Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంతటి విపత్తులోనూ మహమ్మారితో తలపడుతున్న డాక్టర్లూ, పోలీసులూ, వైద్య, పారిశుధ్య సిబ్బందితో పాటు 130కోట్ల భారతీయుల ప్రాణాలను గాలికొదిలి, కలవారి సేవలో తరిస్తున్నవారి పూలవానల వెనుక మాయోపాయాలను గుర్తించనంత కాలం మనం మోసపోతూనే ఉంటాం
ఆకాశం నుంచి పువ్వులు రాలడం ఎంత అద్భుత దృశ్యం..! అవి మహమ్మారిపై యోధుల్లా పోరాడుతున్న వారిని అభినందించడం ఎంతటి అపురూపమైన సందర్భం..!! ఆదివారంనాడు కరోనా ఆస్పత్రులపై దేశవ్యాపితంగా మన సాయుధ బలగాలు హెలికాప్టర్ల ద్వారా కురిపించిన పూలవాన కనువిందు చేసింది. ఆ పూలజల్లులో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులు తడిసి ముద్దయ్యారు. నిజంగా ఈ అభినందనల పుష్పాభిషేకం ప్రశంసనీయం..! అయితే ఆదివారం వచ్చిందంటే ప్రధాని ఏం చెపుతారో, ఏం చేస్తారోనని కొంతమంది ఆసక్తిగా, ఎంతో మంది ఆశగా ఎదురుచూడటం అలవాటుగా మారిన కరోనా కాలంలో.. ఎందుకోగానీ ఈసారి ఆ ఆశ, ఆసక్తి రెండూ సన్నగిల్లినట్టుగానే కనిపించాయి. అందుకేనేమో కొంత అసంతృప్తి, కొన్ని విమర్శలకు తోడు ''పగలనకా రేయనకా తమ ప్రాణాలను పణంగాపెట్టి రోగులకు సేవలందిస్తున్నవారికి ఒక్కపూట పూలతో ట్రిబ్యూట్ ఇస్తే తప్పేమిటి?'' అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
నిజమే కదా..! నమ్మకాలూ విశ్వాసాలూ వమ్మయిపోయిన వేళ.. కాపాడుతారనుకున్న దేవుండ్లూ, ఆ దేవుని ప్రతినిధులమని చెప్పుకునే స్వామిజీలు, మౌల్వీలు, ఫాదర్‌లూ ముఖం చాటేసిన వేళ.. ''మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటె నిలిచియుండును'' అన్న గురజాడ మాటలకు ప్రతీకలుగా ప్రజలకు భరోసానిస్తున్న డాక్టర్లకూ, ఇతర వైద్య సిబ్బందికీ, పోలీసులూ, పారిశుధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువే. అందుకే ఈ పుష్పాంజిలి వారికి అపూర్వ నీరాజనమనడంలో సందేహం లేదు. కానీ అదొక్కటే సరిపోదు కదా..! చేయాల్సింది చేయకుండా ఈ సంకేత, సంఘీభావ చర్యలకే పరిమితమవడం సమంజసమనిపించుకోదు కదా! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ మహమ్మారిపై యుద్ధంలో తలపడుతున్నవారికి అందుకవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలు అందించకుండా.. కేవలం చప్పట్లు, దీపాలు, పూలవానలతో సరిపెడితే యుద్ధం గెలవగలమా..!? నిజానికి వారు కోరుతున్నదేమిటి? ముఖానికి ఎన్95 మాస్కులడుగుతున్నారు. చేతులకు నాణ్యమైన తొడుగులగుతున్నారు. తగినన్ని పీపీఈ కిట్‌లు అడుగుతున్నారు. కావాల్సిన వెంటిలేటర్లూ, శానిటేషన్ వనరులూ సమకూర్చమంటున్నారు. తాము విధులు నిర్వహించే చోట కొంత భద్రతా, కాసింత సౌకర్యమూ ఆశిస్తున్నారు. పరికరాల్లోనూ, పరిసరాల్లోనూ అరకొర ఏర్పాట్లతో తాము పడుతున్న అవస్థలను గుర్తించమంటున్నారు. పూలతో అభినందనలు కురిపించిన చేతులతోనే ఈ అవసరాలు కూడా తీరిస్తే బాగుంటుంది కదా..!
