహించలేని స్థితి ఎందుకేర్పడింది? అన్న రాహుల్‌బజాజ్ వ్యాఖ్యలు కండ్లముందరి పరిస్థితులకు దర్పణాలు. పారిశ్రమికవేత్తల కోసం 'ఎకనామిక్స్ టైమ్స్' నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలాసీతారామన్, పీయూష్‌గోయల్ సమక్షంలోనే ఆయనీవ్యాఖ్యలు చేయడం గమనార్హం! నిజమే కదా..! లేదంటే ఆయన చెప్పినట్టు మూకదాడులను అరికట్టడంలో, ప్రజ్ఞాసింగ్ వంటి వారిని కట్టడి చేయడంలో ఇంతటి ఉదాసీనత కొనసాగుతుండేదా? విద్వేషం నిండిన ఉపన్యాసాలతో, రెచ్చగొట్టే ప్రకటనలతో ప్రజల మనసులను విషతుల్యంగావించడం సర్వసాధారణాంశంగా మారిపోయేదా? దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఈ అసహన వాతావరణం.. ప్రశ్నించాలంటే ప్రజలకే కాదు, ప్రముఖలకూ భయాందోళనలు కలిగిస్తోంది. ప్రశ్నించిన నేరానికి ప్రాణాలనే కోల్పోయిన పలువురి హత్యోదంతాలు, వాటిపట్ల ప్రభుత్వ స్పందన, విచారణ తీరుతెన్నులు చెబుతున్నదేమిటి? ఇప్పటి వరకూ జరిగిన మూకదాడుల్లో ఏ ఒక్కరికీ శిక్ష పడకపోవడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యానికి 'ప్రశ్నే' ప్రాణాధారం. నేడు ఆ ప్రశ్నే ప్రమాదంలో ఉంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? ఏలికల స్వభావాలకు భిన్నంగా స్పందిస్తే ఫలితాలెలా ఉంటాయో చెప్పుకోవడానికి ఇంతకంటే ఉదాహరణే ముంటుంది?
రాహుల్‌బజాజ్ వ్యాఖ్యలు రాజకీయ, సామాజికరంగాల్లో పరిస్థితులను వివరిస్తుంటే.. సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ఆర్థికరంగంలో స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి. ''ఆర్థిక సంక్షోభంపై ప్రధానికి వాస్తవ గణాంకాల్ని చెప్పే పరిస్థితే లేదు, ఎందుకంటే ప్రధానికి తాను చెప్పింది విని తలలూపేవాళ్లే కావాలి'' అంటూ 'హఫ్‌పోస్టు ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారాయన. జీడీపీ వృద్ధిరేటు 4.5శాతానికి పడిపోయిందని ఆర్థికశాఖ గణాంకాలు చెపుతుంటే.. అది కూడా నిజం కాదు, మన వృద్ధిరేటు కేవలం 1.5శాతమేనని సుబ్రమణ్య స్వామి చెపుతున్నారు. మన ప్రధానేమో తాము రెండోసారి అధికారంలోకొచ్చిన తొలి ఆరు నెలల్లోనే దేశాభివృద్ధి పరుగులు తీసే నిర్ణయాలు తీసుకున్నామని, 130కోట్లమంది భారతీయుల ఆశీస్సులతో ఏన్డీయే ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ట్విట్టర్‌లో సందేశాల వరద పారిస్తున్నారు. సమస్త భారతీయుల జీవితాల్లో ఉత్తేజం నింపుతున్నామనీ ప్రధాని గొప్పలు పోతుంటే.. ఈ పార్లమెంటు సభ్యుడేమో భారత ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా మారిందంటున్నారు. ఏది నిజం? ఎవరిది నిజం?
ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులే ఆ దేశ స్థితిగతులను ప్రతిబింబిస్తాయి. కానీ మన జీడీపీ వృద్దిరేటు దేశ ప్రగతినే కాదు, ప్రధాని ప్రకటనలనూ వెక్కిరిస్తోంది. భారత ప్రభుత్వం ఈ వారం విడుదల చేసిన గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాన్ని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి. గత త్రైమాసికంలో 5శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ త్రైమాసికానికి 4.5శాతానికి దిగజారింది. సగటున 8 లేదా 9శాతం వృద్ధిరేటును ఆశిస్తున్న దేశంలో ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాకపోగా ఆందోళనకరం.
సరిగ్గా ఆరేండ్ల క్రితం 2013లో నాటి యూపీఏ హయాంలో వృద్ధిరేటు ఇదే స్థాయికి దిగజారినపుడు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పక్షవాతం తెచ్చిందని ప్రచారం చేసి, తాను మాత్రమే దానిని తిరిగి ఆరోగ్యంగా నిలబెట్టగలనని ప్రజలను నమ్మించి అధికారంలోకొచ్చిన మోడీ.. ఇప్పుడు తాను మాత్రం సాధించిందేమిటి? ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ సర్కారు పలు చర్యలు చేపట్టింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, రాయితీలు, రియల్‌ఎస్టేట్‌కు ప్రత్యేకనిధి ఏర్పాటు, బ్యాంకుల విలీనం, ప్రభుత్వరంగసంస్థల ప్రయివేటీకరణవంటివనేకం చేసింది. కానీ జబ్బొకచోటయితే మందొక చోటన్నట్టుగా సాగిన తమ సర్కారు చర్యలేవీ ఈ ఆర్థిక పతనాన్ని అడ్డుకోలేకపోయాయన్న నిజాన్ని ఇంత అనుభవం తరువాత కూడా మోడీ పరివారం గ్రహించకపోవడం మరో విషాదం! నిజాలు గ్రహించరు, చెబితే సహించరు.. ఇదే కదా రాహుల్‌బజాజ్, సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యల అంతరార్థం. నిజానికి ఆర్థిక వ్యవస్థ అనే సైకిల్‌కు పెట్టుబడులు, వినియోగం రెండూ రెండు చక్రాలు. కానీ కోట్లకు అధిపతులైన పెట్టుబడిదారులను నెత్తికెత్తుకుని, వినియోగదారులైన కోట్లాదిమంది ప్రజలను విస్మరించడమే విధానమైనవారు, నిజాల్ని గ్రహించినా ఒప్పుకోరు. ఎదుటివారు గుర్తు చేసినా భరించరు. ఇదే నేడు ఏలివారి రాజకీయం! కాదని ఎవరన్నా అది రాజద్రోహం!!