Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రం చేయాల్సింది రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. ఉపాధి రంగాలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.7,500లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం కింద అందరికీ పనులు కల్పించాలి. వీటికి సంబంధించిన ప్రకటనేమైనా చేస్తారేమోనని ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వాలకూ, ప్రజలకూ ప్రధాని ఐదో ''సారీ'' శూన్యహస్తమే విదిల్చారు..!
నిర్దిష్ట ప్రణాళిక, సరైన వ్యూహం, సన్నద్దత లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా విజయం దిశగా పయనిస్తుందని అనుకోవడం ఒట్టి భ్రమ. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలోనూ కేంద్రప్రభుత్వం అనుసరించిన విధానం అలానే ఉన్నది. మూడు విడతలుగా లాక్‌డౌన్ ప్రకటించినా ఎక్కడి వేసిన గొంగడి అక్కడే. నాలుగో విడత లాక్‌డౌన్ ఉంటుందని ప్రధాని మోడీ సంకేతాలు ఇస్తూనే 'రెండు గజాల దూరం పాటించడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. ఎట్టిపరిస్థితుల్లో పట్టు సడలించకూడదు' అని సీఎంలకు సూచించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారతదేశం సాధించిన ''విజయానికి'' ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని ప్రధాని చెప్పుకోవడం తప్ప.. మూడు దశల లాక్‌డౌన్‌లో కరోనా కేసులు ఎందుకు పెరగాయన్న దానికి సమాధానం లేదు. దేశంతో పాటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. మరి సుమారు 50రోజుల లాక్‌డౌన్‌ను ఏమి చూసి ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నది ప్రశ్న. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, వాటికి చేయూతనివ్వాల్సిన కేంద్రప్రభుత్వం చేష్టలుడిగి కూచున్నది. ఆర్థికంగా ఆదుకోండని రాష్ట్రాలు కోరుతున్నా.. ఐదోసారి ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోడీ మళ్లీ శూన్యహస్తాలే చూపారు. పైగా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామీణ భారతాన్ని కాపాడాలని మరో కొత్త పిలుపునివ్వడం గమనార్హం. కరోనా కట్టడికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఆదుకోండని ఎంతగా ఘోషించినా ముఖ్యమంత్రులది కంఠశోషగానే మిగిలింది.
కరోనాపై విజయం సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు లాక్‌డౌన్ ప్రకటించాలని చెప్పాయి. కానీ అదొక్కటే పరిష్కారం మార్గం కాదని కూడా వక్కాణించాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటూనే ఆర్థికరంగాన్ని కాపాడుకోవాలని సూచించాయి. మన పాలకులు మాత్రం లాక్‌డౌన్ ఒక్కటి ప్రకటించి.. విజయం సాధించినట్టుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మొదటిదశ లాక్‌డౌన్ ప్రకటించిన రోజుకంటే మూడోదశ లాక్‌డౌన్ ముగింపునకు వచ్చేసరికి కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి చేరింది. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఆర్థికవ్యవస్థ దిగజారింది. ఉపాధి కోల్పోయి కార్మికులు, వలసకూలీలు రోడ్డున పడ్డారు. దీనంతంటికీ లాక్‌డౌన్ అమలు విషయంలో మోడీసర్కార్ అనుసరించిన నిర్లక్ష్యమే కారణం. మహా గొప్పగా లాక్‌డౌన్ ప్రకటించామని భుజాలు చరుచుకుంటే ఏంలాభం? కరోనాను విస్తరించకుండా ప్రజలను, దేశాన్ని రక్షించేందుకు ఏమిచర్యలు తీసుకున్నారన్నది ఇక్కడ ముఖ్యం. ఆ దిశగా కేంద్రం ఏ మాత్రం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదనడానికి దేశంలో నెలకొన్న పరిస్థితులే తాజా ఉదాహరణ. 'తొలి లాక్‌డౌన్‌లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు. రెండో దశనాటి చర్యలు మూడో దశలో అవసరం లేదు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగోదశలో అవసరం లేదు' అని మోడీ అంటున్నారు. అయితే, మూడు దశలుగా తీసుకున్న లాక్‌డౌన్‌లో ఏమి చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్న. ఒకసారి సడలింపులు, మరోసారి వలసకూలీలు వెళ్లేందుకు అనుమతులు తప్ప ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుకునేందుకు నిధులు ఇవ్వాలన్న రాష్ట్రాల అభ్యర్థనను ఆమోదించేందుకు మోడీ సిద్ధంగా లేకపోవడాన్ని ఏం అనుకోవాలి? ప్రజలకు ఉపాధి కల్పించి, కొనుగోలు శక్తి పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని రకాల సడలింపులు ఇచ్చినా ఉపయోగం ఏముంటుంది?
మార్చిలో రూ. లక్షా 70వేల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించినా అవి ఏ మూలకూ సరిపోలేదు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని, అసంఘటిత కార్మికులకు మూడునెలల పాటు వేతనాలివ్వాలని, రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, రుణాలు తెచ్చుకోవడానికి ఉన్న పరిమితులు ఎత్తివేయాలని సీఎంలు కోరినా ఇప్పటివరకు ఏ ఒక్కదానికీ ప్రధాని స్పష్టత ఇవ్వలేదు. కానీ కార్పొరేట్ల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మాత్రం వెనుకాముందు ఆలోచించలేదు. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సంస్థలకు కోట్ల రూపాయల రాయితీలను అందించగలిగారు గానీ, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. పైగా వలసకూలీలను తరలించడం కోసం అయ్యే ఖర్చునూ రాష్ట్రాలపైనే నెట్టింది కేంద్రం. వైద్యఆరోగ్యానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నెల 17 తర్వాత ఎలా ఉండాలో కేంద్రం వద్ద ప్రణాళిక ఉందా? అంటే ఆలోచించాల్సిందే. వైరస్‌ను అరికట్టడం కోసం ప్రధాని చెప్పే విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ప్రముఖలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో కేంద్రం చేయాల్సింది రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. ఉపాధి రంగాలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.7,500లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం కింద అందరికీ పనులు కల్పించాలి. వీటికి సంబంధించిన ప్రకటనేమైనా చేస్తారేమోనని ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వాలకూ, ప్రజలకూ ప్రధాని ఐదో ''సారీ'' శూన్యహస్తమే విదిల్చారు..!