Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సవరణ బిల్లును దేశవ్యాపిత విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఎటువంటి శషబిషలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఈ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి. మరో బృహత్తర పోరాటానికి దేశం సిద్ధం కావాలి.
పి.వి. నర్సింహారావుతో మొదలైంది. మోడీతో పరాకాష్టకు చేరింది. పేరుకి అవి రెండు పార్టీలు. పైగా ఒకదానికొకటి ఆపోజిట్ పార్టీలు. మొన్న ఏప్రిల్‌లో 2003 విద్యుత్ సవరణ బిల్లు (2020)తో పి.వి. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విద్యుత్ ప్రయివేటీకరణ ప్రక్రియకు పెట్టుబడిదార్ల ప్రియతముడన్న తన స్వార్థకతను రుజువు చేసుకున్నాడు మోడీ. దేశమంతా కరోనా కట్టడి కోసం తలమునకలై యున్న వేళ మోడీ ప్రభుత్వం అటు రాష్ట్రాల హక్కులను దెబ్బతీసింది రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేసింది.
2003 విద్యుత్ చట్ట (సవరణ) బిల్లు 2020 అర్థం కావాలంటే గత ముప్పయేండ్లలో విద్యుత్‌రంగ ప్రయివేటీకరణకి మన పాలకులు కరిచిన నానాగడ్డి, మూటగట్టుకున్న అపకీర్తి (అసలు ''కీర్తి'' ఉంటేగదా అనేది వేరే విషయం) మన పెట్టుబడిదారులు ఒకర్ని మార్చి ఒకర్ని పాలనలోకి తెచ్చుకున్న తీరు తెలియాలి.
సరళీకృత ఆర్థిక విధానాల రాక అప్పటి వరకు దేశంలో అవలంబించిన అభివృద్ధి నమూనాను తలక్రిందులు చేసింది. ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వచ్చాయి. అమెరికన్ కంపెనీ ఎన్రాన్ షరతుల వల్ల మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆదాయమే గాక మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా హారతికర్పూరమైంది. జనరేషన్‌లో ప్రయివేటీకరణ చేదు అనుభవాన్ని ఎన్రాన్ మనకు రుచి చూపింది. డిస్కాంల ప్రయివేటీకరణ వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఒరిస్సా మనముందు నిలిచింది. అమలు చేసిన పాలకుల పదవులు ఊడాయి.
పట్టువదలని పెట్టుబడిదారులు పాలకుల్ని మార్చి మార్చి చూస్తున్నారు. వాజ్‌పారు ప్రభుత్వ హయాంలో అప్పటిదాక ఉన్న విద్యుత్ చట్టాలన్నింటిని రద్దుచేస్తూ విద్యుత్ చట్టం 2003 అవతరించింది. అందులో ప్రయివేటువారికి అప్పనంగా లాభాలు కట్టబెట్టే అనేక అంశాలున్నా, అందులో కొన్ని అమల్లోకొచ్చినా ఆ పానకాల స్వాముల కడుపులు నిండలేదు. గుజరాత్‌లో పన్నెండేండ్లపాటు తన ''శక్తి సామర్థ్యాలు'' రుజువు చేసుకున్న మోడీని ఢిల్లీలో ప్రతిష్టించుకున్నారు. వెనువెంటనే విద్యుత్ చట్టం (సవరణ) బిల్లు 2014 లోక్‌సభలో ప్రవేశించింది. విద్యుత్‌రంగంలోని ఉద్యోగ సంఘాలేకాక అధికార్లు, ఇంజనీర్లు కూడా ప్రతిఘటించడంతో ప్రభుత్వం ముందుకు సాగలేకపోయింది.
