Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు
పర్వతం ఎవడికీ వొంగి సలాం చెయ్యదు..'' ఈ పలుకులు కార్మికోద్యమం వెయ్యేనుగుల బలంతో ముందుకు సాగిన రోజుల అడుగు జాడలు. పెట్టుబడితో జరిగే యుద్ధంలో తరాజు 'అటు' మొగ్గడం తాత్కాలికమేనైనా నేడది ఒక నిజం. మన దేశంలో మోడీ సింహాసనాధీశుడైందే దానికి. యంత్రమే తన శత్రువనుకుని యంత్ర విధ్వంసం చేసి ఉరికంబాలెక్కిన బ్రిటన్ కార్మికుల త్యాగానికి వెలగట్టగలమా? సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉందన్న తెలివిడి ఎరుకలోకి వచ్చినాక ప్రపంచ కార్మికోద్యమం రాజ్యాధికారం కోసం తన మందుగుండు దట్టించింది. ప్యారిస్‌లో 71రోజులే అధికారంలో వున్న శైశవ కార్మిక రాజ్యాన్ని ఫ్రెంచి పాలకులు రక్తపుటేరుల్లో ముంచారు. ప్యారిస్‌లో జరిగిన తప్పులు సరిచేసుకుంటూ, రైతాంగాన్ని తన సందిట నిలుపుకుంటూ ''లెనిన్ తపస్సు, స్టాలిన్ సేద్యం జ్వలించిన, ఫలించిన, సమజ్వల తేజం!'' సోవియట్ యూనియన్ 1917లో ఆవిర్భవించింది. ఆ ప్రయోగమూ 74ఏండ్లే నిలిచింది.
రాజ్యాధికారం దక్కించుకోడానికి, దక్కిన దాన్ని నిలబెట్టుకోడానికి అనన్య సామాన్యమైన త్యాగాలు చేసింది కార్మికోద్యమం. నేడు మనమున్న పెట్టుబడిదారీ సమాజం, మనకు దృగ్గోచరమైన పెట్టుబడిదారి సమాజం 400యేండ్ల నుంచి ఒకే విధంగాలేదు. ఆధునిక ''ప్రజా స్వామ్యానికి తల్లి''గా పిలువబడే ఇంగ్లండ్‌లో 1838-1848 మధ్య ఉధృతంగా ''చార్టిస్టు ఉద్యమం'' సాగిన తర్వాత గాని ఆస్తితో సంబంధం లేకుండా రాలేదు సార్వత్రిక ఓటు హక్కు. దాదాపు వందేండ్లు పోరాడిన తర్వాతనే (1840-1920) అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. నీగ్రో మగవారి ఓటు హక్కు కోసం 1870లో అమెరికాలో అంతర్యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇదీ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం ''వర్థిల్లిన'' తీరు.
ఈ నేపథ్యంలో 1886లో పనిగంటల తగ్గింపు కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం గురించి జ్ఞాపకం చేసుకునే రోజు ఇది. కార్మికోద్యమంలో ''హేమార్కెట్'' ఘటన కార్మికులకు పాఠం చెప్పడం కోసం సృష్టించబడింది. నమ్మకంలేని వాళ్ళు ఆనాటి ఈ కేసు లాయర్ గ్రిన్నెల్ జడ్జీల ధర్మాసనానికి చేసిన విజ్ఞప్తి వినండి. ''అమెరికాలో నేడు చట్టం విచారణలో ఉంది. అరాచకత్వం విచారణలో ఉంది. ఈ మనుషుల్ని ధర్మాసనం ఎంపిక చేసిందెందుకంటే వీరు ఆ ఉద్యమానికి నాయకులు. వేలాది మంది వీరి అనుయాయులకు ఒక పాఠంలా ఉండాలంటే, మన వ్యవస్థను కాపాడాలంటే వీరందర్నీ ఉరి తీయండి!''
