Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లి ధరలు దేశప్రజలను కన్నీరుపెట్టిస్తున్నాయి. మూడునెలలుగా ఇదే తంతు. పెరగడం తప్ప తగ్గడం లేదు. ముందెన్నడూ లేని స్థాయిలో రోజురోజుకు పెరుగుతుండటంతో ఉల్లి గురించి ఆలోచించేందుకే ప్రజలు భయపడుతున్నారు. ఒకవైపు మహిళలపై లైంగికదాడులతో యావత్‌దేశం ఆందోళనచెందుతుంటే.. మరోవైపు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన ఐదునెలల్లో ఉల్లి ధరలు 253శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. 'ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇలా ధరలు పెరగడానికి అధికంగా కురిసిన వర్షాలు, వరదలే కారణం. మా తప్పు ఏమీ లేదు' అని కేంద్రప్రభుత్వం తమ వైఫల్యాలను ప్రకృతిపై నెట్టడమంటే సమస్యనుంచి పారిపోవడమే. దీనంతటికీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం. ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా లేకపోలేదు. గత సంఘటనల ఆధారంగా ప్రభుత్వాలు సరైన సమయంలో మేల్కొంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నది స్పష్టం.
మామూలుగా ఉల్లి ధర కిలో రూ.15 నుంచి 20కి మించి ఉండదు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.40కు చేరింది. పంట చేతికొచ్చే సమయం కదా అని సరిపెట్టుకున్నా ఆ తర్వాత రూ.60 నుంచి 80, రూ.100కు సైతం ఎగబాకి.. ఇప్పుడు ఏకంగా రూ.150 నుంచి 180కు చేరుకోవడంతో ప్రజలకు ఏడుపొక్కటే తక్కువ. ఇప్పటికే కూరగాయలు, పప్పుదినుసులు, నిత్యావసర వస్తువుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఉపాధి లేక దయనీయమైన పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొస్తున్న సామాన్యులకు ధరలు ఇలా పెరగడం గోరుచుట్టుపై రోకటిపోటు లాంటిదే.
దేశంలో 230 లక్షల టన్నుల ఉల్లి సాగవుతున్నది. అందులో 50 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసినా మిగతాది దేశ అవసరాలకు ఉపయోగపడుతుంది. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట ఎక్కువగా సాగవుతున్నది. ఈ రాష్ట్రాల నుంచే కోటి టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతున్నది. ఏడాదిలో మూడు పంటలుగా రైతులు సాగుచేస్తుంటారు. మొదట అనావృష్టీ, తర్వాత భారీ వర్షాలతో పాటు వరదల వల్ల ఖరీఫ్‌లో రావల్సిన పంట రాలేదు. రెండు మాసాల్లో లేట్ ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుంది. అప్పటిదాకా తిప్పలు పడాల్సిందే. వర్షాలు కురుస్తున్న సెప్టెంబర్ నెలలోనే కేంద్రం స్పందించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఈ స్థాయిలో ఉల్లి ధరలు పెరిగేవి కావు. నెలకు పదిలక్షల టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉండగా, లక్ష టన్నుల ఉల్లిని తేవడం వల్ల అవి ఏ మూలకు సరిపోతాయన్నది ప్రశ్న. ఇందుకు భిన్నంగా పెద్దఎత్తున ఎగుమతులు చేయడం సమస్యను తీవ్రతరం చేసింది. తాత్కాలిక ఉపశమనం ప్రకటనలతో కాలహరణం చేయడం తప్ప ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం కృషి చేయలేదని అర్థమవుతున్నది
కూరగాయలతో పాటు ఉల్లి అస్థిరమైన పంట. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే 24 పంటల్లో కూరగాయలు గానీ, ఉల్లిగానీ లేదు. దిగుబడులు పెరిగినప్పుడు ధర పడిపోయి రైతులు పంట పారబోస్తున్న సందర్భాలు అనేకం. వారికి డబ్బులెక్కువై పంట పారబోయడం లేదు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కడుపు మండి రోడ్లపై పారబోస్తున్నామని పలుసార్లు రైతులు కన్నీంటిపర్యంతమయ్యారు. పంటలు పండకుంటే ప్రజలకు ధర మంట తప్పదు. ఈ రెండు సందర్భాల్లోనూ బ్లాక్ మార్కెట్‌దళారులు లాభం పొందుతున్నారు. పంట పండించిన రైతు నష్టపోతున్నాడు. రైతు నుంచి పంట కొనుగోలు చేసిన బ్లాక్‌మార్కెట్ దళారులు రేటు పెంచి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వాల అండ తోడవ్వడంతో వారు ఆడింది ఆట..పాడిందే పాటగా తయారైంది. తూతూమంత్రపు నిబంధనలు తప్ప అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్న వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
ఉల్లి ధరలతో ప్రజలు ఆందోళన చెందుతుంటే, దీని గురించి పార్లమెంటులో చర్చించి పరిష్కారం చూపించాల్సిన బీజేపీ ప్రభుత్వం సమస్యను తక్కువ చేసి చూపించడం ఎంతవరకు సమంజసం. ప్రధాన ప్రతిపక్షపార్టీ కూడా ఆ దారిలోనే నడవడం విడ్డూరం. తాను ఉల్లిగడ్డ తిననని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం, మరేం తింటారు.. ఆవకోడా (ఓ రకం పండు) ఆరగిస్తారా? అని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించడం.. అసలు సమస్య గురించి మాట్లాడకుండా హాస్యాస్పదమైన చర్చ చేయడం ప్రజలను అవహేళన చేయడమే. ఆర్థికమంత్రి ఏమి తింటారో ఎవరికి కావాలి? కూరలేనప్పుడు పేదలకు ఉల్లిగడ్డలే కూర. ఉల్లికారం ఆధారం. తక్షణం ప్రభుత్వమే చౌకగా ఉల్లిగడ్డలు అమ్మించాలి. అంతేకాదు ఉల్లిసాగుకు ప్రోత్సాహ మివ్వాలి. పంట విస్తీర్ణం పెరిగేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇతర వాణిజ్యపంటలకు ఇచ్చిన సౌకర్యాలను ఉల్లి, కూరగాయ పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. పంటలు నష్టపోయినప్పుడు నష్ట పరిహారం చెల్లించే చర్యలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. దళారులకు కొమ్ముకాయకుండా.. రైతులు ఉల్లిగడ్డ మురిగిపోకుండా డ్రై చేసి నిల్వ ఉంచుకోవటానికి అవసరమైన సాంకేతిక సౌకర్యం, గిడ్డంగులు ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలి.