Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక దేశాల్లో చేస్తున్నట్టు ప్రభుత్వం పరిశ్రమలకు ఏ సాయమూ చేయకుండా ''ప్లీజ్! మీరంతా కార్మికులకు జీతాలివ్వండి'' అని చేతులు దులుపుకుంటే ఏ కంపెనీ జీతాలివ్వదు. ఇవ్వట్లేదు కూడాను! ఇంత సంక్షోభం మధ్య కూడా కొత్త పార్లమెంటు భవన సముదాయానికి మోడీ ప్రభుత్వం ఇరవైవేల కోట్ల ఆడంబరమైన ప్రణాళిక ప్రకటించింది. సాధారణ సమయాల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలు ఓట్లు రాల్చవచ్చు గాని సంక్షోభాల్లో కాదు.
త్యాగయ్య కీర్తన గురించి కాదు.. వేటూరి సుందర్రామ్మూర్తి చేసిన దాని రూపాంతరం గురించి అంతకన్నా కాదు.. మోడీ అండ్ కో పెట్టుబడి సేవలో పునీతమై తరిస్తున్న తీరు గురించి! గడియారం ముళ్ళను దాదాపు వందేండ్లు వెనక్కి తిప్పిన విషయం గురించి! కరోనా చాటున ధనస్వామ్యం చేస్తున్న వికటాట్టహాసం గురించి! కోవిడ్-19 మాటున కార్మికోద్య మానికి విసిరిన సవాలు గురించి!
నేడు సరళీకృత ఆర్థిక విధానాల ముసుగు వేగంగా తొలగిపోతోంది. కోరలు కనపడు తున్నాయి. చారలూ కనపడు తున్నాయి. ''సంకుచిత జాతీయ తత్వం పేరున వర్గపాలన దాక్కొనే అవకాశం లేదు. అన్ని జాతీయ ప్రభుత్వాలు కార్మికవర్గానికి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి'' (కార్లమార్క్స్ - ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం). 1871లో మార్క్స్ రాసిన ఆ మాటలు 150 ఏండ్లకు కూడా ఎంత స్పష్టంగా కనపడుతున్నాయి. గత 30ఏండ్లుగా ఏదైతే జరుగుతుందని వర్గ చైతన్యమున్న కార్మికోద్యమం మనదేశ కార్మికుల్ని హెచ్చరిస్తూ ఉందో నేడది నిజమవుతోంది.
2014 నుంచి మోడీసాబ్. కార్మికచట్టాలను సవరించే పని రాష్ట్రాల మూపుకి ఎత్తాడు. ఆ రకంగా ఉస్కాయించబడ్డ రాజస్థాన్ రాణి విజయరాజే అమలు చేసిన కార్మిక సవరణలు అపకీర్తి మూటగట్టుకుని చివరికి ఆమె ప్రభుత్వాన్నే కాటేసాయి.
పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన ఆనాడు చెప్పిన సాకు. ఇప్పుడు కరోనా సాకు అదనంగా దొరికింది. వరసగా యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖాండ్, హర్యాణ మొదలైనవి ఆదారిలోనే ఉన్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలంటే పెట్టుబడిదార్లకు సౌకర్యాలు కల్పించాలట! రాయితీ లివ్వాలట! అంటే కార్మిక చట్టాలనన్నిటిని రద్దుచేసి బానిస యుగంలోకి కార్మికుల్ని నడిపిస్తారేమో!
పెద్ద పారిశ్రామిక రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ గద్దెనెక్కిందే పెట్టుబడికి కాంగ్రెస్ కంటే సేవ చేయగల మొనగాడుగా నిలబడ్డానికి! ఒక జీఓ ద్వారా 8గంటల పని దినాన్ని 12గంటలు, వారానికి 48గంటల నుంచి 72గంటలకు పెంచి పడేసింది. తనిఖీలుండవట.. యజమానులు రిజిష్టర్ మెయిన్‌టెయిన్ చేయక్కర్లేదట.. చివరికి కొత్త కంపెనీలో యజమానులు ఫ్యాక్టరీల్లో వెంటిలేటర్లు కూడా పెట్టక్కర్లేదట. కార్మికులకు టాయిలెట్‌గాని, ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లు గాని, కనీసం కూర్చునే స్థలం కూడా చూపించనక్కర్లేదట. మధ్యలో విశ్రాంతిగాని, వారాంతపు సెలవుగాని ఇవ్వక్కర్లేదట! బహుశా శివరాజ్‌సింగ్ చౌహాన్ పుట్టిందే పెట్టుబడిదార్ల సేవకన్నట్టే వుందికదూ! దేశంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన నిరుద్యోగాన్ని ఈ పనిగంటల పెంపుదల మరింత సంక్లిష్టం చేస్తుంది. సాధారణ గణితశాస్త్ర లెక్కలు కూడా వేయకపోవడం బీజేపీ నేతల పెట్టుబడి యాచక బుద్ధికి నిదర్శనం.
