Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే మనది ఆకలి దేశం. ఆపై అలవిగాని నిరుద్యోగం. వీటికి తోడు ఇప్పుడు కోట్లాది ఉపాధి అవకాశాలను తుడచిపెట్టేస్తోన్న కరోనా సునామి. మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు కాదు, వెన్ను విరిగిన చీమపై మిన్ను విరిగి పడ్డట్టు తయారయ్యింది పరిస్థితి. 2016 పెద్దనోట్ల రద్దు తర్వాత వేగంగా పరుగుతీసిన ఆర్థిక పతనం కారణంగా దేశంలో గత ఏడాదికి నిరుద్యోగం 45సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈ కరోనా కాటుతో ఉద్యోగ కల్పన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. శృతి మించుతోన్న నిరుద్యోగం కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తీవ్ర సామాజిక సమస్యగా పరిణమిస్తూ పోతోంది. సెప్టెంబర్ 2018 నాటికి 31 మిలియన్ల (3 కోట్లా 10 లక్షలు) మంది నిరుద్యోగులు ఉన్నారన్నది భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అంచనా. కాగా, ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 9 (ఐఎల్‌ఓ) సర్వే ప్రకారం 2018-19 నాటికి భారత దేశంలో నిరుద్యోగిత రేటు 3.5శాతం ఉండగా, మార్చి 2020 నాటికి భారత దేశ కార్మిక శక్తి 43.3కోట్లకు పెరుగుతుందని, నిరుద్యోగిత రేటు 9శాతం పెరుగుతుందనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ(సీఎంఐఈ) ప్రకటించింది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడిదారీ అనుకూల, శ్రామిక వ్యతిరేక విధానాల కారణంగా నిరుద్యోగం దేశంలో తారాస్థాయికి చేరుకుంటూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంది. ఈ సంక్షోభ సమయంలోనే ఇప్పుడు మహమ్మారి కరోనా విరుచుకుపడింది. దీంతో, నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) ప్రకారం వ్యవసాయేతర రంగంలోనే 136 మిలియన్ల (13.6 కోట్లు) ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. నెలవారీ జీతం, రాత పూర్వక ఒప్పదం లేకుండా, గ్రామీణ, అనధికార (అసంఘటిత) రంగాలలో ఉపాధి పొందుతున్న వారు 93శాతం మంది ఉన్న మన దేశంలో, కార్మికులు ఇప్పుడు నిరుద్యోగ సునామిలో చిక్కుకుపోయారు. సమీప కాలంలో ప్రజల కొనుగోలుశక్తి పెరిగే అవకాశమే లేకపోవడంతో, ఉత్పత్తి, నిర్మాణం, సేవా రంగాలు కుదేలైపోయి ఉపాధి కల్పన ఎండమావిగా మారబోతోంది. మరో వైపు దేశంలో శ్రామికశక్తి సంవత్సరానికి 80లక్షలు పెరుగుతూ ఉంది. ఉపాధి అవసరం ఉన్న వారికి పని కల్పించేందుకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అవసరమవుతాయి. 1918 నాటి స్పానిష్ ఫ్లూ వల్ల అధిక ప్రాణనష్టం జరిగింది. (నాటి ప్రపంచ జనాభాలో దాదాపు 2శాతం ప్రజలు చనిపోయారు) నేటి కరోనా మహమ్మారి కారణంగా ప్రాణ నష్టం కన్నా ఆర్థిక నష్టం అంచనాలకు అందనంతగా జరుగుతుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధులు కోల్పోయిన ప్రజలు ఆకలి కారణంగా అశువులు బాసే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదం మన దేశ ప్రజలకు మరింత అధికంగా ఉంటుందన్నది నిర్వివాదం.
ఇప్పటి వరకూ ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కరోనా సంక్షోభం ముగిసిన అనంతరం కూడా తిరిగి కాపాడుకోవడం, రోజుకు వేలల్లో తయారవుతుతోన్న శ్రామికశక్తికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం - ఇవీ ఇప్పుడు మనం దేశం ముందున్న పెను సవాళ్ళు. ఈ సవాళ్ళను ఎదుర్కొని ప్రజలను ఆకలి దప్పుల నుంచీ, ప్రాణ గండం నుంచీ కాపాడడం కేవలం పాలకులకు, అందునా కేంద్రానికి మాత్రమే సాథ్యం. అయితే కేంద్రంలోని కాషాయ పాలకులకు ఆ ధ్యాసే లేకుండా ఉంది. వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, ప్రజల ఎడల కనీస చిత్తశుద్ధినీ, బాధ్యతనూ ప్రదర్శించడం లేదు నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు. ఇందుకు సాక్ష్యం జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2016 పెద్ద నోట్లరద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ-ఉపాధి పరిస్థితులపై నిర్వహించిన సర్వే రిపోర్టును మోడీ సర్కారు 2017-2018 సంవత్సరంలో అధికారికంగా విడుదల చేయకుండా ఏకంగా తిరస్కరించడం. అయితే, ఆ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక ఎలాగోలా బహిర్గతమై రాబోవు రోజుల్లో దేశాన్ని కబళింబోయే నిరుద్యోగ రక్కసిని కండ్లకు కట్టింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని ప్రజల భవిషత్‌ను కాపాడమని ప్రజలూ, ప్రతిపక్షాలూ, మేథావులూ ఎంతగా మొత్తుకున్నా మోడీ సర్కారు పెడచెవినపెట్టి, రోజురోజుకూ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. తీవ్రమైన ఉపాధిలేమి సమస్యకు ఇప్పడు అగ్నికి ఆజ్యంలా కరోనా మహమ్మారి తోడయ్యింది.
ఈ క్లిష్ట సమయంలో కమలనాథుల చేతిలోని కేంద్ర సర్కారు నుంచి మనం మానవీయ స్పందనను ఆశించడం ఎండమావిలో నీళ్ళ కోసం దేవులాడడమే అవుతుంది. పేదల ఆకలి, అజ్ఞానం, అనైక్యతలే తమ ఆధిపత్యానికి పునాదులగా భావించే పాలకులు ప్రజలు తిరగబడి తమ పునాదులు పెకలిస్తారని భయపడితే తప్ప తమ తీరు మార్చుకోవడం అసంభవం. కాబట్టి, ఇప్పుడు కావల్సింది పాలకులను వేడుకోవడం కాదు. ప్రజలను మేల్కొల్పడం. మేల్కొన్న ప్రజలు మాత్రమే ప్రజల సమ్యలపై దృష్టిసారించడాన్ని పాలకులకు తప్పసరి చేయగలరు.