ఇదే సైన్యాన్ని విశ్వాసంలోకి తీసుకుంటే యుద్ధప్రాతిపదికన అవసరమైన పరికరాలను తయారుచేసి అందించే సాంకేతిక సామర్థ్యం మన రక్షణ వ్యవస్థకు ఉన్నది. ఇదే సైన్యాన్ని ఆదేశిస్తే వేల మైళ్ళ ఆకలియాత్రలు సాగిస్తున్న, శిబిరాల్లో అవస్థలు పడుతున్న లక్షలాది వలసజీవులకు తక్షణసేవలందించగలిగిన అంకితభావం మన ఆర్మీకి ఉంది. కఠోరమైన పరిస్థితుల్లో కూడా సరుకులను, మనుషులను తరలించగలిగిన ప్రతిభాపాటవాలు మన సైన్యానివి. సరిహద్దుల్లో యుద్ధం చేసి మాత్రమే కాదు, దేశంలో అనేక విలయాలూ, విపత్తుల నుంచీ ప్రజలను కాపాడుకోగలిగిన అపారమైన అనుభవమూ వారి సొంతం. ఇంతటి సైనిక శక్తిని కేవలం పూలవానకు మాత్రమే ఉపయోగించడం ప్రభుత్వ ఆలోచనల స్థాయికి అద్దం పడుతోంది.
కఠిన ఆంక్షల మధ్య కూడా కరోనా విజృంభిస్తున్న జాడలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే పరిస్థితులు కాస్త ఊరట కలిగిస్తున్నా.. ఇంకా పరిమితులను అధిగమించని పరీక్షలు, వేగం పుంజుకుంటున్న కేసులు ఆందోళనే కలిగిస్తున్నాయి. ఈ ఆదివారం ఒక్కరోజే 2487 కేసులు నమోదు కాగా, 83 మరణాలు సంభవించడం ఇందుకొక ఉదాహరణ. ఈ ఉధృతి ఇలాగే కొనసాగి పరిస్థితి విషమిస్తే మన డాక్టర్లూ చాలరు, ఆస్పత్రులూ చాలవన్నది మన నేతలకు తెలియనిదేమీ కాదు. అయినా అందుకు తగిన అప్రమత్తతా, ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు అసంఖ్యాలైన వలసజీవుల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ చక్రబంధంలో చిక్కిన నలభైరోజుల తరువాతగానీ వారి ఆక్రందనలు ఏలికల చెవికెక్కలేదు. వారిని స్వస్థలాలకు తరలించడానికి శ్రామికరైళ్ళను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ ప్రయాణభారాన్ని ఆ నిరుపేదలమీదనే మోపడం అమానవీయం. విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలను ఉచితంగా క్షణాల్లో విమానాల్లో తరలించిన ప్రభుత్వ పెద్దలు, తమకు ఓటేసి ఎన్నుకున్న ప్రజలను మాత్రం చార్జీలు చెల్లించాల్సిందేనని చెప్పడం వారు ఎవరి పక్షమో, ఎవరి ప్రయోజనాల కోసమో స్పష్టంగానే చెబుతున్నది. కరోనా బారినుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి అనేక దేశాలు తమ జీడీపీలో దాదాపు 10శాతం నిధులను కేటాయించగా, మన ప్రభుత్వం మాత్రం ఒక్కశాతానికి మించని కేటాయింపులతో సరిపెట్టడం కూడా దీనినే సూచిస్తున్నది.
ఈ మహమ్మారి దెబ్బకు ఉపాధి కరువై, బతుకు బరువై విలవిలలాడుతున్న కోటానుకోట్ల ప్రజలకు లక్షా డెబ్భైవేల కోట్లకు మించి ఇవ్వడానికి చేతులురానివారు.. బ్యాంకులకు పంగనామాలు పెట్టి ప్రజల డబ్బును స్వాహాచేసిన పిడికెడు మంది బడాబాబులకు మాత్రం సుమారు 68వేల కోట్ల బాకీలు మాఫీలు చేశారు. ఇంతటి విపత్తులోనూ మహమ్మారితో తలపడుతున్న డాక్టర్లూ, పోలీసులూ, వైద్య, పారిశుధ్య సిబ్బందితో పాటు 130కోట్ల భారతీయుల ప్రాణాలను గాలికొదిలి, కలవారి సేవలో తరిస్తున్నవారి పూలవానల వెనుక మాయోపాయాలను గుర్తించనంత కాలం మనం మోసపోతూనే ఉంటాం.