Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాలు ఆర్థికంగా చెప్పలేనంత ఇబ్బందులకు గురవుతున్నమాట వాస్తవం. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పటివరకు పైసా విదల్చకుండా పెత్తనం చేస్తున్న కేంద్రాన్ని నిలదీసి నిధులు రాబట్టుకోవాలి. కానీ ఆ ప్రయత్నమేదీ చేయకుండా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలనుకోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.
తెలంగాణలోనూ బార్లు బార్లా తెరుచుకున్నాయి. రాత్రి ముఖ్యమంత్రి ప్రకటించారో లేదో తెల్లవారే సరికల్లా జనం బారులు తీరారు. ఆరడుగుల భౌతికదూరం, ముఖానికి మాస్కులు తప్పనిసరి అన్న నియమాలన్నీ గాలికి కొట్టుకుపోగా.. ఏ లక్ష్యంతో లాక్‌డౌన్‌ను పొడిగించారో ఆ లక్ష్యం నిలువునా నీరుగారి పోయింది. దీనికి హేతువు కేంద్రం ఇచ్చిన అనుమతి. కట్టడి ప్రాంతాల్లో తప్ప అన్ని జోన్లలోను మద్యం అమ్ముకోవచ్చునంటూ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును రాష్ట్రాలు ఆబగా అందిపుచ్చు కుంటున్నాయి. నిన్నటిదాకా ప్రజల ప్రాణాలే ముఖ్యం తప్ప ప్రభుత్వానికి ఆదాయాలు కాదని వల్లించిన నేతల లోగుట్టంత ఈ చర్యలతో బట్టబయలవుతోంది. ఖజానా నింపుకునే ప్రయత్నంలో, ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ చర్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో భౌతికదూరం పాటించాల్సి ఉన్నది. వైరస్ వ్యాప్తి నివారణలో ఇదొక తప్పక పాటించాల్సిన నియమం. కానీ వైన్‌షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఎగబడటం మనం చూస్తున్నాం. దీని ద్వారా మళ్లీ కరోనా వ్యాపించవచ్చు. భౌతికదూరం కోసమే ఇప్పటివరకు అనేక పద్ధతుల్లో ఆచరణలో పెట్టిన ఆంక్షలన్నీ నేడు ఒక్కసారిగా ఆవిరైపోతున్నాయి. దీనిద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇస్తున్నట్టు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ప్రజలు తూచా తప్పకుండా పాటించారు తప్ప మద్యం దుకాణాలు తెరవండని కోరలేదు. ప్రజలు నిగ్రహం పాటించారు. కాని ప్రభుత్వం తన నిగ్రహాన్ని కోల్పోయి మద్యం దుకాణాలను తెరిచింది. ఇంతటి కష్టకాలంలోనూ ప్రభుత్వాలు మద్యాన్ని ఓ ఆదాయ వనరుగానే చూస్తున్నాయి తప్ప, ప్రస్తుత పరిస్థితులలోదానిని అరికట్టడం అవసరమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాయి.
కరోనాను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి మనుషులకు ఎంతో అవసరం. అది వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ మద్యం వలన రోగనిరోధక శక్తి క్షీణించి కరోనా సోకే అవకాశాలు మరింతగా పెరిగిపోతాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంలేదు. మాస్కులు ఉంటేనే మద్యం ఇస్తామని అంటున్నారు. ప్రతి షాపు ముందు జాతరలా వచ్చి పడుతున్న జనంలో ఎవ్వరికి మాస్కు ఉందో, ఎవరికి లేదో పట్టించుకునే నాథుడెవరు..? కట్టడి ప్రాంతాలు మినహా దాదాపు రాష్ట్రమంతటా షాపులు తెరుచుకోవడంతో ప్రజలు మద్యం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీనితో భౌతికదూరం అనేది వట్టిమాటగానే మిగిలిపోయే పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 10శాతం ప్యాకేజీ విడుదల చేసి రాష్ట్రాలకు జీఎస్‌టీ ద్వారా రావాల్సిన బకాయి ఈ సందర్భంలో ఇచ్చి ఉంటే రాష్ట్రాలకు కొంతలో కొంత వెసులుబాటు కలిగి ఉండేది. ఇవి కల్పించి మద్యం జోలికి పోకుండా కేంద్రం రాష్ట్రాలను ఆపకలిగి ఉండేది. కేంద్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి పైసా ఇవ్వకుండా రాష్ట్రాల పట్ల వాళ్ళ బాధ వాళ్ళు పడనీ అనే ధోరణితో ఉండటం సరికాదు. ఇది ఒక యుద్ధ సమయం లాంటిది. దీనికి కొన్ని అసాధారణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం దీనికి సిద్ధం కావడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ప్రధాన ఆదాయం భూముల రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్రేషన్‌లు. అవి ఇప్పుడు జరగనందున ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే మార్గాలు ఎండిపోయినట్టు అయింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన అంశమే.. అందుకే ఇది యుద్ధ సమయం లాంటిదని పోల్చాల్సి వస్తున్నది. ప్రతినెల ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రతి రాష్ట్రానికి వర్తించే అంశమే. అందుకని కేంద్ర ప్రభుత్వం పూనుకుని చేయ గలిగినంత చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆ సృహ కనబడటం లేదు.
మద్యం లేనందున లాక్‌డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలు, గృహహింస, పలు రకాల నేరాలు బాగా తగ్గాయి. మరలా మద్యం పారితే పాత రోజులు పునరావృతం అవుతాయన్న ఆందోళనలు కూడా వెలువడుతుండటం గమనార్హం. పైగా ప్రజలను లాక్‌డౌన్ నిబంధనలను పాటించేలా చూడటం, అదుపు చేయడం మరింత జఠిలం అవుతుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనైనా మద్యం అమ్మకాలను నిలిపివేయడం ప్రభుత్వానికి శ్రేయస్కరం.
ఆంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల మహిళలు మద్యంతో బాధపడ్డ రోజులు గుర్తుచేసుకుని దుకాణాల ముందుచేరి ధర్నాలు చేసి షాపులను మూయించారని తెలుస్తున్నది. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల ప్రాణాలకంటే డబ్బే ముఖ్యం కావడం సమంజసం కాదు. రాష్ట్రాలు ఆర్థికంగా చెప్పలేనంత ఇబ్బందులకు గురవుతున్నమాట వాస్తవం. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పటివరకు పైసా విదల్చకుండా పెత్తనం చేస్తున్న కేంద్రాన్ని నిలదీసి నిధులు రాబట్టుకోవాలి. కానీ ఆ ప్రయత్నమేదీ చేయకుండా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలనుకోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.