లోక్‌సభలో బీజేపీ బలం పెరగడం, కాంగ్రెస్ చేష్టలుడిగి ఉండటం, వామపక్షాలు తప్ప మిగిలిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉండటం, అన్నింటికీ మించి దేశమంతా నేడు కరోనా పరేషాన్‌లో మునిగిపోయి ఉండటం.. ఇంతకుమించిన అవకాశం ఇంకేముంటుంది పెట్టుబడిదారులకు! ఈ నేపథ్యంలో విద్యుత్ సవరణ బిల్లు అసలు స్వరూపాన్ని చూద్దాం.. ఈ సవరణ ప్రజలపై భారాలు పెంచేది. ప్రయివేటీకరణ పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచేది. పైగా ప్రయివేటు కంపెనీలకు ఏ రిస్కు లేకుండా లాభాలు గ్యారంటీ చేసేది..
ముప్పయేండ్ల పాటు చేసిన ముసుగులో గుద్దులాటలు వద్దనుకుంది మోడీ పాలన. పైగా కరోనా 'మౌకా'లో తేలిగ్గా పాస్ చేసుకోవచ్చనేది మోడీ అండ్ కంపెనీ దురాలోచన! డిస్కాంల కింద సబ్‌లైసెన్సీలు, ఫ్రాంచైజీలకు వినియోగదారులకు సంబంధించిన ఏ బాధ్యతా లేకుండా ఇప్పుడున్న డిస్కాంలపై తోసేసి లాభాలు దండుకునే పని మాత్రం మిగిల్చింది ఈ సవరణ. ప్రయివేటు ఉత్పత్తి దారులు వినియోగదారుల నుంచి గోళ్ళూడగొట్టైనా తాము అమ్మిన కరెంటుకు వందశాతం రాబట్టుకోవాలనేది ఇంతకాలం ఆశ. ప్రకృతి విపత్తులొచ్చినా ప్రస్తుతంలా కరోనా మహమ్మారి విరుచుకు పడినా ప్రజలు బిల్లులయితే కట్టాలట! లేదా ప్రభుత్వాలు ఆ నష్టాన్ని భరించాలట! ప్రయివేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనే ముందే అప్పుపత్రం రాసివ్వడమో, తన ఆస్తులను తాకట్టు పెట్టుకోవడమో, 'ఎస్క్రో' అకౌంట్ ద్వారా చెల్లించే ఏర్పాటో చేయాలని ఈ సవరణ పేర్కొంది. దానికోసం చట్టరీత్యా హక్కులు గల 'ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ' ఏర్పాటు చేస్తారట!
రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల్ని సైతం జాతీయస్థాయిలో ఎంపిక చేయడమంటే రాష్ట్రాలకున్న హక్కుల్ని కుదించడమే. వాటిని ప్రేక్షక పాత్రలోకి నెట్టడమే! క్రాస్ సబ్సిడీ విధానం గత దెబ్బయేండ్లుగా అమలవుతోంది. ధనికులనుంచి, వాణిజ్య వినియోగదారుల నుంచి భారీ పరిశ్రమల నుంచి కాస్ట్ టు సర్వ్ కంటే అధికమొత్తం టారిఫ్ వసూలు చేసి గృహ, వ్యవసాయ వినియోగదారులకు సబ్సిడీ ఇస్తారు. ఈ క్రాస్ సబ్సిడీని ఈ సవరణ బిల్లు తీసివేస్తుంది. అంటే ధనికులకు భారం తగ్గుతుంది. పేదలకు పెరుగుతుంది. విద్యుత్ ఎగుమతి, దిగుమతి వ్యాపారం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందట. అంటే ఇరాన్ నుంచి గ్యాస్‌పైప్‌లైన్ వేసినట్టు ఎలక్ట్రికల్ ట్రాన్స్‌మిషన్ లైన్లు వేసుకుంటే?! చౌక విద్యుత్ వచ్చిపడితే మన జనరేషన్ కేంద్రాలనేమిచేసుకుంటాం? ఇప్పుడున్న ఉద్యోగులందర్ని ఏమిచేస్తారు?
అందుకే ఈ సవరణ బిల్లును దేశవ్యాపిత విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఎటువంటి శషబిషలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఈ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి. మరో బృహత్తర పోరాటానికి దేశం సిద్ధం కావాలి.