Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ దేశ ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లాక్‌డౌన్ మార్గాన్ని ఎంచుకున్నామని ప్రభుత్వం చెప్పినా.. ఆ తర్వాత పరిణామాలను కూడా అంచనావేసి ప్రణాళికలు రూపొందించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. ఫలితంగా ఇప్పుడు ప్రజలకు బతుకు భద్రత కరువైంది. ఉత్పత్తిరంగం ఆగిపోవడంతో రోజురోజుకు ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా కోట్ల ఉద్యోగాలు మాయమవు తున్నాయి. గతంలో 2008లో ఆర్థికమాంద్యం వచ్చినా మనదేశంలో అంతగా ప్రభావం చూపించలేదు. కానీ ఆ సమస్య నుంచి దేశం బయటపడుతుందని అనుకున్న క్రమంలో ఇటీవల మళ్లీ ఆర్థికమాంద్యం పడగవిప్పింది. ఉత్పత్తిరంగం దెబ్బతిన్నది. కొనుగోళ్లు నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా తయారైంది. వృద్ధిరేటు పడిపోయింది. ఐటీ, సర్వీసురంగం బాగా దెబ్బతిన్నది. అమ్మకాలు లేవన్న సాకుతో ప్రయివేటు సంస్థలు ఉద్యోగులను కుదించుకున్నాయి. లక్షలమంది రోడ్డునపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, అందరికీ ఎలా పని కల్పించవచ్చో ఎంతోమంది ఆర్థికవేత్తలు, వామపక్షపార్టీలు సూచనలు చేసినా ఆరేండ్ల పాటు మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసింది. కార్పొరేట్లకు, కంపెనీలకు, పరిశ్రమలకు వివిధ రూపాల్లో కోట్ల రూపాయలు కట్టబెట్టడం కోసం చూపించిన చొరవ.. ప్రజలకు ఉపాధి కల్పించడంలో వీసమెత్తయినా చూపలేదు. దీనంతటికీ మోడీ సర్కార్ అనుసరించిన ఉదారవాద విధానాలే కారణం. రోజురోజుకు మాంద్యం తీవ్రరూపం దాల్చి పీల్చిపిప్పి చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ రావడం మరింత అథఃపాతాళంలోకి నెట్టేసిందని చెప్పవచ్చు. దీనిని అవకాశంగా తీసుకుని తన తప్పులన్నిటినీ మోడీ కరోనా వైరస్‌పై నెట్టేసేందుకు ప్రయత్నించడం దారుణం. ప్రాణాలు నిలుపుకునేందుకు లాక్‌డౌన్ కావాలన్న కేంద్రం.. ప్రజల జీవనవిధానం ఎలా గడుస్తుందన్న దానిపై ఆలోచించడం లేదు.
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి నెలరోజుల్లో దేశంలో సుమారు 14కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా చేపట్టిన ఓ సర్వేలో వెలువరించింది. దేశ కార్మికశక్తిలో 30శాతం మంది ఉపాధి లేక ఇండ్లవద్దే ఉంటున్నారని తెలిపింది. ముందస్తు సన్నద్ధత లేకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌తో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. టెక్స్‌టైల్ రంగంలో 25లక్షల మందికి పని లేదు. ఉపాధిహామీ పథకం చట్టం కింద పనులు కల్పించడం లేదు. ఈ పథకం కింద 13కోట్లమంది 45 పనిదినాల చొప్పున కోల్పోయారు. ఇక రోజూవారీ కూలీల గురించి చెప్పేదేముంది? ఇప్పటికీ వేలాది మంది వలసకూలీలు.. ఎండలను సైతం లెక్కచేయకుండా సొంతూర్లకు పయనమవుతుండటం, తిండిదొరక్క కొన్నిచోట్ల ఆకలికి అలమటిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. లాక్‌డౌన్‌తో కరోనా వైరస్ ఎంతమేర కట్టడి అయ్యేందో గానీ.., ఆర్థిక, ఉపాధి రంగాలు మాత్రం తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్ మున్ముందు కూడా కొనసాగుతుందని సంకేతాలు స్పష్టంగా ఉన్నందున ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారన్నది అంతుపట్టని ప్రశ్నగానే మిగలనుంది.
లాభార్జనే ముఖ్యమని భావించే పెట్టుబడిదారీ వర్గానికి ఇలాంటి సమయం బాగా ఉపయోగపడింది. ఆర్థికమాంద్యంతో గతంలో కొన్నిరంగాల్లోనే ఉద్యోగాల్లో కోతపెట్టిన సంస్థలు, లాక్‌డౌన్‌తో అన్ని రంగాల్లోనూ తొలగింపుల్లో వేగం పెంచాయి. ఇప్పట్లో లౌక్‌డౌన్ ఎత్తేసి అవకాశం లేకపోవడం, ఆ తర్వాత తెరుచుకున్నా కొనుగోళ్లు ఉండవన్న అభిప్రాయంతో ఉద్యోగులను ఇంటికి పంపుతున్నారు. ఎవరినీ తొలగించొద్దనీ, జీతాల్లో కోత పెట్టడానికి వీల్లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలున్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వాలే తమ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతుంటే ఇక ప్రయివేటు కంపెనీలకు అడ్డేముంది! కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కూడా ప్రజల్లో ఏ మాత్రం భరోసానివ్వలేదు. లౌక్‌డౌన్ అనంతరం ఇప్పటిదాకా నాలుగుసార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్, మరో నాలుగుసార్లు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. ప్రజల బతుకుదెరువు గురించి గానీ, ఆర్థికవ్యవస్థ పటిష్టతకు గానీ ఏ చర్యలూ ప్రకటించలేదు. నిధులివ్వమని, మినహాయింపు లివ్వాలని రాష్ట్రాలు కోరినా చెవికెక్కించుకున్నదెక్కడీ ఇలా అయితే ఆర్థికవ్యవస్థ పట్టాలెక్కేదెప్పుడు? ప్రపంచంలో మొదటగా కరోనా వైరస్‌తో దెబ్బతిన్న చైనా నుంచి ఈ విషయంలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. వైరస్‌ను కట్టడి చేయడమే గాక, ఆర్థిక వ్యవస్థను సత్వరమే పట్టాలపైకి ఎక్కించింది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపెడుతున్నది. ఇప్పటికే ఆరేండ్లుగా అనేక ఇబ్బందులతో మన దేశప్రజానీకం సతమతమవుతున్నది. కరోనావైరస్‌తో మరింత ఆందోళనగా ఉన్న ప్రజల్లో భరోసా నింపాల్సిన తక్షణ కర్తవ్యం మోడీ ప్రభుత్వంపైనే ఉంది. ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.