Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పందించే హృదయాలకు
సమాధి కట్టడం
జ్వలించే ఆలోచనలకు
చెదపట్టించడం - ఎవడి తరమూ కాదని నిరూపిస్తున్న మన దేశ ప్రజలకు వందనం చెప్పుకుందాం. కలిగినోళ్ల వ్యాపార వృద్ధికోసం సహకరించే చదువే తాము చదువుతున్నా, బోధిస్తున్నా తమలో ఇంకా మానవ విలువలు మంటకలువలేదని, ప్రజల ఎడల బాధ్యత అడుగంటి పోలేదనీ నిరూపించారు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ విద్యార్థులు, అధ్యాపకులు. కళాశాల ప్రాంగణంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా నిరోధించేందుకు 144 సెక్షన్ విధించి, నలుగురుకి మించి గుమికూడకూడదని నిషేధాజ్ఞలు విధించడాన్ని నిరసిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించ కూడదనడాన్ని నిరసిస్తూ ఖాళీ తెల్ల కాగితాలను, చెప్పులను తమ ప్రతినిధులుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆ చెప్పులపై పూలు ఉంచి తమ నిరసన తెలిపారు. ''అజ్ఞానం గద్దెమీద ఉన్నప్పుడు విజ్ఞానం ఇలాగే చేస్తుంది'' అంటూ నినదించారు.
ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గత నెలరోజులుగా ప్రజానీకం, ముఖ్యంగా విద్యార్థిలోకం నిరసనలు హౌరెత్తిస్తున్నది. ప్రజల సమస్యలపై అంతగా స్పందించరని పేరున్న ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు సైతం, ఎవ్వరూ ఊహించని విధంగా నిరసన కార్యక్రమాలలో ముందుండడం విద్యార్థి ఉద్యమాలలో సరికొత్త కోణం. మేధోనిలయాలైన విద్యాసంస్థల విద్యార్థుల నిరసనలు కూడా వినూత్నంగా సాగుతున్నాయి. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులు తమ చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని సామూహికంగా 'రాజ్యాంగ పీఠిక' పఠనం చేశారు. పూణేలోని ఫిల్మ్ - టెలివిజన్ సంస్థ, బరోడా సామాజీరావ్ విశ్వవిద్యాలయ లలిత కళల విభాగం, ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లతోపాటు దేశం నలుమూలలా విద్యార్థిలోకం ఉత్తుంగ తరంగమై ఉరకలెత్తుతూ ఉంది. అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఆసు) నిరసనలకు జడచి సాక్షాత్తూ ప్రధాన మంత్రి తన అసోం పర్యటనను రెండు సార్లు వాయిదా వేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసోంలో ఇప్పుడు తమ సొంత పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించలేక పోతున్నారు. ఇక, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి చైతన్యానికి చుక్కానిగా నిలుస్తూ ఉంది. తనపై హత్యాయత్నం జరిగి, తల పగిలి నెత్తురు కారుతున్నా ఏమాత్రం చలించకుండా తాము ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ధైర్యంగా చెబుతోన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ను కోట్లాది విద్యార్థులు ఆదర్శంగా తీసుకుం టున్నారు. తమ సామాజిక బాధ్యతలను సగర్వంగా నిర్వహిస్తున్నారు.
విద్యార్థి ఉద్యమాలను చూసి వెన్నులో వణుకు పుట్టిన పాలకులు 'విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు?' అని వింతగా ప్రశ్నిస్తున్నారు. పచ్చి అబద్ధాలు, పరస్పర విరుద్ధాలు మాట్లాడడంలో ఆరితేరిన కమల నాయకులు ఒక వైపు తమ పార్టీకి అనుబంధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ని నడుపుతూ తిరిగి అదే నోటితో విద్యార్థులకు రాజకీయాలు ఎందుకని మాట్లాడడాన్ని యావత్ విద్యార్థిలోకం ఈసడించుకుంటూ ఉంది. కమలనాథుల దృష్టిలో విద్యార్థులకు రాజకీయాలు ఉండకూడదు. ఉన్నా అవి తమ రాజకీయాలే అయి ఉండాలి. తమకు వ్యతిరేక రాజకీయాలను వారు భరించలేరు. కాబట్టే తమ వ్యతిరేక రాజకీయాలు కలిగిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. అప్పటికీ కసితీరక అంతమొందించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. గౌరీలంకేశ్ లాంటి వారి హత్యలు ఈ కోవకు చెందినవే. తమకున్న మూక బలాన్ని చూసి విర్రవీగుతూ, తాము ఏం చేసినా చెల్లిపోతుందని, తమకు అడ్డు చెప్పేవారు, తమను అడ్డగించేవారు ఎవ్వరూ లేరన్న ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు గంగవెర్రులెత్తిస్తున్నాయి. వారు కనీసం కలలోనైనా ఊహించని వ్యతిరేకత వ్యక్తమవ్వడాన్ని భరించలేకపోతున్నారు. తాము ఊహించని వైపుల నుంచి వ్యక్తమవుతూ ఉన్న వ్యతిరేకత అదుపు చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అన్నివర్గాల ప్రజల ముఖ్యంగా మేధో జీవుల తిరస్కారాన్ని నిజంగా కమలనాథులు ఊహించి లేరు. వారే కాదు ఎవ్వరూ ఊహించని ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారిగా ఈ దేశాన్ని కమ్మేసింది. యువత నిర్జీవమైనదని, మేధోరంగం తమ వ్యక్తిగతానికి మాత్రమే పరిమితమైందనీ నిట్టూర్పులు విడుస్తున్నవారి వొళ్ళు జలదరించేలా చేసింది. ప్రజలు కట్టబెట్టిన అధికారంతో కండ్లు నెత్తికెక్కి పొగరుగా ప్రజా వ్యతరేక నిర్ణయాలు తీసుకుంటే తాము చూస్తూ ఉండమనీ, నిగ్గదీసి ప్రశ్నించి మీ మెడలు వంచుతామనీ ప్రజలు చేస్తున్న హెచ్చరికను ఇప్పటికీ పెడచెవిన పెడుతున్నారు పాలకులు. తాము తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకోకుండా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. పాలకులు ఇలాగే ఉంటే వారిని ఏ విధంగా దారికి తేవాలో ప్రజలకి తెలుసు. ప్రజల ఆగ్రహానికి గురైన ఏ ప్రభుత్వమూ మన జాలదు కదా!