Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు రాష్ట్రాలు సహనంతో సమస్యను పరిష్కరించుకోవాలి. చొరవ చూపాలి. తాత్సారం పనికిరాదు. నీళ్ల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏపీ సర్కారు చర్య తూట్లు పొడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన తరుణమిది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చిచ్చురేపుతున్నది. ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం దాదాపు ఆరేండ్ల తర్వాత మళ్లీ అగ్గిరాజుకుంటున్నది. తొలుత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లిన తెలుగు రాష్ట్రాల పెద్దలు, ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుకునే పరిస్థితులకు కారణమవుతున్నది. ఇందుకు జలవివాదమే కారణం కాగా, అందుకు ఏపీ సర్కారే బాధ్యురాలిగా కనిపిస్తున్నది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్దిపాడు హెడ్‌రెగ్యులేటర్ నీటి సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచడమే గాక, హంద్రినీవా దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30రోజులు తీసుకోవడానికి జీవో విడుదల చేసింది. వాస్తవానికి ఒక ప్రాజెక్టు చేపట్టాలనుకుంటే కేంద్రం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత రాష్ట్రంలో జల వివాదాల పరిష్కారానికి, కృష్ణారివర్‌బోర్డు, గోదావరి రివర్ బోర్డు ఏర్పాటయ్యాయి. కొత్త సమస్యల పరిష్కారానికిగానీ, ఏవైనా ప్రాజెక్టుల నిర్మాణానికిగానీ బోర్డు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే కేంద్రంలోని అపెక్స్ కౌన్సిల్‌ను సంప్రదించాలి. ఆ అపెక్స్ కౌన్సిల్‌లో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు సీఈలు, కన్వీనర్‌గా కేంద్రం సాగునీటిపారుదల శాఖ సీఈ కలిపి ఐదుగురు ఉంటారు. మొత్తం ఈ వ్యవస్థను పట్టించుకోకుండానే ఇవేవి లేకుండానే ఏకపక్షంగా 203 జీవోను ఏపీ విడుదల చేయడం ఇరురాష్ట్రాల సత్సంబంధాలకు విఘాతం కలిగించేదే. ఈ చర్య రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బకొట్టి, ప్రజల మధ్య శతృత్వాలకూ దారితీస్తుంది. సెప్టెంబరు 28, 2004లో జీవో 107 ప్రకారం శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ 835 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారు. 854 అడుగులకు తగ్గితే నీటి విడుదలను నిలిపేయాలి. అలాగే 2006, జనవరి 4న ఇచ్చిన జీవో మూడు ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44వేల క్యూసెక్కులకు పెంచడానికి నాడు శాసనసభలో అందరూ అంగీకరించారు. ఈ రెండు జీవోలను అనాటి సీఎం వైఎస్సార్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమల్లోనే ఉండాలి. కానీ, ప్రస్తుతం ఏపీ సీఎం 203 జీవో ద్వారా అంతకు ముందున్న రెండు జీవోలను బేఖాతరు చేసి పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచి, అలాగే శ్రీశైలం డెడ్‌స్టోరేజీని 805అడుగులకు కుదించారు. ప్రస్తుతం ఈ జీవో ఏకపక్షంగా విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ప్రజల్లోనూ ఆందోళన పెరిగింది. చివరికి తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం బోర్డు చాలా బలహీనంగా ఉందనీ, ఒక దశలో రెండు ప్రభుత్వాలు బోర్డు చేసిన నీటి కేటాయింపులను వ్యతిరేకించడంతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డు అలా చేయకుండా, తన నిర్ణయాన్ని ప్రకటించి, అమలుజరగకపోతే కేంద్రం పరిధిలో ఉండే అపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేయాలి. రాష్ట విభజన తర్వాత కృష్ణా నికర జాలాలు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. కానీ, తెలంగాణకు జురాల, రాజోలిబండ కేటాయింపులను నీళ్లు రాక పూర్తిగా వినియోగించడం లేదు. అంటే, తెలంగాణ తన వాటాను కూడా వాడుకోలేకపోతున్నది. ఇప్పుడు 203జీవో అమలైతే దక్షిణ తెలంగాణకు తీవ్రనష్టం జరిగే ప్రమాదముంది. ఏదైనా రెండు రాష్ట్రాల సాగునీటి పారుదలశాఖ అధికారులు చర్చలు, సంప్రదింపుల ద్వారా ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఈ తగాదా పెరిగి రెండు రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగించకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా మిగులు జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్మితమైన ప్రాజెక్టులకు కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పాల్సి ఉంది. ఆ తీర్పురాకముందే హక్కుల గురించి మాట్లాడటం అసంబద్ధమవుతుంది. ఏపీలో ఐదు ప్రాజెక్టులు, తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తయిన ప్రాజెక్టులకు మిగులు నీటి వినియోగం జరుగుతున్నది. ఈ కేటాయింపులను కృష్ణాబోర్డు చేస్తున్నది. ఈనేపథ్యంలో కృష్ణాజలాల సమస్యను చట్టబద్దంగా పరిష్కరించుకోవడం సమంజసంగా ఉంటుంది. ఇకపోతే ఏపీ జీవో 203ని అమలుచేస్తే తెలంగాణతోపాటు ఏపీలోని రెండు జిల్లాలు తీవ్ర కరువు, కాటకాలను ఎదుర్కొంటాయి. దుర్భిక్షం ఏర్పడుతుంది. కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు అందే ప్రశ్నేలేదు. వీటి పరిధిలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని 8లక్షల ఎకరాలకు నష్టం జరగనుంది. తాగునీటి సరఫరాకూ ఆటంకం కలిగే ప్రమాదం లేకపోలేదు. నికర జలాలనూ నష్టపోతారు. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని వామపక్షాలు చెబుతుండగా, కేసీఆర్, జగన్ మాట్లాడుకునే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెండు రాష్ట్రాలు సహనంతో సమస్యను పరిష్కరించు కోవాలి. చొరవ చూపాలి. తాత్సారం పనికిరాదు. నీళ్ల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏపీ సర్కారు చర్య తూట్లు పొడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన తరుణమిది.