Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహమ్మారి కరోనా
కనిపించని మహా శత్రువే కావచ్చు, కానీ
అది కబళిస్తున్నది మనిషిని కదా
మన కండ్ల ముందటి మన మనిషిని కదా
మనిషిని మనం ఎలా చూస్తున్నామన్నది ప్రశ్న
చూడాల్సిన విధంగా ఎందుకు
చూడలేకపోతున్నామన్నది ప్రశ్న
ఈ ప్రశ్నకు సమాధానం మన దృక్పథంలో ఉంది!
మానవ సమాజం ఎన్నో మహాసంక్షోభాలను ఎదుర్కొంది, ఆ ఎదుర్కొనే క్రమంలోనే ముందుకు సాగుతూ ఉంది. ఇకపై సాగబోతుంది. ప్రకృతి మనిషికి ఎప్పుడూ సమాధానాన్ని సిద్ధంగా ఉంచదు. సమాధానాన్ని కనిపెట్టమని సవాల్ విసురుతుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి కూడా అంతే. అవును! మనిషికి ప్రకృతి విసిరిన మహాసవాల్ కరోనా. కాబట్టే ప్రపంచంలోని ప్రతి మనిషీ అతలాకుతలమైపోతున్నాడు. అట్టుడికిపోతున్నాడు. రేపటి సూర్యోదయంపై భరోసా కోసం పెనుగులాడుతున్నాడు.
ప్రజల సామూహిక సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత వ్యక్తుల మీదకన్నా వ్యవస్థ మీదే అధికంగా ఉంటుంది. ఆ వ్యవస్థను నడిపించే ప్రభుత్వాల మీదే ఉంటుంది. ప్రజలకు ఆపద ముంచుకొచ్చినప్పుడు అమాంతం ఆ ఆపదకు అడ్డుపడి దాన్నుంచి ప్రజలను వొడ్డున వేయాల్సిన కర్తవ్యం సర్కారు తన నెత్తికెత్తుకోవాల్సి ఉంది. అందుకే ప్రతి సామూహిక ఆపద సమయంలోనూ ప్రజలు ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తారు. అనివార్యంగా చూస్తారు. అమ్మలా తమను ఆదరిస్తుందన్న నమ్మకంతో నివేదించుకుంటారు. ఇప్పుడూ ప్రజలు అదే చేస్తున్నారు. ముంచుకొస్తున్న కరోనాతో పాటు, మా అంతు చూస్తానంటున్న ఆకలి గురించి కూడా ఆలోచించమంటున్నారు. దాని అంతు చూడమంటున్నారు. లేకుంటే తాము అంతమైపోక తప్పదని వేడుకుంటున్నారు. అయినా, కేంద్ర పాలకులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తాము రాజకీయాలను వీడమంటున్నారు. ఆపత్కాలంలో ప్రజలకు నమ్మకం, ధైర్యం కల్పించడమే అతిముఖ్యమని తెలిసికూడా, రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీలను కలుపుకుని, మీకు మేమున్నామన్న భరోసా ప్రజలకు ఇవ్వలేక పోతున్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలూ లేకుండా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలు మరింత సంకటంలో పడిపోయారు. దేశంలో 39కోట్లమంది అసంఘటితరంగ కార్మికులు ఉన్న నేపథ్యంలో సరైన పంపిణీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ప్రకటించే ప్రతి సహాయ కార్యక్రమం ప్రజల మధ్య భౌతిక దూరాన్ని తగ్గించి కరోనా మహమ్మారికి మరింత దగ్గర చేస్తుందన్న ఇంగితం ప్రదర్శించలేక పోతున్నారు. ప్రజలు గుమిగూడే అవసరం లేకుండా వారి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తమదేనన్న విషయాన్ని దాటవేస్తున్నారు. ఫలితంగా, ప్రజలు తమ నిత్యావసరాలకోసం సామూహికంగా గుమికూడి మృత్యువును ఆహ్వానిస్తున్న విషాద ఘటనలను మనం నిత్యం కోకొల్లలుగా చూస్తున్నాం. చాలీచాలని ప్యాకేజీని ఆలస్యంగా ప్రకటించి చేతులు దులుపుకోవాలను కోవడం కేంద్ర పాలకుల దుర్నీతికి నిదర్శనం.
కరోనాను నివారించడంలో 1. భౌతిక దూరం 2. పౌష్టిక ఆహారం అత్యంత కీలకమనీ, భౌతిక దూరాన్ని పాటించి, పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే ఆ మహమ్మారిని కట్టడి చేయవచ్చునని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. కరోనాను నిరోదించడంలో గొప్ప విజయం సాధించిన చైనా దేశం, కేరళ రాష్ట్రాల అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. నిజానికి, మహమ్మారిని నిరోధించగల చర్యలు ఏమంత కష్టమైనవీ, ఏమాత్రం పాటించలేనివీ కాదు. అయితే ఇందుకు పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల బాధ్యత, ప్రేమ ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టే చైనా, కేరళలు విజయం సాధించగలుగుతున్నాయి. లేవుకాబట్టే నిన్నటి వరకూ తాము తిరుగులేని బలసంపన్నులమని విర్రవీగిన అమెరికా లాంటి దేశాలు కండ్లు తేలేస్తున్నాయి.
భౌతికంగా ఒకరికొకరు దగ్గరగా వస్తే మీ ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తున్నా, తమ ప్రాణాలకు తెగించి ఎందుకు ఆ నియమాన్ని ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు కారణం ప్రజల ఆకలి. ప్రభుత్వ అసమర్థత. చైనాలో, కేరళలో మిగిలిన చోట్లలా ప్రజలు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల కోసం గుంపులు గుంపులుగా ఎగబడలేదు. ఎందుకంటే అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. అవసరమైన వారికి సమయానికి వారి ఇంటి గడప ముందే సరుకులు, మందులు అందించగల యంత్రాంగం ఉంది. అందుకే వారు నిశ్చింతగా ఇండ్లలోనే ఉండిపోగలిగారు. గలుగుతున్నారు. ఇంటి వద్దకే పౌష్టిక ఆహారం, మందులు వస్తున్నాయి కాబట్టి, తమకు అదనంగా దొరికిన విశ్రాంతి సమయంలో రోగ నిరోధకశక్తిని మరింతగా పెంచుకుని ఆ మహమ్మారిని తరిమిగొట్ట గలుగుతున్నారు. ఇంతకు మించి ఇందులో ఏ మాయామర్మం, అతీత శక్తుల ప్రమేయం లేదు. ఈ సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. తమ చేతిలో వనరులు తక్కువ ఉన్నా ఉన్నంతలో ప్రజల ఎడల భాధ్యతగా స్పందిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల స్థాయిలో కూడా కేంద్ర పాలకులు స్పందించకపోవడం దారుణం. ఇప్పటికైనా కేంద్ర పాలకులు కండ్లు తెరవాలి. పేద, మధ్యతరగతి ప్రజలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి. యావత్ దేశ ప్రజలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇచ్చిన ''భౌతిక దూరం- సామాజిక ఐక్యత'' అన్న నినాదాన్ని తక్షణం అందుకోవాలి.