చివరికి ''అమెరికన్ వ్యవస్థను కాపాడ్డాని''కి నలుగుర్ని ఉరితీశారు. ఉరితీసే ముందురోజు లూయీస్ లింగ్ జైల్లో తల పేలిపోయి ఆత్మహత్య'' చేసుకున్నాడు. మరో నలుగురిని ఆ తర్వాత మరో జడ్జి విడుదల చేశారు. 8 గంటల పని దినం కార్మికవర్గ విశ్వవ్యాపిత నినాదమైంది. 8 గంటల ప్రాధాన్యాన్ని చెపుతూ కార్ల్ మార్క్స్ ''పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం పని గంటల్ని అంతకంటే పెంచితే కార్మికుల శ్రమశక్తి క్షీణతనే గాక దాని నైతిక, భౌతిక శక్తుల్ని కూడా దోచుకుంటుంది. శ్రమశక్తి ముందే అలసిపోయేలా చేసి దాని నాశనానికే దారితీస్తుంది.'' (పెట్టుబడి గ్రంథంలో). మనదేశంలో తరాజు అటు మొగ్గడం అంటే ముందుగా బలౌతున్నది 8గంటల పనిదినమే! ఆవురావురుమంటున్న పెట్టుబడిదార్లకు ఆరేండ్ల మోడీ పాలనలో విశృంఖలాధి కారాలు బంగారుపళ్ళెంలో పెట్టి అందించ బడుతున్నాయి. 12 గంటల పనిదినం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు.
ఎన్నో చూడక్కర్లేదు. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంటు అమలు కోసం మోడీ ప్రభుత్వం పడుతున్న తొందర చూడండి. ఇండిస్టియల్ ఎంప్లాయిమెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం (1946) రూల్స్‌ను సవరిస్తూ ''సీజనల్'' అనే సాకుతో దుస్తుల తయారీ పరిశ్రమలో ఫిక్స్‌డ్ టర్మ్ ఉపాధిని 2016లో ప్రవేశపెట్టారు. 2018లో ''దుస్తుల తయారీ'', ''సీజనల్'' అనే రెండుమాటల్ని తొలగిస్తూ అన్ని రంగాల్లోని పరిశ్రమలకు దాన్ని విస్తరించారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రవేశపెడుతూ ఇప్పటిదాక రూల్స్‌లో వున్న దాన్ని చట్టంలోకే తెచ్చేశారు. శాస్వత ఉద్యోగాల్ని చంపేసి యజమానుల ఇష్టారాజ్యానికి తలుపులు బార్లా తెరవడం కాకమరేంటి?
''పరిశ్రమ'' నిర్వచనంలో నుంచి దాతృత్వ సంస్థలు, ధార్మిక సంస్థలు, సంఘసేవా సంస్థల్ని మినహాయించడం, ఇంటిపని వారలను కూడా మినహాయించడంతో పాటు రక్షణ పరిశోధనా, అణుశక్తి, ఇస్రో మొదలైన వాటి గురించి చప్పుడు చేయకపోవడం లక్షలాది మంది కార్మికులకు నష్టం చేసే చర్య. వేజ్‌కోడ్ 'చట్టం' అవతారమెత్తేసింది. మిగతా 3కోడ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్టుబడిదార్ల అవసరాల రీత్యా ప్రాధాన్యతా క్రమంలో మోడీసాబ్ బండి తోలుతున్నట్టున్నాడు. ఐఆర్ కోడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన దశ దాటింది.
ఈ మేడే సందర్భంగా దేశంలో పేట్రేగుతున్న మతోన్మాదం, కులోన్మాదాలు మన ప్రజల మధ్య నిలువు గోడలు నిర్మిస్తున్నాయి. ఏ నిలువు గోడలైతే లేని నూతన భారతావనిలోకి నన్ను నడిపించమని రవీంద్రనాథ్ ఠాగూర్ కోరుకున్నాడో ఆ గోడలే నేడు నిలు స్తూన్నాయి. గతించిన తరం త్యాగల స్మరణే నేడు చాలదు. ప్రస్తుత తరం నడవాల్సిన బాట కష్టజీవుల్ని నడపాల్సినబాట తెలుసుకోవాలి. సివి సుబ్బా రావు చెప్పినట్టు ''జనం భూమిలో సంఘాలు నాటడం నేర్చుకోవాలి.''