ఉత్తరప్రదేశ్‌లో దాదాపు అన్ని చట్టాల నుంచి మూడేండ్లు మినహాయింపులిచ్చేశారు. ఉత్తరప్రదేశ్ టెంపరరీ ఎక్పంప్షన్ ఫ్రమ్ సర్టెన్ లేబర్ లాస్ ఆర్డినెన్స్ (2020) ద్వారా అన్ని ఫ్యాక్టరీలు, సంస్థలకు మూడేండ్లు మినహాయింపు ఇచ్చేశారు. నాలుగు చట్టాలు తప్ప మిగిలిన అన్నింటిని అమల్లో లేకుండా చేశారు. లేబర్ కోర్టులుగాని, కార్మికశాఖగాని ఏ వివాదంలో జోక్యం చేసుకోకుండా నివారించారు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ కె.ఆర్. శ్యాంసుందర్ ''కార్మిక సంబంధాలు అతి పెళుసుగా ఉండాలనే వారు సైతం సిగ్గుతో తలదించుకునేలా ఈ యూపీ సవరణలున్నాయ''ని రాశారు.
యూపీతో సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మార్కెట్ చట్ట (మండియాక్ట్) సవరణలు కీలకంగా చేశారు. రైతులనుంచి ప్రయివేటు వ్యక్తులు పంటల సేకరణ చేస్తారనేది ఆ సవరణ. ప్రయివేట్ కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రయివేటు వేర్‌హౌస్‌లకు వచ్చిన వ్యవసాయోత్పత్తులు ప్రభుత్వం సేకరించినట్టేనట (ప్రొక్యూర్‌మెంట్). అంటే యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఒకవైపు మైనారిటీలను వేటాడుతూనే, దానివల్ల వచ్చే ఓట్ల పంట కోసుకుంటూనే ఆగ్రి బిజినెస్ సంస్థలకు అంత పెద్ద రాష్ట్ర వ్యవసాయాన్ని ఏ విధంగా అప్పగించేస్తోందో తెలుసుకునేందుకు ఇదో మచ్చుతునక.
చైనా వదిలేసుకున్న వ్యాపారమంతా మనదేశం సంపాదించుకోవడానికే ఇదంతాననేది మరో కొత్త పల్లవి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు. దాని ఫలితమే మనదేశమైనా, చైనా అయినా ఎగుమతులకు ఇబ్బంది పడుతున్నాయి. పులిమీద పుట్రలాగా ఇప్పుడు ఈ కరోనా సంక్షోభం. వూహాన్ తప్ప చైనా లాక్‌డౌన్ విధించలేదు. వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదీలేదు. ప్రపంచం కరోనా దెబ్బకి మూతేసుకోవడం వల్ల చైనా ఎగుమతులకు ఇబ్బంది వచ్చింది. ఫలితంగా వారి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతోంది.
అనేక దేశాల్లో చేస్తున్నట్టు ప్రభుత్వం పరిశ్రమలకు ఏ సాయమూ చేయకుండా ''ప్లీజ్! మీరంతా కార్మికులకు జీతాలివ్వండి'' అని చేతులు దులుపుకుంటే ఏ కంపెనీ జీతాలివ్వదు. ఇవ్వట్లేదు కూడాను! ఇంత సంక్షోభం మధ్య కూడా కొత్త పార్లమెంటు భవన సముదాయానికి మోడీ ప్రభుత్వం ఇరవైవేల కోట్ల ఆడంబరమైన ప్రణాళిక ప్రకటించింది. సాధారణ సమయాల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలు ఓట్లు రాల్చవచ్చు గాని సంక్షోభాల్లో కాదు. ''ఇప్పుడు పాలన (గవర్నెన్స్) ముఖ్యం'' అంటారు ఆర్టికల్ 14.కామ్ సంపాదకుడు సమర్ హలారంకర్.