Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేస్తూ మంత్రి కేటీఆర్, ఇదివరకటిలా జీవితం ఉండబోదనీ, కరోనా ముందు, కరోనా తర్వాత అనే పరిస్థితి వస్తుందనీ చెప్పుకొచ్చారు. పరిపాలకులుగా ప్రజలను సర్వధా కాపాడాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందనే సంగతిని గుర్తెరగాల్సిన సమయమిది.
కరోనా వైరస్ నిరుపేదలు, వలసకూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజల పాలిట నిజంగా మహమ్మారే అయింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి పనులు నిలిచిపోవడం, కుటుంబాలకు దూరంగా వేల కిలోమీటర్ల ఆవల ఉండాల్సి రావడం కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. అన్ని జబ్బులకు పెన్సిలినే మందు అన్న తరహాలో కరోనా నివారణకు లాక్‌డౌన్ ఒక్కటే సర్వరోగనివారిణిగా ప్రభుత్వాలు ప్రధానంగా కేంద్రం భావిస్తున్నది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తమవుతున్నాయి. నెలన్నర రోజులుగా సమాజంలోని 90 శాతంగా ఉన్న పేదలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల ఉపశమన చర్యలు అంతంతేకావడంతో ఆయా తరగతుల్లో అసంతృప్తి, ఆవేదన అధికమవుతున్నది. కట్టుబట్టలతో వచ్చి, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో బతుకీడ్చడం, వారికి మహాకష్టంగా మారింది. ఇదే ఆందోళనకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ఘటనే ఇందుకు సాక్ష్యం. నిర్మాణ పనుల్లో అక్కడ ఆయా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ఐఐటీ భవనం పనులను కాంట్రాక్టుకు చేపట్టింది. వారికి వేతనాలను సైతం ఇవ్వకుండా కొంతకాలంగా వేధిస్తున్నది. దీనికితోడు స్వస్థలాలకు పంపాలన్న తమ కోరికను స్థానిక అధికారులూ మన్నించకపోవడంతో, వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుని తిరుగుబాటుకు దారితీసింది. ఈ తరుణంలో చేసేదిలేక, నిస్సహాయ పరిస్థితుల్లోనే వలసకూలీలు తమ అసహనాన్ని ప్రదర్శించారు. వలస కార్మికులు రాష్ట్రంలో ఆరు లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరంతా పశ్చిమబంగా, ఉత్తరప్రదేశ్, ఒడిషా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పనుల కోసం వలసొచ్చిన వారే. పుండుమీద కారం చల్లినట్టు పనుల్లేక అల్లాడుతున్న వలస కూలీలకు, లాక్‌డౌన్ పెద్ద ఆటంకమే అయింది. కాగా, ఇంటి అద్దెలు చెల్లించాలంటూ యజమానులు చేస్తున్న ఒత్తిడి, మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. వీరి కోసం ఆయా చోట్ల ఫంక్షన్ హాళ్లను రిలీఫ్ క్యాంపులుగా మార్చాలని కేంద్ర కార్మిక సంఘం సీఐటీయూ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే నడుస్తున్న క్యాంపుల్లో కూలీల పట్ల వ్యవహరించే విధానం అమానవీయంగా ఉంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు పనులుచేయిస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రపంచం లోని దేశాల్లోకెల్లా అతి తక్కువ ప్యాకేజీని తెచ్చింది. కరోనా వైరస్‌ను మహా విపత్తుగా ఐక్యరాజ్యసమితి(యూఎన్‌వో), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ప్రకటించాయి. ఆ మేరకు మార్గదర్శకాలనూ విడుదల చేశాయి. విపత్తు సమయాల్లో ఆయా దేశాలు, తమ జీడీపీల్లో నుంచి కనీసంగా 10శాతం నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ, మన కేంద్ర ప్రభుత్వం ఒక్క శాతం కూడా కేటాయించకపోవడం దారుణం. ఇదిలావుండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 చొప్పున నగదును అందజేసినట్టు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఇంకా చాలా మందికి ఇవి అందలేదనే కఠిన వాస్తవాలను కూడా అవి బయటపెట్టాయి. ఇటుక తయారీ, గ్రానైట్, రైస్ మిల్లులు, వ్యవసాయ, భవన నిర్మాణ, విద్యుత్ పనులు, ఎరువుల కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీరంతా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనులు బంద్ కావడం వారి ఉపాధిని దెబ్బతీసింది. కరోనాను నిలువరించడం, ప్రజలను కాపాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర విధానమంటూ లేకపోవడం, లాక్‌డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయ పరిష్కారమన్నట్టుగా రెండూ ముందుకు పోతుండటం గమనార్హం. ఈ విపత్తు పరిష్కారానికి నిధులు అత్యంత కీలకం. వీటిని కేంద్రం మెడలు వంచి తీసుకురావడంలో రాష్ట్రం మీనమేషాలు లెక్కబెడుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసమే గులాబీ సర్కార్, కేంద్రాన్ని నిలదీసి సాయాన్ని రాబట్టడంలో వెనుకాడుతున్నదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా చికిత్సల విషయానికొచ్చినప్పుడు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలుకునోచుకోవడం లేదు. పరీక్షించు, గుర్తించు, చికిత్సచేయి ( టెస్ట్, ట్రేస్, ట్రిట్) విధానాన్ని గాలికొదిలేశారు. విరివిగా పరీక్షలు చేయకపోతే వైరస్ విస్తరణ ప్రమాదకరస్థాయిలో ఉంటుందనేది ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల అనుభవాలు చెప్పకనే చెప్పేశాయి. మన పక్కనున్న మహారాష్ట్రది కూడా అదే దుస్థితి. రాష్ట్ర పాలకులు మాత్రం ఈ టెస్ట్‌లు ఎవరికి పడితే వాళ్లకు చేసేవి కాదనీ, లక్షణాలున్న వారికి మాత్రమే చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్నవారికి కూడా విస్త్రృతంగా పరీక్షలు చేయడం ద్వారా కరోనాను విస్తరించకుండా అడ్డుకోవాల్సిన తరుణమిది. వీటికీ నిధులు భారీగానే అవసరం. ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేస్తూ మంత్రి కేటీఆర్, ఇదివరకటిలా జీవితం ఉండబోదనీ, కరోనా ముందు, కరోనా తర్వాత అనే పరిస్థితి వస్తుందనీ చెప్పుకొచ్చారు. పరిపాలకులుగా ప్రజలను సర్వధా కాపాడాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందనే సంగతిని గుర్తెరగాల్సిన సమయమిది.